కరోనా నిబంధనలకు తిలోదకాలు

ABN , First Publish Date - 2020-07-12T10:38:10+05:30 IST

కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్తున్న వైద్యశాఖే అందుకు తిలోదకాలిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం ఆన్‌లైన్లో

కరోనా నిబంధనలకు తిలోదకాలు

కాట్రాక్టు ఉద్యోగుల భర్తీకి మ్యాన్యువల్‌ దరఖాస్తులు

ఆన్‌లైన్‌ విధానానికి స్వస్తి

వందల సంఖ్యలో అభ్యర్థుల రాక

భౌతిక దూరం పాటించని వైనం

వైద్యశాఖ తీరుపై విమర్శలు వెల్లువ


నెల్లూరు(వైద్యం)జూలై 11 : కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని చెప్తున్న వైద్యశాఖే అందుకు తిలోదకాలిచ్చింది. కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీ కోసం ఆన్‌లైన్లో కాకుండా మ్యాన్యువల్‌గా దరఖాస్తులను ఆహ్వానించింది. దాంతో అభ్యర్థులు అధిక సంఖ్యలో రావడంతో కరోనా నిబంధనలను గాలికి వదిలేసినట్టయింది. ప్రభుత్వ శాఖల్లోని  వివిధ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ జరగాలి. ప్రభుత్వాలు ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తున్నాయి.


కరోనా వైరస్‌ ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అదే పద్ధతిని పాటించాలి. అందుకు వైద్య శాఖ స్వస్తి పలికింది. మ్యాన్యువల్‌గా నియామకాలు చేపట్టింది. ఫలితంగా వైద్య ఆరోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు వందల సంఖ్యలో నిరుద్యోగులు ఆయా కార్యాలయాలకు వెళ్తున్నారు. దరఖాస్తుల స్వీకరణలో వారు భౌతిక దూరం పాటించడం లేదు. ఎక్కువ మంది రావడం వల్ల ఇలా జరుగుతోంది. మ్యాన్యువల్‌ పద్ధతిన దరఖాస్తులు చేయాలని చెప్పడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


భౌతిక దూరంగా లేకుండానే..

వైద్య ఆరోగ్య శాఖలో 92 స్టాఫ్‌ నర్సులు, 50 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 22  ఫార్మాసిస్టుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో 38 స్టాఫ్‌ నర్సులు, మూడు ల్యాబ్‌ టెక్నీషియన్‌లు , నాలుగు రేడియాగ్రాఫర్లు, అలాగే వైద్య విధాన పరిషత్‌త్‌లో 35 స్టాఫ్‌నర్సులు, 10 ఫార్మాసిసి్‌స్టలు, 1ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. వందల సంఖ్యలో నిరుద్యోగులు వైద్య కళాశాలకు వస్తున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.


ఎంతో మంది వైద్యులు, ఉద్యోగులు సైతం కరోనా వైర్‌సకు గురయ్యారు. ఈ కళాశాలలోనే కరోనా నిర్ధారణ పరీక్షల ల్యాబ్‌లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో  భౌతిక దూరం లేకుండా దరఖాస్తుల స్వీకరణ జరుగుతోంది. దీంతో తాము ఎక్కడ కరోనాకు గురికావల్సి వస్తుందోనన్న  అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో లాగా ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ జరిగి ఉంటే బాగుండేదని అంటున్నారు. అధికారుల మాత్రం ఇది తమ నిర్ణయం కాదని, ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పద్ధతి పాటిస్తోందని అంటున్నారు.


Updated Date - 2020-07-12T10:38:10+05:30 IST