Abn logo
Jul 1 2020 @ 04:33AM

ఇంట్లోకి చొరబడి చోరీ

పట్టుకోవడానికి ప్రయత్నిస్తే బొమ్మతుపాకీతో బెదిరింపు

నిందితుడి అరెస్టు


రాజేంద్రనగర్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): ఓ ఇంట్లో చోరీ చేసిన వ్యక్తిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ కె. నర్సింహ తెలిపిన వివరాల ప్రకారం.. బాబుల్‌రెడ్డినగర్‌ బృందావన్‌ కాలనీలో నివసిస్తున్న సురేందర్‌ ఇంట్లో ఓ యువకుడు మంగళవారం సాయంత్రం చొరబడ్డాడు. పర్సులో ఉన్న రూ. 400, ఏటీఎం కార్డులు తీసుకొని పారిపోతుండగా దొంగ.. దొంగ అంటూ సురేందర్‌ కేకలు వేశాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న వల్లెపు నవీన్‌ అనే యువకుడు దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు.


సురేందర్‌, నవీన్‌ అతడిని పట్టుకోవడానికి పరుగెడుతుండగా చోరుడు తన వద్ద ఉన్న బొమ్మ తుపాకీతో భయపెట్టాడు. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బలరాంపూర్‌ జిల్లా, ఘరమ్‌బీలోహ ప్రాంతానికి చెందిన అన్వర్‌ అలీ(19) అని తెలిసింది. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని పారిశ్రామికవాడలో కార్మికుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. అతడి నుంచి బొమ్మ తుపాకీ, దొంగిలించిన నగదు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement