వాహనమిత్రకు ఆహ్వానం

ABN , First Publish Date - 2020-05-24T09:58:01+05:30 IST

సొంతంగా ఆటో, కారు, క్యాబ్‌ కొనుక్కుని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న వాహనదారులకు చేయూతనిచ్చే ..

వాహనమిత్రకు ఆహ్వానం

ఈనెల 28 వరకు దరఖాస్తుల స్వీకరణ

ఏలూరు, మే 23 (ఆంధ్రజ్యోతి) : సొంతంగా ఆటో, కారు, క్యాబ్‌ కొనుక్కుని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న వాహనదారులకు చేయూతనిచ్చే వాహనమిత్ర పథకం రెండో దఫా ప్రక్రియ మొదలైంది. ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణను జిల్లా రవాణా శాఖ ప్రారంభించింది. సంబంధిత ఆధార పత్రాలను జతచేసి దరఖాస్తులను గ్రామ, వార్డు వలంటీర్లు, కార్యదర్శులకు అందజేయవచ్చని రవాణాశాఖ ఉప కమిషనర్‌ పురేంద్ర తెలిపారు. సంబంధిత ఎంపీడీవోలు, మునిసిపల్‌ కమిషనర్‌లు పరిశీలించి ఈనెల 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ముత్యాలరాజు శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు.


అర్హులైన లబ్ధి దారులకు జూన్‌ 4వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌చే ఆన్‌లైన్‌లో  చెల్లింపులు చేస్తారన్నారు. ఈ ఏడాది ఈ పథకం ద్వారా 19 వేల మందికి లబ్ధి చేకూరుతుందని అధికా రులు అంచనా వేస్తున్నారు. కిందటేడాది జిల్లాలోని 16,880 మందికి ఈ పథకం ద్వారా రూ.10 వేలు చొప్పున లబ్ధి చేకూరింది. కిందటేడాది 17,366 దరఖాస్తులు రాగా వాటిలో 17,101 మంది అర్హులుగా తేల్చారు. వీరిలో 15,812 మంది ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు 888 మంది, క్యాబ్‌ డ్రైవర్లు 401 మంది ఉన్నారు. వీటిలో 221 దరఖాస్తులు సాంకేతిక సమస్య కారణంగా అప్‌లోడ్‌ కాక పోవడంతో మిగిలిన 16,880 మందికే లబ్ధి చేకూరింది. ఈ ఏడాది మరో 2100 మంది అర్హత పొందే అవకాశం ఉందని అంచనా. పోయిన అక్టోబరు నుంచి ఈ మే నెల వరకు 1236 మంది కొత్తగా వాహన రిజిస్ట్రేషన్లు చేసుకు న్నారు. బదిలీ అయిన వాహనాలు మరో 625 ఉన్నాయి. వీటితో పాటు కింద టేడాది ఆగిపోయినవి 221 ఉన్నాయి. ఇవన్నీ కలిపితే ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య 19 వేల మందికి చేరు తుందని భావిస్తున్నారు. దరఖాస్తుతో పాటు తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, కులధ్రువీకరణ పత్రం, వాహన రిజి స్ట్రేషన్‌ పత్రం, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంకు పాస్‌ పుస్తకం నఖళ్లు జతచేయాలి.

Updated Date - 2020-05-24T09:58:01+05:30 IST