భారీ బడ్జెట్‌తో బరిలోకి

ABN , First Publish Date - 2020-10-18T06:27:06+05:30 IST

బాహుబలి చిత్రంతో భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణానికి బాటలు పరిచారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు దక్షిణాది చిత్ర

భారీ బడ్జెట్‌తో బరిలోకి

బాహుబలి చిత్రంతో భారీ బడ్జెట్‌ చిత్రాల నిర్మాణానికి బాటలు పరిచారు దర్శకుడు రాజమౌళి. ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమ రెట్టించిన ఉత్సాహంతో పాన్‌ ఇండియా మంత్రాన్ని జపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ పరిశ్రమల నుంచి వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. భారీ సెట్టింగులు, భారీ విజువల్‌ ఎఫెక్ట్‌లు, భారీ తారాగణంతో దక్షిణాది చిత్రాలు బరిలోకి దిగుతున్నాయి. 


చిత్రం: ఆర్‌ఆర్‌ఆర్‌

బడ్జెట్‌: రూ.400 కోట్లు 

నిర్మాత: డి.వి.వి. దానయ్య

నిర్మాణ సంస్థ: డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌


పాన్‌ ఇండియా మూవీలకు బాహుబలితో వెండితెరపై బిగ్‌ ఎంట్రీ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి. బాహుబలి రెండు భాగాల తర్వాత వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ స్వతంత్య్ర పోరాట వీరుల పాత్రలతో తెరకెక్కుతోన్న కల్పిత గాథ. 



తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. తొలుత 350 కోట్లు అనుకున్న బడ్జెట్‌ కాస్తా కరోనా వల్ల సకాలంలో షూటింగ్‌ జరగక 500 కోట్లకు చేరిందని సమాచారం. అయినా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు తెరను పంచుకుంటున్నారు.


రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, ఆలియాభట్‌, అజయ్‌దేవ్‌గణ్‌, ఒలివియా మోరీస్‌ తదితర నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాండ్‌ చిత్రం ‘ఎ వ్యూ టూ కిల్‌, ఇండియానా జోన్స్‌, ద లాస్ట్‌ క్రూసేడ్‌’ లాంటి హాలీవుడ్‌ చిత్రాల్లో విలన్‌గా నటించిన ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ ఆర్‌ఆర్‌ఆర్‌లో విలన్‌గా నటిస్తున్నారు. మరో ఐరీష్‌ నటుడు రే స్టీవెన్‌సన్‌ మెయిన్‌ విలన్‌గా నటిస్తున్నారు. 




తమిళం

చిత్రం: ఇండియన్‌ 2 

బడ్జెట్‌: రూ.350 కోట్లు 

దర్శకత్వం: శంకర్‌

నిర్మాత: అల్లిరాజా సుభాస్కరన్‌

నిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్‌ 

భారీ చిత్రాలకు మొదటి నుంచి దర్శకుడు శంకర్‌ పెట్టింది పేరు. కమల్‌హాసన్‌ హీరోగా 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2’ తీస్తున్నారు. ‘భారతీయుడు’ సీక్వెల్‌లో సేనాపతిగా కమల్‌హాసన్‌ చేసే సాహసాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు.

గోకులం స్టూడియోలో వేసిన ఒక్క సెట్‌కే రూ. 12 కోట్లు ఖర్చు చేశారట. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమాల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 




తమిళం

చిత్రం: పొన్నియిన్‌ సెల్వన్‌

దర్శకత్వం:  మణిరత్నం

బడ్జెట్‌: రూ.500 కోట్లు

నిర్మాణ సంస్థలు: లైకా ప్రొడక్షన్స్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు

భారతీయ సినిమా చరిత్రలో మైలు రాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు చెపుతోన్న తమిళ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ తమిళ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.  చోళ రాజు రాజరాజ చోళుడు తదితర నిజజీవిత పాత్రలతో తెరకెక్కుతోన్న కల్పిత గాథ. 

 ఎంజీ రామచంద్రన్‌, కమల్‌హాసన్‌ కూడా ఈ నవలను సినిమాగా తీయాలనుకున్నారు కానీ వీలు కాలేదు. తమిళ, తెలుగు సూపర్‌స్టార్స్‌ విజయ్‌, మహేష్‌ బాబుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని మణిరత్నం గతంలో ప్రయత్నించారు. కానీ బడ్జెట్‌ పరిమితులతో కుదరలేదు. 

 ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ మణిరత్నం తొలి సీక్వెల్‌ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం ఆయన డ్రీమ్‌ప్రాజెక్ట్‌.  

 తమిళ హీరోలు కార్తీ, విక్రమ్‌, జయం రవి, మలయాళ నటుడు జయరామ్‌, ఐశ్వర్యారాయ్‌, త్రిషలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 


    


 చిత్రం: మరక్కార్‌ - అరబీ కడలింటె సింహం

బడ్జెట్‌: రూ.100 కోట్లు

నిర్మాతలు: ఆంటోనీ పెరుంబావూర్‌, సంతోష్‌

దర్శకత్వం:  ప్రియదర్శన్‌

నిర్మాణ సంస్థ:  ఆశీర్వాద్‌ సినిమాస్‌ 

రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న తొలి మలయాళ చిత్రం ‘మరక్కార్‌ః అరబీ కడలింటె సింహం’. 16వ శతాబ్దం నేపథ్యంలో జరిగిన సముద్ర యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. మలబారు తీరప్రాంతంలో పోర్చుగీసులు సముద్ర మార్గంలో జరిపిన దండయాత్రను మరక్కార్‌ సముద్రంపై అడ్డుకున్నారు.


మోహన్‌లాల్‌ టైటిల్‌పాత్ర పోషిస్తున్నారు. తమిళ నటుడు అర్జున్‌, సునీల్‌శెట్టి, ప్రభు, మంజువారియర్‌, కీర్తి సురేష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోహన్‌లాల్‌ తనయుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌, దర్శకుడు ప్రియదర్శన్‌ కూతురు కల్యాణి ప్రియదర్శన్‌ అతిథి పాత్రలో కనిపిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోకి డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు.

చిత్ర బడ్జెట్‌లో అధిక భాగంస్పెషల్‌ ఎఫెక్ట్‌లు, యుద్ధ సన్నివేశాల కోసమే ఖర్చుపెట్టారు. ఈ ఏడాది మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా 5 వేల థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేసినా కరోనా లాక్‌డౌన్‌తో ఆగిపోయింది.




చిత్రం: రాధేశ్యామ్‌

బడ్జెట్‌:  రూ.150 కోట్లు 

దర్శకత్వం:  రాధాకృష్ణకుమార్‌ 

నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌

నిర్మాతలు: వంశీ, ప్రమోద్‌, ప్రసీదా, భూషణ్‌కుమార్‌

‘బాహుబలి’ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగారు ప్రభాస్‌. ఆయన ‘సాహో’ తరువాత చేస్తున్న మూవీ ‘రాధేశ్యామ్‌’. 1970ల్లో ఐరోపాలో జరిగిన ప్రేమకథగా చెపుతున్నారు. ఇటలీ, లండన్‌, జార్జియాల్లో షూటింగు జరుపుకుంటోంది.

వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలవుతుంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలచేస్తున్నారు. భాగ్యశ్రీ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 




చిత్రం:  కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2

బడ్జెట్‌:  రూ.500 కోట్లు

దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌

నిర్మాత: విజయ్‌ కిరగాందూర్‌

నిర్మాణ సంస్థ: హోంబలే ఫిల్మ్స్‌

2018లో వచ్చిన కన్నడ చిత్రం కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌) ఐదు భాషల్లో విడుదలై బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టింది. సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ను మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు.

యష్‌ హీరో. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. హిందీ, మలయాళం, తమిళ, తెలుగు భాషల్లో డబ్‌ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 4 వేల స్ర్కీన్లలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

 దండేల కృష్ణ


Updated Date - 2020-10-18T06:27:06+05:30 IST