ఈ ఏడాది కొత్త కొలువులోకి..

ABN , First Publish Date - 2022-01-19T06:06:48+05:30 IST

కరోనా సంక్షోభ కాలంలోనూ భారత ఉద్యోగులు భవిష్యత్‌పై ఆశావహంగా

ఈ ఏడాది కొత్త కొలువులోకి..

  •  82 శాతం ఉద్యోగుల అభిమతమిదే 
  •  లింక్డ్‌ఇన్‌ అధ్యయన నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ కాలంలోనూ భారత ఉద్యోగులు భవిష్యత్‌పై ఆశావహంగా ఉన్నారని, వృత్తి నిపుణుల్లో 82 శాతం మంది ఈ ఏడాది ఉద్యోగం మారాలని అనుకుంటున్నారని లింక్డ్‌ఇన్‌ తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. దేశంలోని 1,111 వృత్తినిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా లింక్డ్‌ఇన్‌ ఈ రీసెర్చ్‌ రిపోర్టును రూపొందించింది. ‘‘కరోనా సంక్షోభం ఉద్యోగులను కెరీర్‌పై పునరాలోచనలో పడేయడంతో పాటు తమ జీవిత నూతన లక్ష్యాలు, ప్రాధాన్యాలకు తగిన కొత్త కొలువు వెతుక్కునే దిశగా పురికొల్పింది. కొత్త అవకాశాలపై ధీమా పెరగడంతో ఉద్యోగుల వలసలు ఊపందుకున్నాయి. మంచి నైపుణ్యం కలిగిన వారు మరింత సౌకర్యవంతమైన ఉద్యోగ అన్వేషణలో ఉన్నారని’’ లింక్డ్‌ఇన్‌ న్యూస్‌ భారత విభాగ మేనేజింగ్‌ ఎడిటర్‌ అంకిత్‌ వెంగుర్లేకర్‌ అన్నారు. ఐటీ, హెల్త్‌కేర్‌, బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ రంగాల్లో సాంకేతిక నిపుణులకు డిమాండ్‌ అధికంగా ఉందన్నారు. 


కొలువు మార్పు.. మహిళలే అధికం : పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత లోపించిన కారణంగా ప్రస్తుత ఉద్యోగం మారాలనుకుంటున్న మహిళలు 38 శాతం కాగా.. మగవారు 28 శాతం. అంటే, ఈ కారణంగా ఉద్యోగం మారే అవకాశం ఉన్న వారిలో మహిళలే 1.3 రెట్లు అధికమని సర్వే వెల్లడించింది. అంతేకాదు, మరింత మెరుగైన వేతనం లభిస్తే, ప్రస్తుత కొలువులోనే కొనసాగుతామని 49 శాతం ఉద్యోగినులు అభిప్రాయపడగా.. పురుషుల్లో ఈ వాటా 39 శాతంగా ఉంది. 




71% ఉద్యోగుల్లో  కెరీర్‌పై పునరాలోచన

కొవిడ్‌ సంక్షోభం జాబ్‌ మార్కెట్‌పై గణనీయ ప్రభావం చూపిందని, ఉద్యోగులు కొత్త ప్రాధాన్యాలను నిర్దేశించుకునే దిశగా పురికొల్పిందని ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ ఇండీడ్‌ తాజా సర్వే రిపోర్టు పేర్కొం ది. తమ సర్వేలో పాల్గొన్న ఉద్యోగుల్లో 71 శాతం మంది తమ కెరీర్‌ (వృత్తి)పై పునరాలోచనలో ఉన్నారని, భవిష్యత్‌లో భిన్న వృత్తిని ఎంచుకునేందుకు అవకాశాలున్నాయని ఇండీడ్‌ వెల్లడించింది. గత ఏడాది అక్టోబరు-నవంబరు కాలంలో 1,219 కంపెనీల యాజమాన్యాలు, 1,511 ఉద్యోగుల నుంచి వేల్యూవాక్స్‌ సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఇండీడ్‌ ఈ రిపోర్టును విడుదల చేసింది.




Updated Date - 2022-01-19T06:06:48+05:30 IST