IPL: ఐపీఎల్‌ కేవలం డబ్బు కోసమే కాదు: గంగూలీ

ABN , First Publish Date - 2022-06-16T03:26:33+05:30 IST

ఐపీఎల్ మీడియా హక్కుల ఈ -వేలం ముగిసింది. ఈ హక్కులను అమ్మడం ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. 23 వేల 575 కోట్లతో టీవీ ప్రసార హక్కులను..

IPL: ఐపీఎల్‌ కేవలం డబ్బు కోసమే కాదు: గంగూలీ

ఐపీఎల్ మీడియా హక్కుల ఈ -వేలం ముగిసింది. ఈ హక్కులను అమ్మడం ద్వారా బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. 23 వేల 575 కోట్లతో టీవీ ప్రసార హక్కులను స్టార్ ఇండియా దక్కించుకోగా.. ఐపీఎల్ డిజిటల్ హక్కులను రిలయన్స్ కు చెందిన వయాకామ్ 18 దక్కించుకుంది. టీవీ హక్కుల కంటే ఎక్కువ మొత్తంలో 23 వేల 758 కోట్లతో డిజిటల్ హక్కులను వయాకామ్ దక్కించుకుందని జై షా వెల్లడించారు. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల మొత్తం విలువ 48 వేల 390 కోట్లకు చేరుకుందని ప్రకటించారు. అయితే మీడియా హక్కుల అమ్మకం ద్వారా భారీ ఆదాయం సమాకూరడంపై  బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సంతోషం వ్యక్తం చేశాడు. క్రికెట్‌ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని చెప్పుకొచ్చాడు. ఇది ప్రతిభకు సంబంధించిన అంశమని వెల్లడించాడు.



యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఇది మంచి ప్రేరణనిస్తుందని తెలిపాడు. తద్వారా భారత జట్టుకు మేలు జరుగుతుందని చెప్పాడు. అలాగే ప్రపంచస్థాయి అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని గంగూలీ వివరించాడు. గత 50 ఏళ్లలో క్రికెట్‌కు ఆదరణ తీసుకువచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు తెలిపాడు. అలాగే క్రికెట్‌కు అంతగా ఆదరణ లేనప్పుడు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి.. టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు చూసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.

Updated Date - 2022-06-16T03:26:33+05:30 IST