IPL 2022: మెగా వేలానికి రంగం సిద్ధం!

ABN , First Publish Date - 2022-01-11T23:33:22+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని

IPL 2022: మెగా వేలానికి రంగం సిద్ధం!

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో వేలం నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐపీఎల్‌ను స్పాన్సర్ చేస్తున్న చైనీస్ మొబైల్ మేకర్ వివో స్థానంలో టాటా గ్రూప్ వచ్చి చేరింది. ఈ విషయాన్ని ఐపీఎల్ చైర్మన్ బ్రజేష్ పటేల్ నిర్ధారించారు.


లక్నో, అహ్మదాబాద్ జట్లు ఈ ఏడాది ప్రీమియర్ లీగ్‌లో భాగం కానున్నాయి. వీటితో కలుపుకుని ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో తలపడనున్న మొత్తం జట్ల సంఖ్య పదికి చేరింది. రూ. 7,090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని ఆర్‌పీసీజీ గ్రూప్ దక్కించుకోగా, అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సీవీసీ కేపిటల్ రూ. 5,625 కోట్లకు చేజిక్కించుకుంది. 


కొత్తగా వచ్చిన చేరిన రెండు ఫ్రాంచైజీలు ఇప్పటికే ఆటగాళ్ల ఎంపికలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటి వరకు 8 జట్లు గరిష్టంగా 4 ఆటగాళ్లను రిటైన్ చేసుకుని మిగతా వారిని రిలీజ్ చేశాయి. వారి నుంచి కొత్త జట్లు తమ ఆటగాళ్లను ఎంచుకోనున్నాయి.


మరోవైపు, కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్‌ అర్ధంతరంగా దుబాయ్‌కు తరలిపోయింది. రెండో అంచె మ్యాచ్‌లు మొత్తం అక్కడే జరిగాయి. కాగా, ఈసారి ఐపీఎల్ వేదిక ఎక్కడన్న విషయాన్ని బీసీసీఐ ఇంకా నిర్ణయించలేదు. అయితే, గరిష్టంగా నాలుగైదు వేదికలపై నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.  

Updated Date - 2022-01-11T23:33:22+05:30 IST