భద్రాద్రి రామయ్య భూముల్లో ఆక్రమణ!

ABN , First Publish Date - 2022-08-16T09:53:40+05:30 IST

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిన భద్రాద్రి రామయ్య భూముల పర్యవేక్షణ, దేవస్థాన అధికారులకు కష్టంగా మారుతోంది.

భద్రాద్రి రామయ్య భూముల్లో ఆక్రమణ!

పురుషోత్తపట్నంలో కర్రలు, తాళ్లతో నిర్మాణాలు 

అడ్డుకున్న దేవస్థానం అధికారులు, ఎటపాక పీఎ్‌సలో ఫిర్యాదు

భద్రాచలం, ఆగస్టు 15: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిధిలోకి వెళ్లిన భద్రాద్రి రామయ్య భూముల పర్యవేక్షణ, దేవస్థాన అధికారులకు కష్టంగా మారుతోంది. భద్రాచలానికి కూతవేటు దూరంలోని అల్లూరి జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామయ్య దేవస్థానానికి  880 ఎకరాల భూమి ఉంది. ఇటీవల అ భూముల్లో ఆక్రమణలు పెరిగాయి. తాజాగా సోమవారం మరోసారి వందల సంఖ్యలో స్థానికులు ఈ భూములను ఆక్రమించేందుకు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. గతంలో రామాయణం థీమ్‌ పార్క్‌ నిర్మించాలని నిర్ణయించిన స్థలంతో పాటు దాని వెనుక ఉన్న స్థలాన్ని సైతం స్థానికులు ఆక్రమించేందుకు యత్నించారు. గునపాలతో పాదులు తీసి, కర్రలు పాతి తాళ్లతో హద్దులను సైతం ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. ఈ విషయం అందరికి తెలియడంతో.. స్థానికులు ఆక్రమణలకు ప్రయత్నం చేశారు. దేవస్థానానికి చెందిన ఈ భూమి ఇప్పటికే న్యాయస్థానం పరిధిలో ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు ఈ విషయంలో స్టేట్‌సకో జారీ చేసినట్లు సమాచారం. పురుషోత్తపట్నానికి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు దేవస్థానం స్థలాన్ని ఆక్రమించగా అధికారులు వారిని ఏమీ చేయలేకపోతున్నారని, మరి తాము చిన్న ఇంటికోసం ఆక్రమిస్తే తప్పేంటని పలువురు స్థానికులు ప్రశ్నిస్తుండటం గమనార్హం. దేవస్థానానికి చెందిన సర్వే నెం.21, 22లో ఉన్న భూముల్లో స్థానికులు ఆక్రమణలకు యత్నించగానే దేవస్థానం అధికారులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. స్థలం దేవస్థానానిదని, ఆక్రమిస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే ఎటపాక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-08-16T09:53:40+05:30 IST