Abn logo
Sep 20 2021 @ 00:35AM

మెజార్టీ కంటే చెల్లని ఓట్లే అధికం!

రిటర్నింగ్‌ అధికారికి సమస్య వివరిస్తున్న కోడిశ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి, ఏజెంట్లు

వైసీపీ అభ్యర్థి గెలిచినట్టు అధికారుల ప్రకటన

టీడీపీ అభ్యర్థి అభ్యంతరం

రేగిడి, సెప్టెంబరు 19: రేగిడి మండలం కోడిశ ఎంపీటీసీ స్థానానికి సంబంధించి విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ వైసీపీ అభ్యర్థికి 105 ఓట్ల మెజార్టీ రాగా... చెల్లని ఓట్లు 480గా తేలడంతో టీడీపీ అభ్యర్థితో పాటు ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి నెల్లి చంద్రశేఖరరావుకు 861 ఓట్లు, టీడీపీ అభ్యర్థి గురవాన తమ్మినాయుడుకు 756 ఓట్లు, ఇంటిపెండెంట్‌ అభ్యర్థి బేరి నర్సమ్మకు ఏడు ఓట్లు వచ్చాయి. నోటాకు 24 ఓట్లురాగా... 480 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. దీనిపై టీడీపీ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్‌ అధికారి చేసిన తప్పిదంతో ఫలితం తారుమారైందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లగా తామేమీ చేయలేమని..కలెక్టర్‌కు తెలియజేస్తామని చెప్పారు. దీనిపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్టు టీడీపీ అభ్యర్థి తమ్మినాయుడు తెలిపారు.


ఆ స్థానాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలి

టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బ్యాలెట్‌ బాక్సులకు చెదలు పట్టిన ప్రాదేశిక స్థానాలకు రీ పోలింగ్‌ నిర్వహించాలని టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్ట్రాంగ్‌ రూముల్లో భద్రత నడుమ ఉన్న బ్యాలెట్‌ బాక్సులకు చెదలు ఎలా పట్టాయని ప్రశ్నించారు. సరుబుజ్జిలి, ఆమదాలవలస, గార, మందస, కవిటి మండలాల్లో బ్యాలెట్‌ బాక్సులకు చెదలు పట్టిన దృష్ట్యా..అక్కడ రీ పోలింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఇదే విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయనున్నట్టు రవికుమార్‌ తెలిపారు.