కబ్జాలవల్లే ముంపు

ABN , First Publish Date - 2022-08-05T07:22:43+05:30 IST

చిన్నవర్షం పడినా నిర్మల్‌ నిండా మునుగుతోంది....! బుధవారం సాయంత్రం కేవలం గంటపాటు కురిసిన వానవల్ల పట్టణంలోని ప్రధానదారులన్నీ జలమయమయ్యాయి.

కబ్జాలవల్లే ముంపు
ఇబ్రహీంసాగర్‌ చెరువును నింపే నాలా కుంచించుకు పోయింది ఇలా

చెరువులు, నాళాల ఆక్రమణలతో భయం అంచున నిర్మల్‌

అడ్డగోలు కబ్జాలు జరుగుతున్నా పట్టని యంత్రాంగం 

నీటి పారుదల, రెవెన్యూ శాఖలు దొందూ దొందే...

అధికారపార్టీ నేతలే కబ్జా సూత్రధారులు 

ప్రభుత్వానికి ఇంటలిజెన్స్‌ నివేదిక 

నిర్మల్‌, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : చిన్నవర్షం పడినా నిర్మల్‌ నిండా మునుగుతోంది....! బుధవారం సాయంత్రం కేవలం గంటపాటు కురిసిన వానవల్ల పట్టణంలోని ప్రధానదారులన్నీ జలమయమయ్యాయి. మూడు నుంచి నాలుగు గంటల పాటు జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధానకూడళ్లు అయిన మంచిర్యాల చౌరస్తా, డాక్టర్స్‌లేన్‌, తిరుమల థియేటర్‌, గొల్లపేట్‌ చౌరస్తా, ఇంద్రానగర్‌, సిద్దాపూర్‌, ప్రియదర్శినినగర్‌, విద్యానగర్‌ తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గంటపాటు కురిసిన వర్షానికే తీవ్రత ఇలా ఉంటే... వరుస బెట్టి రెండు మూడురోజులు పాటు వానలు పడితే నిర్మల్‌ నిండా మునగడంలో ఆశ్చర్యమేముంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితులకు కారణాలు ఏంటని విశ్లేషిస్తే గొలుసు కట్టు చెరువులు, అనుసంధాన కాలువలు, కందకాలకు ప్రసిద్ది చెందిన నిర్మల్‌ పట్టణంలోని ప్రధాననీటి వనరులన్నీ కబ్జాకు గురి కావడమే కారణం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెరువులు, కుంటలకు తోడు చెరువులను కలిపే అనుసంధాన కాలువలు, కందకాలు సైతం ఎక్కడికక్కడ కబ్జారాయుళ్ల కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. ఆ కబ్జాలను తొలగించడం ఇప్పుడు ఏ ఒక్కరి వల్లా సాధ్యం కాదన్నది సుస్పష్టం. ఇప్పటికే కోర్టు ఎన్నోసార్లు కబ్జాలను తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా.. ఆచరణలో పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్న అభిప్రాయాలున్నాయి. కోర్టు మొట్టికాయలతో అప్పుడప్పుడు తొలగింపు ప్రక్రియ చేసినట్లే చేయడం.. ఆ తరువాత యధావిధిగా ఆ స్థలాల్లోకి కబ్జాదారులు చేరిపోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి పరిస్థితుల వల్లనే నిర్మల్‌ పట్టణం ప్రతీయేటా వానకాలం వస్తే చాలు వణికిపోతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గత రెండేళ్లుగా నిర్మల్‌ పట్టణంలో వర్షకాలంలో వివిధ కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం మొదలైందంటే పరిస్థితి ఎటు దారితీస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

కబ్జాకు గురి కాని చెరువేదీ..? 

జిల్లాకేంద్రం చుట్టూ సుమారు 13 గొలుసుకట్టు చెరువులున్నాయి. గతంలో భారీ తటాకాలుగా ఉన్న ఈ చెరువులు ఇప్పుడు కుంచించుకుపోయి చిన్నకుంటలుగా మారుతున్నాయి. దీనికి కారణం చెరువుల చుట్టూ కబ్జాలపర్వమే. నడిబొడ్డులో ఉన్న ధర్మాసాగర్‌ చెరువు మొదలుకొని తాజాగా ఇబ్రహీంకుంట చెరువు దాక కబ్జాల జాబితాలో చేరాయి. ఇక ఈ చెరువులకు అనుసంధానంగా ఉన్న ప్రధాన కాలువలు ఇప్పుడు ఏ ఒక్కటి కూడా కనిపించకుండాపోయాయి. కందకాల పైనా భారీ భవంతులు, కొన్నిచోట్ల వ్యాపారవాణిజ్య సముదాయాలు, నివాస గృహా లు వెలిశాయి. దీంతో ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీటి సరఫరా లేకుండాపోయింది. ఇక భారీవర్షం వస్తే చెరువులు నిండితే ఆ నీళ్లు ఎటువెళతాయో అర్థంకాకమానదు. దారులన్నీ మూసుకుపోతే ప్రత్యామ్నాయంగా దారి వెతికినట్లే... నీరు పల్లమెరుగు అన్న రీతిన చెరువులు నిండి వరదనీరు పట్టణంలోని కాలనీలను ముంచెత్తుతోంది. ఇదీ జగమెరిగిన సత్యమే అయినా కబ్జాదారులు మాత్రం తమ తప్పేమి లేదన్నట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. 

రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపల్‌ శాఖలే కారణం

జిల్లా కేంద్రంలో చెరువులు, కుంటలు, కందకాలు ఆక్రమణలకు గురికావడానికి నీటి పారుదల రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలు వకాల్తా తీసుకున్నట్లుగా ఉంది. భూముల విస్తీర్ణం ఎంతో రికార్డుల్లో చూపాల్సింది రెవెన్యూ శాఖ, చెరువుల ఎఫ్‌టీఎల్‌ భూములను గుర్తించి పరిరక్షించాల్సిన నీటిపారుదలశాఖ కబ్జారాయుళ్లతో దోస్తీ చేస్తున్నాయి. ఇక మున్సిపల్‌ శాఖ సంగతి తెలిసిందే. అడ్డగోలు, అక్రమం ఏది ఏక్కడ కట్టినా అనుమతులు ఇచ్చే రీతిన మున్సిపల్‌శాఖ అవినీతి ఆరోపణలను మూటగట్టుకుంటున్నది. చెరువుల భూములు, కుంటలు, కాలువలు, కందకాలకు సంబంధించి వందలకొద్దీ ఎకరాలు అన్యాక్రాంతమై అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళినా ఈ మూడు ప్రధానశాఖలు పట్టించుకోలేదు. కొత్తగా వస్తున్న అధికారులు తలలు పట్టుకోవడం మినహా ఏమి చేసే పరిస్థితి లేదు. 

కబ్జాల్లో అందరూ పెద్దలే..

నిర్మల్‌ చుట్టూ ఉన్న చెరువులు, కందకాలు, కుంటల కబ్జాల వ్యవహా రం వెనక అందరూ అధికార పెద్దలే ఉండడంతో పరిరక్షించాల్సిన అధి కార యంత్రాంగం చేతులు కట్టుకొని ఉంటున్నది. నిర్మల్‌ నియోజకవర్గానికి అగ్రనేతగా ఉన్న అధికార పార్టీ బందువులు సహా ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలందరిపై కూడా కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అనేకసార్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నప్పటికీ అధికార యంత్రాంగం నోరుమెదపకపోవడానికి కారణం టీఆర్‌ఎస్‌ పెద్దల ఒత్తిడులే కారణమని సర్వత్రా విమర్శలున్నాయి. అనేక కోర్టుకేసులు కూడా నడుస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అడ్డుకోకపోవడం, కోర్టులకు సరియైున సమాచారం ఇవ్వకపోవడం వంటి వ్యవహారాలకు కూడా అధికార పార్టీ నేతల ఒత్తిడులే కారణమని చెబుతున్నారు. ఒకవేళ అధికారపార్టీ నేతలకు తలొగ్గకుండా ఏ అధికారైనా చర్యలకు దిగితే అలాంటి వారిపై బదిలీ వేటు వేయించారన్న విమర్శలు సైతం సర్వత్రా ఉన్నాయి. ఇలాంటి కారణాల వల్లనే జిల్లా కేంద్రం ముంపు పట్టణంగా పేరు మూటగట్టుకోవడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Updated Date - 2022-08-05T07:22:43+05:30 IST