ఐపీఎల్ జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు: బట్లర్

ABN , First Publish Date - 2020-04-08T00:03:31+05:30 IST

కరోనా వైరస్ కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నమెంట్‌ను ఏప్రిల్

ఐపీఎల్ జరగకపోవడం నిజంగా సిగ్గుచేటు: బట్లర్

లండన్: కరోనా వైరస్ కారణంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ వాయిదాపడిన విషయం తెలిసిందే. తొలుత ఈ టోర్నమెంట్‌ను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా వేసినా.. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో.. అసలు ఈ ఏడాది ఐపీఎల్ జరుగుతుందా.. లేదా.. అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. 


అయితే ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ జరగకపోవడం.. నిజంగా సిగ్గు చేటు అని ఇంగ్లండ్ కీపర్ జాస్ బట్లర్ అన్నాడు. ‘‘ఐపీఎల్ గురించి ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కాబట్టి, అది జరుగుతుందా.. లేదా.. అనే విషయంపై ఇప్పడే స్పష్టత రాదు’’ అని బట్లర్ అన్నాడు.


అయితే ఐపీఎల్ జరగకపోతే.. అది అర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుందని బట్లర్ అభిప్రాయపడ్డాడు. ‘‘ఇది చాలా పెద్ద టోర్నమెంట్. దీని నుండి వచ్చే ఆదాయము చిన్నది కాదు. క్రికెట్‌లో ఈ టోర్నమెంట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి టోర్నమెంట్ జరగకపోవడం నిజంగా సిగ్గు చేటు. కాబట్టి ఆ టోర్నమెంట్‌ షెడ్యూల్‌ని కాస్త ముందుకు జరిపి.. సజావుగా టోర్నీ జరిగేందుకు అనుమతి ఇవ్వాలి’’ అని అతను పేర్కొన్నాడు. ‘‘ఆటగాళ్లుగా ఈ టోర్నమెంట్ ప్రభావం ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఎందరో యువ క్రికెటర్లకు ఈ టోర్నీ మంచి అవకాశాలను కల్పిస్తుంది. నిజానికి ఈ టోర్నమెంట్ నిర్వహించే ముఖ్య ఉద్దేశం కూడా అదే’’ అని అతను అన్నాడు.

Updated Date - 2020-04-08T00:03:31+05:30 IST