ఆరు వేదికల్లో ఐపీఎల్‌!

ABN , First Publish Date - 2021-03-01T09:48:45+05:30 IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-14వ సీజన్‌ను దేశంలోని ఆరు నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం ..

ఆరు వేదికల్లో ఐపీఎల్‌!

జాబితాలో లేని హైదరాబాద్‌

హెచ్‌సీఏ రాజకీయాలే కారణం


ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-14వ సీజన్‌ను దేశంలోని ఆరు నగరాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందుకోసం ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, ఢిల్లీలను ఎంపిక చేశారు. చివరి నిమిషంలో ఢిల్లీని ఈ జాబితాలో చేర్చినట్టు సమాచారం. ఇక అహ్మదాబాద్‌ పేరిట ఏ ఫ్రాంచైజీ లేకపోయినా అక్కడి భారీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనే కారణంతో ఎంపిక చేశారు. ఏప్రిల్‌ రెండో వారంలో ఈ లీగ్‌ ప్రారంభం కానుంది. గతంలో ముంబై, పుణెలలో మ్యాచ్‌లను జరిపి మొతేరాలో నాకౌట్‌ మ్యాచ్‌లను ఆడించాలని భావించారు. కానీ మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో బోర్డు పునరాలోచనలో పడింది. అయినా ఈ లిస్టులో ముంబైని కూడా చేర్చడం ఆశ్చర్యపరిచింది. అయితే వాంఖడేలో మ్యాచ్‌లను ఆడించేందుకు మహా ప్రభుత్వం అంగీకరించింది. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదు. మిగతా చోట్ల 50 శాతం ప్రేక్షకులతో మ్యాచ్‌లు జరిగే చాన్సుంది. 


ఎలా నిర్వహిస్తారో..?

మరోవైపు వేదికలపై తమ నిర్ణయాన్ని బీసీసీఐ ఇంకా ఆయా ఫ్రాంచైజీలకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. అయినా ఆరు నగరాల్లో బయో బబుల్‌ను ఎలా ఏర్పాటు చేయగలరో వేచిచూడాలని పలువురు ఫ్రాంచైజీ అధికారులు తెలిపారు. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తాజా పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ‘వాస్తవానికి ఇన్ని నగరాల్లో మ్యాచ్‌లంటే కాస్త భయంగానే ఉంది. ఒకటి, రెండు నగరాల్లో అంటే ఓకే. గతేడాది ఐపీఎల్‌ కూడా మూడు వేదికల్లోనే జరిగింది’ అని ఓ జట్టు అధికారి గుర్తుచేశాడు. బోర్డు ప్రతిపాదనల ప్రకారం.. 8 జట్లు గ్రూపులుగా విడిపోవాలి. మ్యాచ్‌లు వేదికల వారీగా జరుగుతాయి. 

Updated Date - 2021-03-01T09:48:45+05:30 IST