Abn logo
Oct 27 2020 @ 03:40AM

అద్వైతమే ఆనందం

Kaakateeya

ఆత్మ సంస్థితిః స్వాత్మదర్శనం

ఆత్మనిర్ద్వయాత్‌ ఆత్మ నిష్ఠతా


తన స్వస్థితిలో తానుండడమే ఆత్మదర్శనం లేదా ఆత్మ సాక్షాత్కారం. దర్శించడానికి ఆత్మలో రెండు లేవు గనుక.. తాను తానుగా ఉండడమే ఆత్మ నిష్ఠ. అందులో జీవేశ్వర భేదానికి తావు లేదు. భగవాన్‌ రమణ మహర్షి మానవాళికి అందించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞాన ప్రబోధ గ్రంథం ‘ఉపదేశ సారం’లోని 26వ శ్లోకమిది. ఈ శ్లోకంలో భగవాన్‌ రమణులు చెప్పిన ఆత్మ దర్శనం అంటే.. కుర్చీనో, బల్లనో చూసినట్లుగా ఆత్మను దర్శించడం కాదు. అది ఒక వస్తువు కాదు. దానికన్నా వేరుగా మరొకటి ఉండే వీలు లేదు. ‘నేహనానాస్తి కించన’ అన్నారు. కనుక ఆత్మను దర్శించే మరొక ఆత్మ లేదా జీవుడు ఉండే వీలు లేదు. మరి ఏమిటీ ఆత్మదర్శం? అంటే.. ‘నేను సర్వవ్యాపకమై, ఏకమై, అద్వయమై ఉన్న ఆత్మను. నాకన్నా వేరుగా ఏమీ లేదు’ అనే అనుభవంలో ఉండిపోవడమే. ఇదే అపరోక్షానుభవం అని శ్రుతులు చెప్పేది.


ఒక కోటీశ్వరుడు నిద్రపోతున్నాడు. కల వచ్చింది. కలలో తానొక బిచ్చగాడు. ఆకలితో అలమటిస్తున్నాడు. ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నాడు. ఎక్కడా ముద్ద దొరకట్లేదు. పైగా తిట్లు. ఇంతలో అతడికి మెలకువ వచ్చింది. కలలోవన్నీ అదృశ్యమైపోయి.. ‘ఇప్పుడు నేను బిచ్చగాణ్ని కాదు. కోటీశ్వరుణ్ని’ అని ఎవరూ చెప్పకుండానే, ఏమీ ఆలోచించకుండానే అతడికి తెలుస్తుంది. అదే కలలో ఉన్నంతసేపే తాను కోటీశ్వరుణ్ని అనే విషయమే అతడికి గుర్తురాదు. మేలుకొన్నప్పుడే అది సాధ్యం. అదే స్వానుభవం. అదే స్వస్థితిలో ఉండడం. ఆధ్యాత్మిక కోణంలో మెలకువగా ఉండడం అంటే.. ఆత్మజ్ఞానం కలగడం. జీవుడుగా ఉన్న వ్యక్తి శ్రవణ, మనన, నిధిద్యాసనల ద్వారా, సాధనల ద్వారా సమాధి నిష్టలో ‘నేను జీవుణ్ని కాదు, ఆత్మనే’ అని గ్రహిస్తాడు. స్వస్థితిలో ఆత్మగానే ఉండిపోతాడు. మరచిపోవడం, గుర్తు తెచ్చుకోవడం ఉండదు. అదే ఆత్మ సంస్థితి. అలా ఆత్మసంస్థితిలో ఉండడమే స్వాత్మ దర్శనం. దాన్నే పరమాత్మ సాక్షాత్కారం అంటారు. ఆత్మ నిర్ద్వయాత్‌.. అంటే రెండు లేవు. ఆత్మ ఏకం. అది అద్వయం. ఎందుకంటే.. ఆత్మకన్నా నీవు వేరైతే ఆత్మ నీ చేత చూడబడేది అవుతుంది. చూడబడేది దృశ్యం. అది పరిమితం. పరిమితమైనదేదైనా నశిస్తుంది. నశించేది ఆత్మ కావడానికి వీల్లేదు కాబట్టి.. ఆత్మ ఏకం.

ఒక బాటసారి కాలినడకన వెళ్తున్నాడు. దారిలో తినడానికి చద్దిమూట నెత్తిన పెట్టుకుని వెళ్తున్నాడు. చాలాసేపట్నుంచీ నడుస్తున్నాడేమో బాగా ఆకలి వేసింది. పైగా నెత్తిన చద్ది మూట బరువు. అడుగు పడడం కష్టంగా ఉంది. ఇంతలో ఒక సెలయేరు కనపడింది. వెంటనే అతడు మూట కిందికి దింపి హాయిగా స్నానం చేసి, చద్ది తిన్నాడు. ఇప్పుడతనికి ఆకలి తీరింది. బలం వచ్చింది. నెత్తి మీద మూటలో ఉన్నప్పుడు బరువుగా అనిపించిన అన్నం.. కడుపులోకి పోతే బరువు లేకపోగా బలంగా ఉంది. అంటే.. వేరుగా ఉంటే భారంగా ఉన్నది, ఒక్కటైపోతే బలంగా మారింది. కాబట్టి అద్వైతమే ఆనందం.

-దేవిశెట్టి చలపతిరావు, [email protected]

Advertisement
Advertisement