డీజిల్‌ దొంగలకు సహకరించిన పోలీసులపై విచారణ

ABN , First Publish Date - 2020-06-02T10:14:08+05:30 IST

సమర్థత, పనితీరును నమ్మి పోస్టింగ్‌ ఇచ్చిన సీపీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు కొంతమంది ఇన్‌స్పెక్టర్లు. పోస్టింగ్‌

డీజిల్‌ దొంగలకు సహకరించిన పోలీసులపై విచారణ

అవినీతి ఆరోపణలున్న వారిపై నిఘా వర్గాల ఆరా


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): సమర్థత, పనితీరును నమ్మి పోస్టింగ్‌ ఇచ్చిన సీపీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు కొంతమంది ఇన్‌స్పెక్టర్లు. పోస్టింగ్‌ పొందిన కొద్ది రోజుల్లోనే తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. కొందరు ఇన్‌స్పెక్టర్లు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తూ.. కేసులు, ఇన్వెస్టిగేషన్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రాచకొండలో ఆరుగురు పోలీసులను సీపీ మహేష్‌ భగవత్‌ ఇటీవల సస్పెండ్‌ చేసిన విషయం డిపార్ట్‌మెంట్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ  కేసులో మరికొంతమంది పోలీసులు, మరో ఇన్‌స్పెక్టర్‌కు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో సీపీ ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.


డీజిల్‌ దొంగలకు  సహకరించిన పోలీసులపై లోతుగా విచారణ జరుపుతున్నారు. కమిషనరేట్‌ పరిధిలో పలు స్టేషన్‌లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్‌లు, ఎస్‌ఐలు, పలు విభాగాల్లో మామూళ్ల మత్తులో జోగుతున్న క్షేత్రస్థాయు సిబ్బంది వివరాలను నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెలవులో ఉన్న సీపీ తిరిగొచ్చిన తర్వాత మరికొందరు పోలీసులపై చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


పనితీరు ఆధారంగా పలువురు ఇన్‌స్పెక్టర్లకు సీపీలు కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారు. కానీ విధులను నిర్లక్ష్యం చేసి పలు వివాదాల్లో తలదూర్చుతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో అలాంటి వారిని గుర్తించి ఆరా తీయటానికి రాచకొండ, సైబరాబాద్‌ సీపీలు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశారు. ఆరోపణలు నిజమని తేలిన వెంటనే ఇన్‌స్పెక్టర్‌లపై బదిలీ వేటు వేస్తున్నారు. అడ్డంగా దొరికిపోయిన ఇన్‌స్పెక్టర్‌లు, క్షేత్రస్థాయి సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు తమపై వేటు పడుతుందేమోనని భయపడుతున్నట్లు సమాచారం. 

Updated Date - 2020-06-02T10:14:08+05:30 IST