Abn logo
Feb 21 2020 @ 04:43AM

మార్పు కోసమే రాజకీయాల్లోకి

దేశం కోసం జీవితాన్ని ధారపోస్తా..

ఓటమి నన్ను కుంగతీయలేదు

విజ్ఞాన్‌ భవన్‌లో పవన్‌ కల్యాణ్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): ‘‘సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. దేశం కోసం నా జీవితాన్ని ధారపోస్తా. సమాజసేవలో నావంతు పాత్రను త్రికరణ శుద్ధితో నిర్వహిస్తా. యువతలోని ఆవేశాన్ని అర్థం చేసుకున్నా. అందుకే మీతో మాట్లాడేందుకు వచ్చా’’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఇండియన్‌ స్టూడెంట్స్‌ పార్లమెంటు సదస్సులో ఆయన మాట్లాడారు. అధికారం కోసం చేస్తున్న రాజకీయాలను చూసి విసుగు చెందానన్నారు. భగత్‌సింగ్‌ స్ఫూర్తితో దేశానికి ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో రాజకీయ పార్టీని 2014లో స్థాపించానన్నారు. తాను పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓటమి పాలైనా కుంగిపోలేదన్నారు. ‘నా లక్ష్యసాధన కోసం పనిచేస్తూనే ఉంటాను. నా దే శానికి సేవ చేయాలని కట్టుబడి ఉన్నాను’అని పవన్‌ అన్నారు. రాజకీయంగా తమకు ఒకే ఎమ్మెల్యే ఉన్నారని, అయినా తన పోరాటం నిరంతరం ప్రజల కోసం కొనసాగుతూనే ఉంటుందన్నారు.


కర్నూలులో సుగాలి ప్రీతి అత్యాచార ఘటనను ప్రస్తావించారు. అదే... సినిమాలో అయితే రెండు మూడు నిమిషాల్లో న్యాయం చే యొచ్చేమోగాని నిజ జీవితంలో అది సాధ్యం కాదన్నారు. అందుకోసం సుదీర్ఘమైన పోరాటం జరపాల్సి వచ్చిందన్నారు. రాజకీయాల్లో మార్పు కావాలని కోరుకుంటే సహనం కావాలని పవన్‌ అన్నారు. కొన్నేళ్ల పోరాటంతోనే అది సాధ్యపడుతుందన్నారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలు, కార్యాచరణతోనే లక్ష్యాలు సాకారమవుతాయని పవన్‌ అన్నారు. ‘నా స్వలాభం కోసం, అధికారం కోసం నేను పనిచేయడం లేదు. ఓటమి ఎదురైనా దేశ సేవ కోసమే ఎంతో ఓపికతో ముందుకు సాగుతున్నా’ అని పవన్‌ అన్నారు. ఇన్‌స్టంట్‌ నూడిల్స్‌ లా వెంటనే ఫలితం కావాలని అనుకోవద్దన్నారు. ఓపిక కావాలన్నారు. భిన్న వర్గాలు, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నా... మనమంతా ఒకే దేశం అన్న నినాదంతో ఐక్యతగా ముందుకు సాగుదామని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ‘‘నేను అంతా పిడికెడు మట్టే కావచ్చు. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకు ఉన్నంత పొ గరు ఉంది’’ అన్న ప్రముఖ కవి కవితా పంక్తులను పవన్‌ వినిపించారు.


సైనిక  కుటుంబాలకు కోటి విరాళం

సైనిక కుటుంబాల సంక్షేమం కోసం జనసేనాని కోటి రూపాయల విరాళం అందించారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయంలో సంబంధిత అధికారులకు చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రాణాలకు తెగించి, కార్యదీక్షతో సరిహద్దుల్లో పనిచేస్తున్న మన భారత సేనలను ఆదుకునేందుకు జనసేన నేతలు, కార్యకర్తలు కూడ తమకు తోచిన విరాళాలు అందివ్వాలని పవన్‌ పిలుపునిచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement