పెట్టుబడులు పరార్‌

ABN , First Publish Date - 2020-02-18T09:17:07+05:30 IST

జగన్‌ పాలన చూసి ఈ ఎనిమిది నెలల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో రూ.1.80 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వెళ్లిపోయాయని టీడీపీ అధినేత

పెట్టుబడులు పరార్‌

ఇక యువతకు ఉద్యోగాలు వచ్చేదెలా?

టీడీపీ ప్రభుత్వ హయాంలో

5.5 లక్షల ఉద్యోగాలొచ్చాయ్‌

ఇది నా మాట కాదు

వైసీపీ మంత్రులే చెప్పారు

మూడు రాజధానుల ఆలోచన

రాష్ట్రానికి మరణ శాసనం

ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి

టీఎన్‌ఎ్‌సఎఫ్‌ సదస్సులో బాబు

రేపు మార్టూరులో పర్యటన

అమరావతి, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలన చూసి ఈ ఎనిమిది నెలల్లో ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో రూ.1.80 లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు వెళ్లిపోయాయని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త పరిశ్రమలేవీ రావడం లేదని.. ఇలాగైతే యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సోమవారమిక్కడ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీఎన్‌ఎ్‌సఎఫ్‌ రాష్ట్ర స్థాయి మేఽథో మధన సదస్సులో ఆయన మాట్లాడారు. ఒక రాష్ట్రం ఎలా ముందుకు వెళ్తుంది.. ఉద్యోగాలు ఎలా వస్తాయి.. పరిశ్రమలు వస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో సామాన్యులకు అంత తేలిగ్గా అర్థం కాకపోవచ్చని.. వారిని విద్యార్థులు, యువత చైతన్యపరచాలని సూచించారు.


‘తెలుగుదేశం హయాంలో పరిశ్రమల ఏర్పాటుకు రూ.16 లక్షల కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. అందులో కొన్ని వచ్చాయి. మిగిలినవి వచ్చే దశలో ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన వాటివల్ల 5.5 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చాయి. ఇది నేను చెప్పడం లేదు.. స్వయంగా వైసీపీ ప్రభుత్వ మంత్రులు శాసనమండలిలో ఇచ్చిన సమాధానంలో చెప్పారు’ అని వెల్లడించారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించారని ప్రజలపై కోపం తెచ్చుకోవలసిన అవసరం లేదని.. కానీ కొత్త ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరుగుతోందో ప్రజలకు విశదపరచాల్సిన అవసరమైతే ఉందన్నారు.


మూడు రాజధానుల ఆలోచన రాష్ట్రానికి మరణ శాసనం అవుతుందని, ఒక నగరాన్ని రాజధానిగా ఎంచుకుని.. దానిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెంచుకోవాలన్న టీడీపీ ప్రభుత్వ వ్యూహాన్ని కేవలం వ్యక్తిగత కక్షలతో పాడు చేసి రాష్ట్రాన్ని అధోగతికి చేరుస్తున్నారని విమర్శించారు. తప్పులను ఎత్తిచూపినా.. విమర్శించినా ఈ ప్రభుత్వం తట్టుకోలేకపోతోందని, ఒకే రాజధాని ఉండాలన్న నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులు నందా, సురేశ్‌లను సస్పెండ్‌ చేయడం నిరంకుశ చర్య ని మండిపడ్డారు. సీఎం జగన్‌ తన 8 నెలల పాలన కాలంలో అరాచకాలు, దాడులతో ప్రజలను బెంబేలెత్తించారని, మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.


బడుగు బలహీన వర్గాలతో యువత మమేకమై సామాజిక న్యాయాన్ని సాధించాలని కోరారు. 60 రోజులుగా పోరాడుతున్న రాజధాని గ్రామాలకు వెళ్లి రైతులతో మాట్లాడాలని, వారికి భరోసా ఇవ్వాలని సూచించారు. కాగా.. చంద్రబాబు బుధవారం (19న) ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రల ప్రారంభాన్ని పురస్కరించుకుని పరుచూరు నియోజకవర్గం మార్టూరులో జరిగే కార్యక్రమంలో ఆరోజు పాల్గొంటారు. 

Updated Date - 2020-02-18T09:17:07+05:30 IST