చెల్లని పేరుతో జెల్ల

ABN , First Publish Date - 2021-02-25T06:39:43+05:30 IST

తాజాగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగు విడతల కింద చెల్లని ఓట్లు 65,915గా ఎట్టకేలకు అధికారులు లెక్కతేల్చారు. ఒక రకంగా 2013 పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి చెల్లని ఓట్లు అధికంగా గుర్తించినట్టు అంచనా కట్టారు.

చెల్లని పేరుతో జెల్ల

  • నాలుగు దశల పంచాయతీ ఎన్నికల్లో మొత్తం చెల్లని ఓట్లు 65,915
  • అత్యధికంగా కాకినాడ, పెద్దాపురం డివిజన్ల పరిధిలో 24,727 గుర్తింపు
  • అన్ని దశలూ కలిపి నోటా కింద పడ్డ ఓట్లు  28,547
  • తొలి విడత ఎన్నికల్లోనే అత్యధికం 
  • అభ్యర్థుల తలరాతలు మార్చేసిన వైనం
  • అధికారపక్షం ఒత్తిళ్లతో టీడీపీ మద్దతుదారులకు అధిక నష్టమని అంచనా

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

తాజాగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో నాలుగు విడతల కింద చెల్లని ఓట్లు 65,915గా ఎట్టకేలకు అధికారులు లెక్కతేల్చారు. ఒక రకంగా 2013 పంచాయతీ ఎన్నికలతో పోల్చితే ఈసారి చెల్లని ఓట్లు అధికంగా గుర్తించినట్టు అంచనా కట్టారు. అత్యధికంగా ఈ దఫా తొలి విడత ఎన్నికలు జరిగిన కాకినాడ, పెద్దాపురం డివిజన్ల పరిధిలో చెల్లని ఓట్లు ఏకంగా 24,727గా లెక్క తేలింది. అటు నోటా ఓట్లు సైతం ఈసారి గణనీయంగానే పెరిగినట్టు తెలుస్తోంది. అన్ని విడతలూ కలిపి ఎన్నికలు జరిగిన 1,073 పంచాయతీల్లో ఏకంగా 28,547 ఓట్లు ప్రజలు అసలు ఏ అభ్యర్థికీ వేయకుండా నోటా కింద వేశారు. కాగా అటు చెల్లని ఓట్ల కింద వచ్చిన ఓట్లు దాదాపు కొన్ని వం దల పంచాయతీల్లో మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానం. అయితే ఈ విభాగం కింద పక్కకు పెట్టిన ఓట్లు ఎక్కువగా టీడీపీ మద్దతుదారులకు పోలైనవేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అధికారపార్టీ మద్దతుదారులను విజేతలుగా ప్రకటించే క్రమంలో కొన్ని పంచాయతీల్లో చెల్లని ఓట్లు పేరుతో పరిగణలోకి తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలో కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో 366 పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు ఈ నెల 9న జరగ్గా మొత్తం 862 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఈ నేపథ్యంలో 9,31,151 ఓట్లకు గాను 7,87,820 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 24,727 ఉన్నట్టు ఎట్టకేలకు అధికారికంగా నిర్ధారించారు. ఇందులో అత్యధికంగా తొండంగి మండలంలో 1,978, అత్యల్పంగా 684 ఓట్లు ఏలేశ్వరం మండలంలో గుర్తించారు. నోటా ఓట్లు 10,048 పోలవగా, 734 ఓట్లు తొండంగి, ఏలేశ్వరంలో అత్యల్పంగా 210 ఓట్లు పడ్డాయి. రెండో విడతలో రాజమహేంద్రవరం, రామచంద్రపురం డివిజన్ల పరిధిలో 247 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 670 మంది బరిలో నిలిచారు. మొత్తం 6,85,909 ఓట్లకు గాను 5,91,152 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 15,979 ఓట్లు చెల్లనివిగా తేలాయి. కడియం మండలంలో అత్యధికంగా 1,405, గంగవరం మండలంలో అత్యల్పంగా 304 ఓట్లు తేలాయి. నోటా కింద మొత్తం అన్ని మండలాల్లో 6,965 ఓట్లు పోలవగా, మండపేట మండలంలో అత్యధికంగా 647, గోకవరంలో అత్యల్పంగా 304 ఓట్లు పోలయ్యాయి. మూడో విడత రంపచోడవరం, ఎటపాక డివిజన్ల పరిధిలో 186 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా 468 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ 2,25,965 ఓట్లకు 1,75,040 పోలయ్యాయి. ఇందులో 8,717ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. చింతూరులో అత్యధికంగా 1,250, కూనవరంలో అత్యల్పంగా 513 గుర్తించారు. నోటా కింద 2,983 ఓట్లు పోలవగా, అడ్డతీగలలో అత్యధికంగా 402, వై.రామవరంలో అత్యల్పంగా 185 పడ్డాయి. నాలుగో విడత కోనసీమలో 274 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 670 మంది బరిలో నిలిచారు. మొత్తం 7,68,483 ఓట్లకు 6,57,591 పోలయ్యాయి. ఇందులో చెల్లని ఓట్లు 16,492 కాగా, అత్యధికంగా కాట్రేనికోన మండలంలో 1,626, అత్యల్పంగా ముమ్మిడివరంలో 599 గుర్తించారు. నోటా కింద ఈ డివిజన్‌లో 8,551 ఓట్లు పోలయ్యాయి. అత్యధికంగా కొత్తపేట మండలంలో 928, రాజోలులో అత్యల్పంగా 332 పోలయ్యాయి. అయితే మొత్తం చెల్లని ఓట్లలో అత్యధికంగా టీడీపీ మద్దతుదారులవేనని ఆపార్టీ ఆరోపిస్తోంది. అధికార వైసీపీ మద్దతుదారులకు మెజార్టీ తక్కువగా వచ్చిన సమయాల్లోను, ఓటమికి దగ్గరగా ఉన్నప్పుడు టీడీపీ మద్దతుదారులకు పడ్డ ఓట్లను అప్పటికప్పుడు ఉద్దేశపూర్వకంగా చెల్లని ఓట్ల కింద చూపించి తద్వారా తక్కువ ఓట్లు వచ్చినట్టు చూపించి అధికార పార్టీకి కొందరు అధికారులు మేలు చేశారనే ఫిర్యాదులు ఎస్‌ఈసీకి  అందాయి.

Updated Date - 2021-02-25T06:39:43+05:30 IST