విద్యాశాఖలో అవినీతి అక్రమాలపై విచారణ

ABN , First Publish Date - 2020-09-27T10:56:47+05:30 IST

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సమగ్ర శిశు విభాగంలో సెక్టోరియల్‌ ఆఫీసర్‌-2గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌పై గతంలో వచ్చిన అనేక అవినీతి ఆరోపణలపై ఈ నెల

విద్యాశాఖలో అవినీతి అక్రమాలపై విచారణ

- ఆదేశాలు జారీ చేసిన ఆర్జేడీ

- సమగ్ర శిశు సెక్టోరల్‌ అధికారి శ్రీనివాస్‌పై అవినీతి ఆరోపణలు

- విధుల నుంచి తప్పించాలని ప్రధానోపాధ్యాయ సంఘం వినతి 

- ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ఆర్జేడీ, కలెక్టర్‌ ఆరా 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని సమగ్ర శిశు విభాగంలో సెక్టోరియల్‌ ఆఫీసర్‌-2గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్‌పై గతంలో వచ్చిన అనేక అవినీతి ఆరోపణలపై ఈ నెల 30న విచారణ జరిపించాలని విద్యాశాఖ వరంగల్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.లింగయ్య ఆదేశాలు జారీ చేశారు. గత మార్చి మొదటి వారంలో వరంగల్‌ ఆర్జేడీ పెద్దపల్లి జిల్లా విద్యాశాఖ అధికారిచే విచారణ జరిపించి ఆయన నివేదిక ఆధారంగా సదరు సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌ను అప్పుడు విధుల నుంచి తప్పించారు. అలాగే ఆయన చేసిన అవకతవకలపై చర్యలు చేపట్టాలని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు ఆర్జేడీ లింగయ్య నిబంధనల ఉల్లంఘన చార్జెన్‌ను నమోదు చేశారు. అయితే సెక్టోరల్‌ అధికారి-2 శ్రీనివాస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోగా ఆయనను ప్రత్యామ్నాయ అవసరాల పేరిట మళ్లీ అదే పోస్టులో కొనసాగించడంపై ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖలో అవినీతి అక్రమాలపై వచ్చిన ఫిర్యాదులపై దృష్టిసారించి తిరిగి విచారణ జరిపిస్తున్నారు. ఇదే క్రమంలో సెక్టోరియల్‌-2 ఆఫీసర్‌ శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలపై మళ్లీ విచారణ మొదలైంది. ఇదే విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికల్లో ‘జిల్లా విద్యాశాఖలో కలకలం ’అనే పేరిట కథనం ప్రచురితమైంది.


దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్‌ కె.శశాంక సెక్టోరల్‌ అధికారి-2పై వచ్చిన ఆరోపణలపై చేసిన విచారణ, తీసుకున్న చర్యలపై జిల్లా విద్యాశాఖ అధికారితో ఆరా తీసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే వరంగల్‌ ఆర్జేడీ లింగయ్య ఈ నెల 30న శ్రీనివాస్‌ ఆరోపణలపై విచారణ జరుపాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఆరోపణలు వచ్చిన అధికారి అదే పోస్టులో ఉన్న సమయంలో విచారణ జరిపితే  వాస్తవాలు వెలుగులోకి రావని విచారణను ప్రభావితం చేసే పరిస్థితి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ఏదైనా అవసరాలకు వినియోగించాల్సి వస్తే ముందుగా వాటికి సంబంధించిన ప్రతిపాదనలను తయారు చేసి వాటిపై చర్చించి తీర్మానం చేసిన తర్వాతనే నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. సదరు సెక్టోరల్‌ అధికారి శ్రీనివాస్‌ మాత్రం తీర్మానం చేయకుండానే 74,076 రూపాయలను వివిధ అవసరాల కోసం ఖర్చుచేసినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా 90వేల రూపాయలకు తీర్మానం చేసి 95 వేల రూపాయలు ఖర్చుచేశారని, ఈ రెండు కూడా నిబంధనలు ఉల్లంఘించారని,  నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా డి.శ్రీనివాస్‌ ప్రత్యామ్నాయంగా స్కూల్‌ కో ఆర్డినేటర్‌ విధులు నిర్వహిస్తున్నపుడు లక్ష రూపాయల పరిమితికి మించి కలెక్టర్‌ అనుమతి లేకుండా 2 లక్షల 81వేల రూపాయలను నిధులు డ్రా చేసి వేర్వేరుగా నోట్‌ఫైల్స్‌ రన్‌ చేసి తన వ్యక్తిగత అకౌంట్లోకి మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


అలాగే జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం కూడా ఆయనను విధుల నుంచి తప్పించి ఆయనపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని కోరుతూ ఆర్జేడీకి వినతిపత్రం సమర్పించింది. ఆర్జేడీ విచారణకు ఆదేశించిన తర్వాత ఆయనను విధుల్లో కొనసాగించడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల విహారయాత్రలకు సంబంధించిన నిధులు కూడా స్వంత బ్యాంకు ఖాతాలోకి మళ్లించారనే విమర్శలు వచ్చాయి. వీటితోపాటు అక్రమ పే పిక్సేషన్‌ ద్వారా ఒక ఇంక్రిమెంట్‌ అదనంగా పొందారని ఫిర్యాదు చేశారు. 2016 సంవత్సరంలో జిల్లా విద్యాధికారి కార్యాలయంలో ఫారిన్‌ సర్వీసులో పనిచేస్తున్న కాలంలోనే పాఠశాలలో పనిచేసినట్లుగా వేసవి సెలవుల్లో పదవ తరగతి పరీక్షల విధులు నిర్వహించినట్లు అక్రమంగా 16 ఈఎల్‌లు, 2016 సంవత్సరంలో మొత్తం 34 ఈఎల్‌లు, 2017లో 42 ఈఎల్‌ (లీవులు)లను అక్రమంగా పొందారని, నిబంధనల మేరకు ఒక అధికారికి 30 సెలవులు మాత్రమే ఉంటాయని, వీటిపై విచారణ జరిపి ప్రభుత్వం నుంచి అక్రమంగా పొందిన సొమ్ము రికవరీ చేయాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వీటన్నిటిపై విచారణ జరుపడమేకానీ ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా శ్రీనివాస్‌ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరుపడంతో పాటు ఆయనపై చర్య తీసుకోవాలని, విచారణ పారదర్శకంగా జరిగేందుకు ఆయనను విధుల్లో నుంచి వెంటనే తప్పించాలని పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

Updated Date - 2020-09-27T10:56:47+05:30 IST