రిలయన్స్‌ రిటైల్‌ కోసం ఇన్వెస్టర్లు క్యూ

ABN , First Publish Date - 2020-09-15T05:53:07+05:30 IST

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌లో వాటా కొనుగోలుకు పెట్టుబడి దారులు వరుస కడుతున్నారు. అంతర్జాతీయ

రిలయన్స్‌ రిటైల్‌ కోసం  ఇన్వెస్టర్లు క్యూ

వెయిటింగ్‌ లిస్ట్‌లో కార్లైల్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ 

 జియో వాటాదారులతో అంబానీ చర్చలు 


ముంబై: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ రిటైల్‌లో వాటా కొనుగోలుకు పెట్టుబడి దారులు వరుస కడుతున్నారు. అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజాలైన కార్లైల్‌ గ్రూప్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ సైతం ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే, ఇతర ఇన్వెస్టర్లతో చర్చలు తుది దశలో ఉన్నందున ప్రస్తుతానికి ఈ రెండు కంపెనీలనూ వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టినట్లు తెలిసింది.


ముకేశ్‌ తన డిజిటల్‌ సేవల కంపెనీ జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో మొత్తం 32.84 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1.52 లక్షల కోట్లకు పైగా సమీకరించిన సంగతి తెలిసిందే. ‘జియో’లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ ముకేశ్‌.. రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటా ఆఫర్‌ చేసినట్లు తెలిసింది. జియోలో 2.08 శాతం వాటా కొనుగోలు చేసిన అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌.. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 1.75 శాతం వాటాను రూ.7,500 కోట్లకు కొనుగోలు చేస్తోంది.


జియోలోని ఇతర ఇన్వెస్టర్లలో కేకేఆర్‌ 150 కోట్ల డాలర్లు, అబుదాబీకి చెందిన ముబాదలా ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ 75 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. రిలయన్స్‌ రిటైల్‌లోనూ వాటా కొనుగోలుకు అబు దాబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అఽథారిటీ, సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరికీ రిలయన్స్‌ రిటైల్‌లో 10 శాతం వరకు వాటా విక్రయించే అవకాశం ఉంది. 


అమెజాన్‌కు భారీ వాటా? : అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు రిలయన్స్‌ రిటైల్‌లో దాదాపు 40 శాతం వాటా విక్రయించే అవకాశం ఉందని గత వారం బ్లూంబర్గ్‌ కథనం పేర్కొంది. ఇందుకోసం అమెజాన్‌ 2,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.50 లక్షల కోట్లు) మేర పెట్టుబడిగా పెట్టనుందని తెలిపింది. అయితే, అమెజాన్‌తో ఒప్పందంపైౖ వ్యాఖ్యానించేందుకు రిలయన్స్‌ నిరాకరించింది. 


Updated Date - 2020-09-15T05:53:07+05:30 IST