Abn logo
Jul 6 2020 @ 23:32PM

కొత్త కథానాయికను పరిచయం చేస్తాం!

నందమూరి బాలకృష్ణకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ అమలా పాల్‌ నటిస్తున్నారా? కథానాయికగా ఆమెను దర్శకుడు బోయపాటి శ్రీను ఖరారు చేశారా? అవుననే రెండు మూడు రోజులుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఇది నిజమా? కాదా? అని బోయపాటిని ‘చిత్రజ్యోతి’ని సంప్రదించగా... ‘‘బాలయ్యబాబు సరసన స్టార్‌ హీరోయిన్‌ను తీసుకోవడమా? కొత్త కథానాయికను పరిచయం చేయడమా? అని మొదట ఆలోచించాం. కొత్త కథానాయికను తీసుకోవాలని మేం నిర్ణయించుకున్నాం. ఈ చిత్రం ద్వారా కొత్తమ్మాయిని పరిచయం చేస్తాం’’ అని చెప్పారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కలయికలో మూడో చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అంచనాలు పెంచింది. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. చిత్రంలో ఒక కథానాయికకు చోటుందని, కీలక పాత్రలో మరొకరు నటిస్తారని  తెలిసింది. ‘లెజెండ్‌’ సమయానికి రాధికా ఆప్టేపై తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. ఆ సినిమాతో ఆమెను పూర్తిస్థాయి కమర్షియల్‌ కథానాయికగా, నటిగా తెలుగు ప్రేక్షకులకు బోయపాటి పరిచయం చేశారు. అదే విధంగా ఈసారీ ఎటువంటి అంచనాలు లేని కథానాయికను పరిచయం చేయనున్నారని సమాచారం. సెప్టెంబర్‌లో చిత్రీకరణ పునఃప్రారంభించాలని అనుకుంటున్నారట.

Advertisement
Advertisement
Advertisement