ఇంగ్లీష్ ఆటగాళ్లు ఎదగడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ఉపయోగపడిందని ఇంగ్లండ్ ఆటగాడు జాస్ బట్లర్ అన్నాడు. ఐసీసీ ప్రపంచకప్‌ల తర్వాత ఐపీఎల్‌యే ప్రపంచంలో అత్యుత్తమ క్రికెట్ టోర్నమెంట్ అని అతను అభిప్రాయపడ్డాడు. కోవిడ్-19 సమస్య పరిష్కారం అయిన తర్వాత ఐపీఎల్ ఆడాలనే కోరిక తనకు బలంగా ఉందని బట్లర్ పేర్కొన్నాడు.
2016-17 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన బట్లర్ ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ గూటికి చేరాడు. ‘‘ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మంది ఇంగ్లండ్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడటం వల్ల లాభపడ్డారు. ఆ లీగ్ ఆడాలని నాకు చాలా ఆశగా ఉంది. నా దృష్టిలో ప్రపంచకప్ తర్వాత అదే అత్యుత్తమ టోర్నమెంట్’’ అని బట్లర్ అన్నాడు.
అయితే ఇంగ్లండ్ క్రికెటర్లు ఐపీఎల్ ఆడేందుకు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్ కారణమని బట్లర్ తెలిపాడు. ‘‘ఐపీఎల్‌తో ఇంగ్లండ్ క్రికెట్‌కి మంచి సంబంధం ఉంది. అందరి అడ్డంకులను కెవిన్ పీటర్‌సన్ తొలగించారు. ఐపీఎల్ ఆడేందుకు మా అందరికీ ఆయనే బాటలు వేశారు. అంతేకాక.. క్రికెటర్లకు ఐపీఎల్ ఎంత ముఖ్యమో తెలిసేలా చేశారు’’ అని బట్లర్ పేర్కొన్నాడు.