‘కల్తీ’ కల్లోలం

ABN , First Publish Date - 2020-04-04T10:03:34+05:30 IST

ఏళ్లతరబడిగా కల్తీ కల్లు తాగేందుకు అలవాటుపడిన జనాలకు కల్లు దూరమవడంతో పిచ్చిపిచ్చిగా, వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహాలో జిల్లాలో ఆరుగురు

‘కల్తీ’ కల్లోలం

కల్లు దొరక్క.. మెదక్‌ జిల్లాలో ఇప్పటివరకు ఆరుగురి మృతి

మత్తు లేక గమ్మత్తు, వింత ప్రవర్తన

మతిస్థిమితం కోల్పోతున్న వైనం

రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

కల్లు అందేలా చూడాలంటూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, ఏప్రిల్‌ 3 : ఏళ్లతరబడిగా కల్తీ కల్లు తాగేందుకు అలవాటుపడిన జనాలకు కల్లు దూరమవడంతో పిచ్చిపిచ్చిగా, వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ తరహాలో జిల్లాలో ఆరుగురు మృత్యువాతపడడం పరిస్థితికి అద్దం పడుతోంది. జిల్లాలో ఒకటి రెండుచోట్ల కాదు చాలా పల్లెలు, పట్టణాల్లోనూ ఇదే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో విక్రయాలు జరగకుండా పోలీసులు, ఎక్సైజ్‌శాఖ యంత్రాంగం దాడులు చేస్తున్నా.. కొన్ని గ్రామాల్లో యథేచ్ఛగా విక్రయాలు సాగుతున్నాయి. జిల్లా కేంద్రమైన మెదక్‌లో తమకు కల్లు అందేలా చూడాలంటూ ప్రజాప్రతినిధులను పలువురు వేడుకుంటున్నారు. బాధితుల బాధ చూడలేక కొందరు కల్లు ఇళ్లకు పంపించడం గమనార్హం.


జిల్లాలో ఆరుగురి మృతి

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం, కల్లు దుకాణాలతో పాటు బార్లు మూతపడ్డాయి. దీంతో కల్లు ప్రియులకు ఇబ్బందులు మొదల య్యాయి. లాక్‌డౌన్‌ ప్రారంభమై వారంరోజులు దాటింది. కల్లు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరు పిచ్చివాళ్లుగా మారుతున్నారు. మరికొందరు మూర్చపోవడం, కాళ్లు, చేతులు వంకర పోవడం జరుగుతోంది. ఈ పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది. కల్తీ కల్లుకి అలవాటు పడటమే ఇందుకు కారణం. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన మెదక్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. రామాయంపేట మండలం, అల్లాదుర్గం, చేగుంట, నిజాంపేట, వెల్దుర్తి, హవేళీఘణపూర్‌, పాపన్నపేట మండలాల్లో బాధితుల సంఖ్య పెద్దగా ఉంది.


ఇప్పటివరకు జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్రతను తెలుపుతోంది. గత ఆదివారం నిజాంపేటలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి మండలం మాసాయిపేటలో మరో వ్యక్తి ఉరేసుకుని, రామాయంపేటకు చెందిన ఓ వృద్ధుడు కల్లు దొరక్క ఫిట్స్‌ వచ్చి వారం క్రితం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మెదక్‌ పట్టణంలో ఇద్దరు మరణించారు. ఇక వందల సంఖ్యలో బాధితులుగా మారారు. వీరిలో వృద్ధులు, మహిళలతో పాటు యువకులు కూడా ఉండడం గమనార్హం. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బారాహిమాన్‌ కాలనీకి చెందిన జీకురు నర్సయ్య (60) మద్యం దొరక్క ఎల్లమ్మగుడి సమీపంలో గల బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కల్లు దొరక్క మానసిక రోగులుగా మారుతున్నవారిలో కూలీలే ఎక్కువమంది ఉన్నారు. మెదక్‌ ఏరియా ఆస్పత్రిలో నిత్యం ఇటువంటి వారు చికిత్సకు వస్తున్నారు. 


ఇలాంటి వారెందరో

మెదక్‌ పట్టణానికి చెందిన ఓ స్థానిక ప్రజాప్రతినిధి తన వార్డులో నాలుగురోజుల క్రితం పర్యటిస్తుండగా... ఓ వృద్ధురాలు ఎదురుపడి ’నాకు ఏమీ వద్దు బిడ్డా.. ఒక్క సీసా కల్లు ఉంటే పంపు’ అంటూ ప్రాధేయపడింది. ’తాగకపోతే చచ్చిపోయేటట్టున్నాను’ అంటూ కన్నీరు పెట్టుకుంది. దాంతో చలించిపోయిన ఆ నాయకుడు తమ వార్డుల్లో అలాంటి వారిని గుర్తించి వేరే చోట నుంచి కల్లు తెప్పించి ఇచ్చాడు. దాంతో ఆ వృద్ధురాలు.. నేను బతికుంటే.. వచ్చే ఎలక్షన్లలో నీకే ఓటేస్తా బిడ్డా అంటూ మురిసిపోతూ చెప్పింది. కల్లు ప్రియుల దుస్థితికి ఈ సంఘటన ఓ ఉదాహరణ. జిల్లా కేంద్రంలో ఈ తరహా బాధితులు పెరిగిపోవడంతో పలువురు ప్రజాప్రతినిధులు కల్లు డిపో నిర్వహకులు ఫోన్‌చేసి కల్లు ఎలాగోలా అందేలా చూడాలంటూ కోరడం గమనార్హం. లాక్‌డౌన్‌ పూర్తయ్యే నాటికి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో లాక్‌డౌన్‌ నాటి నుంచి ఇప్పటివరకు కల్లు విక్రయాలపై 20 వరకు కేసులు నమోదయ్యాయి. వందల లీటర్ల కల్లు అధికారులు పారబోశారు. పట్టణాల్లో గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున విక్రయాలు చేస్తున్నారు. సీసాల్లో కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాకెట్లుగా కట్టి ఇళ్లవద్దకే చేరవేస్తున్నారు.


అలాంటి వారిని చికిత్సకు తీసుకురావాలి 

కల్తీ కల్లుతాగి బానిసలుగా మారినవారు అది దొరక్కపోవడంతో మూర్చ, పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం, కాళ్లు, చేతులు వంకర పోవడం వంటివి జరుగుతున్నాయి. ఆ లక్షణాలు కనబడిన వారిని చికిత్సకై మెదక్‌లోని జిల్లా ఆస్పత్రి, లేదా నర్సాపూర్‌ ప్రభుత్వాస్పతికి తీసుకొస్తే చికిత్స అందిస్తాం. మెదక్‌లో ఇప్పటివరకు 25 మందికి వైద్య సహాయం అందించాం. కల్తీ కల్లే ఇటువంటి ఘటనలకు కారణం.

డాక్టర్‌ చంద్రశేఖర్‌, సూపరింటెండెంట్‌, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి


బ్రాహ్మణపల్లిలో కల్లు దుకాణంపై దాడి

తూప్రాన్‌: తూప్రాన్‌ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లిలో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అక్రమంగా కల్లు నిలువ చేసిన పచ్చమట్ల వెంకటేశ్‌గౌడ్‌పై కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్‌ ప్రొహిబీషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.అశోక్‌ పేర్కొన్నారు. అక్రమంగా నిలువ చేసిన ఒక్కొక్క లీటరు పరిమాణం కలిగిన 95 కల్లు పాకెట్లు స్వాదీనం చేసుకున్నట్లు వివరించారు. దాడిలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ ఎన్‌. పద్మారావు. సిబ్బంది తరుమలయ్య, అనిల్‌, రవి, సత్తయ్యలుపాల్గొన్నారు. 


కొండపోచమ్మ ఆలయం వద్ద తనిఖీలు 

గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌ : ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ‘కొండపోచమ్మ వద్ద ఏరులై పారుతున్న మద్యం’ కథనానికి గజ్వేల్‌ ఎక్సైజ్‌ అధికారులు స్పందించారు. గజ్వేల్‌ ఎక్సైజ్‌ సీఐ ప్రభావతి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌ నర్సాపూర్‌ గ్రామ శివార్లలోని కొండపోచమ్మ ఆలయం వద్ద శుక్రవారం దాడులు జరిపి 35 కాటన్ల బీరు సీసాలు స్వాధీనం చేసుకుని నర్సింలు, వెంకటేశ్‌ అనే ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై తదుపరి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్‌ సీఐ ప్రభావతి తెలిపారు. ఆమెవెంట ఎక్సైజ్‌ ఎస్‌ఐ రామ్‌గోపాల్‌, సిబ్బంది ఉన్నారు. 


నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు

హుస్నాబాద్‌రూరల్‌ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలంలోని పూల్‌నాయక్‌తండా, బల్లునాయక్‌తండా, అక్కన్నపేట మండలంలోని పంతుల్‌తండా తదితర గిరిజన తండాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేశారు.  సంగారెడ్డి ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ గాయత్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించగా నాటుసారాకు ఉపయోగించే 130 లీటర్ల బెల్లం పానకం లభ్యం కాగా.. ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ మోహన్‌వర్మ, సీఐ విజయలక్ష్మి, ఎస్‌ఐ బేగు ఉన్నారు. 


అల్లాదుర్గంలో మద్యం బాటిళ్లు స్వాధీనం

అల్లాదుర్గం : మెదక్‌జిల్లా అల్లాదుర్గం మండలంలోని చిల్వర్‌ గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై శుక్రవారం  సాయంత్రం దాడులు చేసి  మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌.ఐ మోహన్‌రెడ్డి ఈ సమాచారాన్ని వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిల్వర్‌ గ్రామానికి చెందిన  భద్రప్ప, సంగన్న అనే ఇద్దరు వ్యాపారులపై  తమ సిబ్బందితో దాడులు చేశామన్నారు.. ఈ దాడిలో  వివిధ రకాల 50 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.ఐ చెప్పారు.  

Updated Date - 2020-04-04T10:03:34+05:30 IST