ప్రజలొకచోట.. పాలనొకచోట..

ABN , First Publish Date - 2022-01-23T05:25:15+05:30 IST

ప్రజలొకచోట.. పాలనొకచోట..

ప్రజలొకచోట.. పాలనొకచోట..
హనుమకొండ వడ్డెపల్లి రోడ్డులో ఐనవోలు ఎంపీడీవో కార్యాలయం

 ఐనవోలు, జనవరి 22: పరిపాలన సౌలభ్యం పేరుతో ఏర్పాటుచేసిన కొత్త మండలాల్లో పాలన పరిహాసమవుతోంది. కొత్త మండలాలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా కార్యాలయాల ఏర్పాటు జరుగక జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. కొత్తగా మండలం ఏర్పడితే పాలన దగ్గరికి చేరుతుందనుకుంటే పెనం నుంచి పోయిలో పడ్డ చందంగా మారిందని ప్రజాప్రతినిధులు, ప్రజలు మథనపడుతున్నారు. ఇందుకు ఐనవోలు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయమే ప్రత్యేక్ష ఉదాహరణ.  ఐనవోలు మండలం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంటే, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయం మాత్రం హనుమకొండలోని పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతుండటం గమనార్హం. 

జిల్లా, మండలాల పునర్విభజనలో భాగంగా వర్ధన్నపేట, జఫర్‌గడ్‌, హనుమకొండ రూరల్‌ మండలాలు మొత్తం 16 గ్రామ పంచాయితీలతో ఐనవోలు మండలాన్ని ఏర్పాటు చేశారు. మండల ప్రజాపరిషత్‌(ఎంపీడీవో) కార్యాలయం మాత్రం హనుమకొండ వడ్డెపల్లిలోని పాత కార్యాలయంలో కొనసాగుతోంది. తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఐనవోలు ఎస్సీ బాలుర వసతిగృహంలో, పోలీ్‌సస్టేషన్‌ కార్యాలయాన్ని మల్లికార్జునస్వామి దేవస్థానం ప్రాంగణంలోని సత్రంలో ఏర్పాటు చేయగా, వ్యవసాయశాఖ ఏవో కార్యాలయం కమ్యూనిటీ హాల్‌లో పెట్టి చేతులు దులుపుకున్నారని ప్రజలు ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో కార్యాలయం హనుమకొండలో ఉండడంతో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ పారదర్శకంగా లేకుండా పోయిందని స్థానిక ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.  

ఐనవోలులోనే ఏర్పాటు చేయాలి

ఎంపీడీవో కార్యాలయాన్ని ఐనవోలులో ఏర్పాటు చేయాలని ప్రజలతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మొరపెట్టుకుంటున్నారు. ఈ మేరకు మండల సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తిర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించి నెలలు గడుస్తున్నా నేటికీ అతిగతీ లేకుండా పోయింది. ఆయా గ్రామాల ప్రజలు పనిమీద ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లాలంటే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి ఉండడంతో రవాణాభారం పెరుగుతోంది.  

మంత్రి ఎర్రబెల్లిపై ఆశలు

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆదివారం ఐనవోలు మల్లన్నను దర్శించు కొని, అభివృద్ధిపై  సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో ఎంపీడీవో కార్యాలయం సమస్యకు పరిష్కారం లభిస్తుం దని జనం ఆశిస్తున్నారు. 



Updated Date - 2022-01-23T05:25:15+05:30 IST