ముప్పు ముంగిట మార్కెట్‌!

ABN , First Publish Date - 2021-05-11T05:59:04+05:30 IST

దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ కుప్పకూలే ప్రమాదం కనిపి స్తోంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తున్నాయి...

ముప్పు ముంగిట మార్కెట్‌!

  • కరోనా దెబ్బకు సూచీలు మరోసారి కుప్పకూలేనా!!
  • ఇప్పటికే మూడింట రెండొంతుల రాష్ట్రాలు లాక్‌డౌన్‌ 
  • మున్ముందు మరిన్ని?.. ఇన్వెస్టర్ల అంతర్మథనం

ముంబై: దేశంలో కరోనా మహోగ్రరూపం దాల్చడంతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ కుప్పకూలే ప్రమాదం కనిపి స్తోంది. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా లాక్‌డౌన్‌లు విధిస్తూ వస్తున్నాయి. ఇదివరకే లాక్‌డౌన్‌లు విధించిన రాష్ట్రాలు గడువును పొడిగించాయి. దేశంలోని మూడింట రెండొంతుల రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. మున్ముందు మరిన్ని రాష్ట్రాలు స్తంభించిపోయే అవకాశం ఉంది. దీంతో దేశీయోత్పత్తికి భారీగా గండిపడనుంది. ఈ సారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఉండదని మోదీ సర్కారు స్పష్టం చేసింది. కాబట్టి, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం గత ఏడాదితో పోలిస్తే తక్కువేనని ఇన్వెస్టర్లు తొలుత భావించారు. కానీ, స్థూల దేశీయోత్పత్తికి (జీడీపీ) కీలకమైన రాష్ట్రాలు ఒక్కటొక్కటిగా షట్‌డౌన్‌ అవుతుండటంతో ఇన్వెస్టర్ల అంతర్మథనం ప్రారంభమయింది. 


పలు రాష్ట్రాల్లో కఠిన లాక్‌డౌన్‌లు అమలవుతుండటం మార్కెట్‌కు ప్రతికూలంగా మారనుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. ఈ వారంలో విడుదల కానున్న ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతోపాటు టీకా కార్యక్రమంలో పురోగతి  మున్ముందు మార్కెట్‌ దిశను నిర్దేశించడంలో కీలకం కానున్నాయని ఆయన పేర్కొన్నారు. టీకా కొరతతో వైరస్‌ వ్యాప్తి నియంత్రణ సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటించే తదుపరి వ్యూహంతో పాటు కీలక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఎప్పటికి ముగియవచ్చన్న అంచనాలపై ఇన్వెస్టర్లు మల్లగుల్లాలు పడుతున్నట్లు మిశ్రా చెప్పారు. 



స్టాక్‌ మార్కెట్‌ సంపద రూ.6.44 లక్షల కోట్లు అప్‌

దేశీయ స్టాక్‌ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ లాభపడ్డాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ సోమవారం 295.94 పాయింట్లు పెరిగి 49,502.41 వద్ద ముగిసింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 119.20 పాయింట్ల లాభంతో 14,942.35 వద్ద స్థిరపడింది. ఫార్మా, పవర్‌, బ్యాంకింగ్‌ షేర్లలో ట్రేడర్లు కొనుగోళ్లు పెంచడం ఇందుకు దోహదపడింది. గడిచిన నాలుగు సెషన్లలో సెన్సెక్స్‌ 1,248.90, నిఫ్టీ 445.85 పాయింట్లు బలపడ్డాయి. ఈ నాలుగు సెషన్లలో స్టాక్‌ మార్కెట్‌ వర్గాల సంపద రూ.6.44 లక్షల కోట్లు పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.213.28 లక్షల కోట్లకు చేరుకుంది. 


కార్పొరేట్లకు ఎగుమతుల దన్ను 

కరోనా రెండో ఉధృతిని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు విధించిన సంపూర్ణ, పాక్షిక లాక్‌డౌన్‌ల ప్రభావం కార్పొరేట్‌ రంగంపైన మాత్రం స్వల్పమేనని ఇండియా రేటింగ్స్‌ అంటోంది. ఎగుమతులకు భారీ డిమాండ్‌తోపాటు గడిచిన ఆరు నెలల్లో బలపడిన కంపెనీల ఆర్థిక సామర్థ్యం వీటిపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు దోహదపడనుందని తాజా రిపోర్టులో పేర్కొంది. చిన్న వ్యాపారాలు, రిటైల్‌ రుణగ్రహీతలు మాత్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోనున్నాయని ఈ రేటింగ్‌ ఏజెన్సీ అభిప్రాయపడింది. 

Updated Date - 2021-05-11T05:59:04+05:30 IST