క్లీన్‌ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి

ABN , First Publish Date - 2022-06-28T08:35:04+05:30 IST

క్లీన్‌ ఎనర్జీ రంగంలో భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

క్లీన్‌ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టండి

దీనికి భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది

జి-7 దేశాలకు ప్రధాని మోదీ పిలుపు

బైడెన్‌ సహా పలు దేశాధినేతలతో సమావేశం

ఎల్‌మావ్‌ (జర్మనీ), జూన్‌ 27: క్లీన్‌ ఎనర్జీ రంగంలో భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రీసెర్చ్‌, ఇన్నోవేషన్‌, ఉత్పత్తి రంగాల్లో జి-7 దేశాలు పెట్టుబడులు పెట్టొచ్చని తెలిపారు. క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ గ్రోత్‌ లక్ష్యాల సాధన కోసం భారత్‌ కృషి చేస్తోందన్నారు. జర్మనీలో సోమవారం జరిగిన జి-7 దేశాల సదస్సులో అతిథి హోదాలో ప్రధాని మోదీ ప్రసంగించారు. జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ ఆహ్వానం మేరకు ప్రధాని ఆదివారం జర్మనీ చేరుకున్న సంగతి తెలిసిందే. అలాగే సోమవారం జి-7 దేశాల సమావేశానికి మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయా దేశాధినేతలను ప్రధాని కలుసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ప్రధాని వద్దకు వచ్చి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అదే సమయంలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాను కూడా ప్రధాని కలిశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసాతో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య వ్యాపారం, పెట్టుబడులు, రక్షణ రంగంలో సహకారం తదితర అంశాలపై చర్చించారు. జి-7లో అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌, యూకే సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్‌, అర్జెంటీనా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, సెనెగల్‌ దేశాలు అతిథుల హోదాలో ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహారభద్రత, ఆరోగ్య వ్యవస్థలను మెరుగుపర్చడం, వాతావరణాన్ని కాపాడటంపై దృష్టి సారించనున్నట్టు జి-7 దేశాలు ఈ సందర్భంగా ప్రకటించాయి. మంగళవారం కూడా సదస్సు జరగనుంది. 


పెట్టుబడులతో చైనాకు చెక్‌..

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చైనా ప్రభావాన్ని కట్టడి చేయడం లక్ష్యంగా జి-7 కూటమి పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా 2027 నాటికి 600 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. భారత్‌ సహా పలు దేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బీఆర్‌ఐ) పేరుతో చైనా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారీగా రుణాలు ఇస్తోంది. తద్వారా ఆయా దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఈ రుణాలను తీర్చలేని పరిస్థితుల్లో ప్రాజెక్టులు నిలిచిపోయాయి. అయితే జి-7 దేశాలు రుణాలు ఇవ్వడం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశా ల్లో పెట్టుబడులు పెడతాయని బైడెన్‌ వెల్లడించారు. ఫలితంగా అందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా భారత్‌లో పెట్టుబడుల కోసం యూఎస్‌ ఇంటర్నేషనల్‌ డెవల్‌పమెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ 30 మిలియన్‌ డాలర్లతో ఒక నిధిని ఏర్పాటు చేయనుంది. అగ్రిటెక్‌, ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో ఈ నిధులను ఖర్చుచేస్తారు.


భారత్‌-జర్మనీ బంధంలో తెలుగుతేజం హరీశ్‌ పాత్ర


భారత్‌, ఐరోపా సంబంధాల బలోపేతానికి కీలకంగా భావిస్తున్న ప్రధాని మోదీ జర్మనీ పర్యటనలో తెలుగువాడైన దౌత్యవేత్త పర్వతనేని హరీశ్‌ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. జర్మనీలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం ఓలాఫ్‌ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంతో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి భారత్‌ ప్రాధాన్యమిచ్చింది. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సీనియర్‌ దౌత్యవేత్త హరీశ్‌ను జర్మనీలో భారత రాయబారిగా నియమించింది. గత నవంబరులో భాద్యతలు స్వీకరించిన ఆయన.. వెంటనే జర్మనీతో సంబంధాలను పటిష్ఠం చేసే ప్రయత్నాలు చేశారు. ఆ చర్యల్లో భాగంగానే ప్రధాని మోదీ ప్రస్తుతం జర్మనీలో జి-7 శిఖారగ్ర సదస్సులో అతిథిగా పాల్గొంటున్నారు. ఐరోపాలో కీలక వాణిజ్య భాగస్వామి దేశమైన జర్మనీ.. భారత్‌లో 13.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ప్రత్యేకించి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ రంగంలో జర్మనీకి మొదటి నుంచీ మంచి పేరుంది. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రుడైన హరీశ్‌ పాత్ర ఇరు దేశాల సంబంధాల్లో చెప్పుకోదగినది

Updated Date - 2022-06-28T08:35:04+05:30 IST