కాబూల్: ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రసారంపై తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉండడంతో ఆ మ్యాచ్‌లను ప్రసారం చేయవద్దని ఆఫ్ఘనిస్థాన్ మీడియాకు వార్నింగ్ ఇచ్చారు. తాలిబన్ల నిర్ణయంతో మీడియా సంస్థలు, జర్నలిస్టులు అవాక్కయ్యారు. ఇది చాలా దారుణమని, ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయకుండా తాలిబన్లు నిషేధం విధించారని ఆఫ్ఘనిస్థాన్ జర్నలిస్టు ఫవాద్ అమన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. స్టేడియంలలో మహిళలు డ్యాన్స్ చేస్తున్నారని, అలాగే, మహిళా ప్రేక్షకులు ఉండడంతో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని హెచ్చరించారని ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో కరోనా రెండో దశ విజృంభణ కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ ఈ ఆదివారం యూఏఈలో తిరిగి ప్రారంభమైంది. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు జరిగాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ పోటీపడగా, నిన్న జరిగిన రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. నేడు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ నాకౌట్ స్టేజ్ అక్టోబరు 10 నుంచి ప్రారంభం కానుండగా, 15న ఫైనల్ జరుగుంది.
ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక వినోద కార్యక్రమాలపై నిషేధం విధించారు. చాలా వరకు క్రీడలను నిషేధించగా, మహిళలు క్రీడల్లో పాల్గొనకుండా పూర్తిగా నిషేధించారు. అయితే, పురుషుల క్రికెట్‌పై మాత్రం సానుకూలంగా వ్యవహరించారు.