మూడేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడులు

ABN , First Publish Date - 2022-04-23T08:47:35+05:30 IST

పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ (రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌) వచ్చే మూడేళ్లలో కొత్తగా ఆరు ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది.

మూడేళ్లలో రూ.300 కోట్ల పెట్టుబడులు

కొత్తగా 6 ఆసుపత్రులు ఏర్పాటు 

రెయిన్‌బో హాస్పిటల్‌ వెల్లడి 

పబ్లిక్‌ ఇష్యూ ధర రూ.516-542


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ (రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌) వచ్చే మూడేళ్లలో కొత్తగా ఆరు ఆసుపత్రులను ఏర్పాటు చేయనుంది. కొత్త హాస్పిటల్స్‌ ద్వారా అదనంగా 500 పడకలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెయిన్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌  చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కంచర్ల తెలిపారు. ఇందుకోసం రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. ఆరు ఆసుపత్రుల్లో హైదరాబాద్‌, ఎన్‌సీఆర్‌లలో రెండు చొప్పున, బెంగళూరులో ఒకటి, చెన్నైలో ఒక హాస్పిటల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం రెయిన్‌బో హాస్పిటల్‌కు 6 నగరాల్లో 14 ఆస్పత్రులు, 3 అవుట్‌ పేషెంట్‌ క్లినిక్‌లు ఉన్నాయి. ఇందులో 6 హైదరాబాద్‌లోనే ఉన్నాయి.  ప్రస్తుత పడకల సామర్థ్యం 1,500. భవిష్యత్తులో  ఈశా న్య రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు విస్తరించే యోచన కూడా ఉందన్నారు. పిల్లల ఆస్పత్రులకు దేశంలో అపార అవకాశాలు ఉన్నాయని రమేశ్‌ తెలిపారు. ఒక్కో పడకకు రూ.60 లక్షలు అవుతుంది. దీని ప్రకారం 500 పడకలకు దాదాపు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.170 కోట్లను పబ్లిక్‌ ఇష్యూలో కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా లభించే నిధుల నుంచి సమకూర్చుకుంటాం. మిగిలిన మొత్తాన్ని అంతర్గత నిధులు, రుణాల ద్వారా పొందుతామని చెప్పారు. 


రూ.1,581 కోట్ల సమీకరణ: ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న రెయిన్‌బో పబ్లిక్‌ ఇష్యూలో రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేర్‌ ధర శ్రేణి రూ.516 -542గా నిర్ణయించినట్లు రెయిన్‌బో హాస్పిటల్‌ వెల్లడించింది. కనీసం 27 షేర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  ఇష్యూ 29న ముగుస్తుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు 26న బిడ్లు దాఖలు చేస్తారు. ఇష్యూలో భాగంగా కొత్త షేర్లను జారీ చేయడం ద్వారా రూ.280 కోట్లు సమీకరిస్తారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు, ఇప్పటికే మదుపు చేసిన ఇన్వెస్టర్లు 2.4 కోట్ల షేర్ల వరకూ విక్రయిస్తారు. ధర శ్రేణిలో గరిష్ఠ ధరను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఇష్యూ పరిమాణం రూ.1,581 కోట్లు. 3 లక్షల షేర్లను ఉద్యోగులకు రిజర్వు చేశారు.  ఉద్యోగులకు ఒక్కో షేర్‌ను రూ.20 తక్కువకు కేటాయిస్తారు. 

ప్రమోటర్లయిన రమేశ్‌ కంచర్ల, దినేశ్‌ కుమార్‌ చిర్ల, బ్రిటిష్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ పీఎల్‌సీ తదితరులు వాటాలను విక్రయిస్తారు. కొత్త షేర్ల ద్వారా లభించే రూ.280 కోట్లలో రూ.170 కోట్లను ఆస్పత్రుల విస్తరణకు, రూ.41 కోట్లను నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల చెల్లింపునకు, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తారు.   


1999లో తొలి హాస్పిటల్‌: రెయిన్‌బో 1999లో 50 పడకలతో హైదరాబాద్‌లో మొదటి పీడియాట్రిక్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రారంభించిందని రమేశ్‌ అన్నారు. 2010 నుంచి 2017 మధ్య ఏడాదికి 16.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. హాస్పిటల్‌ అసెట్‌ లైట్‌ విధానాన్ని అనుసరిస్తోందని.. 100 మందికి పైగా డాక్టర్లకు ఈక్విటీ వాటా ఉందని రమేశ్‌ వివరించారు గత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలలకు ఆక్యుపెన్సీ రేటు 46 శాతం ఉంది. నికర లాభం రూ.126 కోట్లుగా నమోదైంది. గత ఐదేళ్లుగా ఆదాయం ఏడాదికి 20 శాతం చొప్పున పెరుగుతోందని చెప్పారు. కాగా ఇష్యూ తర్వాత ప్రమోటర్ల వాటా 50 శాతం ఉంటుంది. 


Updated Date - 2022-04-23T08:47:35+05:30 IST