ఐదుగురితో ముందుకు?

ABN , First Publish Date - 2020-11-23T09:34:21+05:30 IST

దాదాపు రెండు వారాల క్రితమే ఐపీఎల్‌-13వ సీజన్‌ దిగ్విజయంగా ముగిసింది. ఇక ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీల దృష్టంతా 2021 సీజన్‌ వైపు మళ్లింది.

ఐదుగురితో   ముందుకు?

ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లపై సమాలోచ

ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి 


న్యూఢిల్లీ: దాదాపు రెండు వారాల క్రితమే ఐపీఎల్‌-13వ సీజన్‌ దిగ్విజయంగా ముగిసింది. ఇక ఇప్పుడు ఆయా ఫ్రాంచైజీల దృష్టంతా 2021 సీజన్‌ వైపు మళ్లింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే 14వ సీజన్‌లో భారీ మార్పులే కనిపించబోతున్నాయి. ఇప్పటికే లీగ్‌లో తొమ్మిదో జట్టును కూడా చేర్చబోతున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. అలాగే మెగా వేలం ఎలాగూ ఉండబోతోంది. చాలా జట్లకు తమ బృందాన్ని మరింత పటిష్టపర్చుకునే దిశగా ఈ వేలం ఉపయోగపడుతుంది. ఇక అన్నింటికంటే ముఖ్యంగా నిబంధనల్లోనూ పలు మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ప్రతిపాదన అతి ముఖ్యం కానుంది. ప్రస్తుతం తుది 11 మంది ఆటగాళ్లలో నలుగురు విదేశీ ప్లేయర్స్‌ను మాత్రమే అనుమతిస్తున్నారు. కానీ కొంతకాలంగా ఆయా ఫ్రాంచైజీలు ఈ విషయంలో సడలింపులు ఉండాలని కోరుతున్నాయి. అయితే ఈ విషయమై బీసీసీఐ ఇప్పటిదాకా దృష్టి సారించలేదు. కానీ మరోసారి ఫ్రాంచైజీల నుంచి ఒత్తిడి వస్తే బోర్డు సరైన సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ ఉన్నతాధికారి పేర్కొన్నాడు. అలాగే కొత్త జట్టు చేరికతో కొన్ని రూల్స్‌ కూడా మారవచ్చని చెప్పాడు.  


రెండు గ్రూపులుగా:

వచ్చే ఏడాది ఐపీఎల్‌ జట్ల సంఖ్య 8కి బదులుగా 9-10 ఉంటే ఇప్పటిలా రౌండ్‌ రాబిన్‌లో కాకుండా రెండు గ్రూపులుగా ఆడించే అవకాశం ఉంటుంది. 


విదేశీ ఆటగాళ్ల సంఖ్య పెంపు: మ్యాచ్‌ల్లో మరింత పోటీతత్వం తీసుకొచ్చేందుకు తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్యను ఐదుకు పెంచవచ్చు. ఇదే విషయాన్ని పలు ఫ్రాంచైజీలు కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. 


పవర్‌ సర్జ్‌:

ఈ ఏడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో కొత్త నిబంధనలు తీసుకువస్తున్నారు. వీటిలో పవర్‌ సర్జ్‌, ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ఉన్నాయి. వచ్చే ఐపీఎల్‌లో కూడా ఈ రెండింటిని అమలు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో లీగ్‌ పాలక మండలి ఉన్నట్టు సమాచారం. 11వ ఓవర్‌ తర్వాత ఏ సమయంలోనైనా బ్యాటింగ్‌ జట్టు రెండు ఓవర్ల పాటు పవర్‌ సర్జ్‌ తీసుకోవచ్చు. ఈ సమయంలో పవర్‌ప్లే మాదిరే 30 గజాల అవుట్‌సైడ్‌ సర్కిల్‌లో ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. అలాగే ఎక్స్‌ ఫ్యాక్టర్‌ రూల్‌లో భాగంగా సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు బ్యాటింగ్‌ లేదా బౌలింగ్‌ చేసేలా మార్పు తీసుకురావచ్చు.  

Updated Date - 2020-11-23T09:34:21+05:30 IST