ఐపీఎల్‌కు కరోనా సెగ

ABN , First Publish Date - 2021-05-04T09:32:37+05:30 IST

ఐపీఎల్‌-14వ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తితో పాటు పేసర్‌ సందీప్‌ వారియర్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం స్థానిక నరేంద్ర మోదీ మైదానంలో కేకేఆర్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను వాయిదా

ఐపీఎల్‌కు కరోనా సెగ

వరుణ్‌, సందీప్‌ వారియర్‌కు పాజిటివ్‌

ఐసోలేషన్‌లో కేకేఆర్‌

బెంగళూరుతో మ్యాచ్‌ వాయిదా

చెన్నై జట్టులోనూ కలకలం


దేశంలో లక్షలాది కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నా.. ఇప్పటి వరకైతే ఐపీఎల్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయింది. కానీ సోమవారం ఒక్కసారిగా ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లోనూ కలకలం చోటు చేసుకుంది. పటిష్ఠమైన బయో బబుల్‌ రక్షణలో ఉన్న ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఈ దెబ్బకు బెంగళూరుతో జరగాల్సిన మ్యాచ్‌నే వాయిదా వేయాల్సి వచ్చింది. అటు చెన్నై సీఈఓ, బౌలింగ్‌ కోచ్‌తో పాటు.. ఢిల్లీ మైదానం స్టాఫ్‌ కూడా ఈ వైరస్‌ బారిన పడడంతో లీగ్‌ నిర్వహణపై సందిగ్ధత ఏర్పడుతోంది. 


అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-14వ సీజన్‌కు కరోనా సెగ గట్టిగానే తాకింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తితో పాటు పేసర్‌ సందీప్‌ వారియర్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం స్థానిక నరేంద్ర మోదీ మైదానంలో కేకేఆర్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ను వాయిదా వేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. తిరిగి ఎప్పుడనేది ఇంకా తెలుపలేదు. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా ఓ మ్యాచ్‌ను నిర్వహించకపోవడం ఇదే తొలిసారి. గత నాలుగు రోజుల్లో ఈ ఇద్దరికి మూడుసార్లు టెస్టులు జరపగా పాజిటివ్‌గా తేలారని బోర్డు పేర్కొంది. అయితే మిగతా ఆటగాళ్లకు మాత్రం నెగెటివ్‌ ఫలితం వచ్చింది. కానీ ఈ ఇద్దరితో పాటు మిగతా కేకేఆర్‌ ఆటగాళ్లంతా వారం రోజులు ఐసోలేషన్‌లో ఉండబోతున్నారు. ఇక ఆ ఇద్దరితో గత 48 గంటలుగా సన్నిహితంగా ఉన్న వారి శాంపిల్స్‌ను సేకరించనున్నారు. అలాగే కేకేఆర్‌ ఆటగాళ్లకు ప్రతీరోజు ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులను నిర్వహిస్తారు.


కోల్‌కతా జట్టు చివరిసారిగా ఏప్రిల్‌ 29న ఢిల్లీతో మ్యాచ్‌ ఆడింది. ఆ మ్యాచ్‌లో వరుణ్‌ కూడా ఆడాడు. మ్యాచ్‌ ముగిశాక డీసీ ఆటగాళ్లతో అతడు కలిసే అవకాశం ఉంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లలోనూ గుబులు రేగుతోంది. ఈనెల 8న మరోసారి ఢిల్లీ జట్టుతో ఆడాల్సి ఉండగా ప్లేయర్స్‌ ఐసోలేషన్‌లో ఉండడంతో ఈ మ్యాచ్‌ను ఏం చేస్తారో వేచి చూడాల్సిందే..


బయో బబుల్‌లో ఎలా?

ఈ భూమ్మీద అత్యంత రక్షణాత్మక వ్యవస్థ అంటూ ఐపీఎల్‌ బయో బబుల్‌ గురించి బీసీసీఐ ఘనంగా చెప్పుకొంటుంది. ఏడు రోజుల క్వారంటైన్‌.. మూడు సార్లు కరోనా నెగెటివ్‌ ఫలితం తర్వాతే ఆటగాళ్లు, స్టాఫ్‌, కుటుంబసభ్యులకు ఇందులో ప్రవేశం ఉంటుంది. అలాంటిది బబుల్‌లో ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పాజిటివ్‌గా తేలడం అందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది. అయితే అనధికారిక సమాచారం ప్రకారం.. వరుణ్‌ ప్రస్తుతం భుజం గాయంతో బాధపడుతున్నాడు. స్కానింగ్‌ కోసం అతడు అధికారిక గ్రీన్‌ చానెల్‌ ద్వారా అన్ని జాగ్రత్తలతోనే బబుల్‌ను వీడి ఆస్పత్రికి వెళ్లాడు. కానీ అక్కడే అతనికి కరోనా సోకినట్టు సమాచారం. ఇక వరుణ్‌ ద్వారా సందీ్‌పకు వచ్చివుంటుంది. నిబంధనల ప్రకారం బబుల్‌లో ఉన్న వ్యక్తికి కరోనా వస్తే 10 రోజుల ఐసోలేషన్‌లో ఉంటాడు. అలాగే 9, 10వ రోజున ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులు జరుపుతారు. నెగెటివ్‌ వస్తేనే తిరిగి బబుల్‌లో అడుగుపెట్టాల్సి ఉంటుంది.



ఢిల్లీ స్టేడియంలో ఐదుగురికి..

ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలోని ఐదుగురు సిబ్బందికి కరోనా సోకింది. దీంతో వెంటనే వీరిని ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌, చెన్నై, ముంబై జట్లున్నాయి. అలాగే నేడు (మంగళవారం) ముంబై-హైదరాబాద్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తారా? లేదా? అనేది కూడా సందేహంగా మారింది. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 8 వరకు అక్కడ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.


ఐపీఎల్‌ వాయిదా తప్పదా!

తాజా కరోనా కలకలంతో ఐపీఎల్‌ ముందుకు సాగడంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేకేఆర్‌, చెన్నై జట్టులో వెలుగుచూసిన కేసులు బీసీసీఐని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సహజంగానైతే ధీమాగా కనిపించే బోర్డు అధికారులు ఈసారి మాత్రం లీగ్‌ నిర్వహణపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ‘పరిస్థితి ఇప్పుడు మరీ క్లిష్టంగా తయారైంది. కేకేఆర్‌ శిబిరంలో పాజిటివ్‌ కేసులతో మేం షాక్‌కు గురయ్యాం. ఇది ఎలా జరిగిందో అంచనా వేస్తున్నాం. వారిద్దరు కచ్చితంగా ఇతరులను కలుసుకున్నట్టున్నారు. ఇప్పటిదాకా అయితే అధికారికంగా చర్చించలేదు కానీ.. పరిస్థితులు ఇలాగే ఉంటే లీగ్‌ను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.


ఇప్పటికే వాయిదా పడిన మ్యాచ్‌ను షెడ్యూల్‌ చేయడం కష్టం. నా అంచనా ప్రకారం ఏ ఆటగాడి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేయకూడదు’ అని బోర్డు ఉన్నతాధికారి స్పష్టం చేశాడు. మరోవైపు ఇప్పటికే బబుల్‌లో ఉండలేక జంపా, రిచర్డ్‌సన్‌, టై, లివింగ్‌స్టోన్‌ స్వదేశాలకు వెళ్లిపోయారు. అశ్విన్‌, అంపైర్‌ నితిన్‌ మీనన్‌ కుటుంబాల్లో కరోనా కారణంగా అర్ధంతరంగా ఐపీఎల్‌ వీడాడు. మ్యాచ్‌ రెఫరీ మను నాయర్‌ కూడా స్వస్థలానికి వెళ్లాడు.


చెన్నై జట్టులోనూ...

కోల్‌కతా టీమ్‌లో పాజిటివ్‌ వ్యవహారం బయటపడిన కొన్ని గంటల్లోనే చెన్నై సూపర్‌ కింగ్స్‌లోనూ మూడు కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఇందులో బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీ, జట్టు సీఈఓ కాశీ విశ్వనాథ్‌, జట్టు ప్రయాణించే బస్సు క్లీనర్‌ ఉన్నారు. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో వీరికి పాజిటివ్‌గా వచ్చింది. అయితే సోమవారం ర్యాపిడ్‌ యాంటిజెన్‌లో మాత్రం నెగెటివ్‌ ఫలితం వచ్చింది. కాగా తొలుత వచ్చిన రిపోర్టులు తప్పని, ఆ జట్టులో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని బీసీసీఐ ప్రకటించింది. మరోవైపు చెన్నై జట్టు తమ ప్రాక్టీస్‌ను ఆపేసి హోటల్‌ గదులకే పరిమితమైంది.


ప్రధానీ...ఇంత దారుణమేంటి ?

ఆసీస్‌ మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ మైకేల్‌ స్లేటర్‌ బయో బబుల్‌ను వీడి మాల్దీవ్స్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి స్వదేశం ఆసీ్‌సకు వెళ్లాలనేది అతడి ఆలోచన. కానీ భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణీకులపై మే 15 వరకు అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అతిక్రమిస్తే ఐదేళ్ల జైలుశిక్ష ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నిర్ణయంపై స్లేటర్‌ విరుచుకుపడ్డాడు. ‘మా భద్రత గురించి పట్టింపు ఉంటే ఆసీస్‌కు అనుమతించాలి.  అలాకాకుండా ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ప్రధానీ.. మా ప్రాణాలకు మీదే బాధ్యత. ఐపీఎల్‌లో పనిచేసేందుకు నాకు అనుమతి ఉంది. కానీ ఇప్పుడు అదే ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది’ అని ఘాటుగా ట్వీట్‌ చేశాడు. మరోవైపు భారత్‌లో ఉన్న తమ క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలను నడిపే ఆలోచన లేదని క్రికెట్‌ ఆస్ర్టేలియా (సీఏ) సీఈవో నిక్‌ హాక్లే తేల్చారు.

Updated Date - 2021-05-04T09:32:37+05:30 IST