కొత్త కక్ష్యలోకి!

ABN , First Publish Date - 2022-08-05T10:18:18+05:30 IST

సద్బుద్ధో, దుర్బుద్ధో తెలియదు కానీ, డీఎంకె నాయకుడు రాజా ఓ వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. పన్నెండేళ్ళక్రితం 2జీ స్పెక్ట్రమ్ అమ్మకాల్లో దేశం...

కొత్త కక్ష్యలోకి!

సద్బుద్ధో, దుర్బుద్ధో తెలియదు కానీ, డీఎంకె నాయకుడు రాజా ఓ వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు. పన్నెండేళ్ళక్రితం 2జీ స్పెక్ట్రమ్ అమ్మకాల్లో దేశం లక్షా డెబ్బయ్ ఆరువేలకోట్ల రూపాయలు నష్టపోయిందని అంచనావేసిన నేపథ్యంలో, ఇప్పుడు 5జీ వేలంపాటలో అంతకంటే తక్కువే వచ్చింది కనుక ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపించి నిజం నిగ్గుతేల్చాలని ఈ మాజీ టెలికమ్యూనికేషన్ల మంత్రి డిమాండ్ చేశారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంపాటలో సుమారు లక్షన్నరకోట్లు వచ్చిన నేపథ్యంలో, ఇది ప్రభుత్వం వేలం నుంచి ఆశించిన, వేసుకున్న అంచనాలకంటే ఎంతో తక్కువగా ఉన్నందున, దర్యాప్తు అవసరమంటారు రాజా.


మాజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ తన 2010లో నివేదికలో లెక్కగట్టిన 1.76 లక్షలకోట్ల నష్టం, దేశం ఇంకా స్పెక్ట్రమ్ అమ్మకాలు, కేటాయింపులకు సంబంధించి శైశవదశలో ఉన్నప్పటిది. ఇప్పుడు అంతకంటే శక్తివంతమైన, వేగవంత మైన, మరో మూడుదశలు దాటిన బలమైన నెట్‌వర్క్‌ను వేలం వేసినప్పుడు, అప్పటి అంచనాకంటే ఇప్పుడు తక్కువరావడమేమిటన్నది రాజా ప్రశ్న. తన గత నిర్ణయాన్ని సమర్థించుకొనే ఆయన వాక్యాలను మినహాయించితే, ముప్పై మెగాహెర్ట్జ్ 2జీ కేటాయింపుల్లో నష్టమే లక్షాడెబ్బై ఐదువేలకోట్లు ఉన్నదని అన్నప్పుడు, దశాబ్దం దాటిన తరువాత, యాభైఒక్క మెగాహెర్ట్జ్ ల 5జీ వేలంలో లక్షన్నర కోట్లు రావడమేమిటని అడుగుతున్నారాయన. 2జీతో పోల్చితే ఖరీదులోనూ, సమర్థతలోనూ పదిపదిహేనురెట్లు ఎక్కువైన 5జీని వేలం వేస్తున్నప్పుడు ఎంతకాదనుకున్నా ఐదారులక్షలకోట్లు రావాల్సి ఉండగా, మూడోవంతు కూడా రానప్పుడు ఎక్కడో పొరపాటు జరిగిందనీ, ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కు కూడా అయివుండవచ్చునని రాజా ఆరోపణ. ఈ లెక్క వినడానికే బాగుంటుందనీ, ఆయన ఆరోపణకు మాత్రం పాతకక్షలు కారణమని కొందరి విమర్శ. వినోద్ రాయ్ కట్టిన ఆ లెక్క అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేవరకూ వదల్లేదు. దానిని అత్యంత అవినీతికర పాలనగా ప్రజల్లో చులకనచేసేందుకు తోడ్పడింది. అధికారంలో భాగస్వాములుగా ఉన్న ప్రాంతీయపార్టీలు ఇష్టం వచ్చినట్టు దోచకుంటున్నా కాంగ్రెస్ నోరువిప్పలేకపోతున్నదని బీజేపీ విమర్శలు చేసేది. రాజాను కాగ్ నివేదిక నేరుగా తప్పుబట్టింది. వినోద్ రాయ్ ఊహాత్మక లెక్క దెబ్బతో రాజా, కనిమొళి ఇత్యాదులు జైళ్ళకు పోయారు. కొన్నేళ్ళ తరువాత, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కాగ్ ఊహాత్మక లెక్కలని కూడా తప్పుబడుతూ, ఈ కేసుకు వీసమెత్తు విలువలేదంటూ వారిని వదిలేసింది. వినోద్ రాయ్ వాదనలో కుట్రనూ, వెనుక ఉన్నలక్ష్యాలనూ, కారణమైన పార్టీనీ ప్రజలకు తెలియచెప్పే లక్ష్యంతో కాంగ్రెస్, డీఎంకె ఇప్పుడు విమర్శలు చేస్తుండవచ్చు. ఏమిటీ అడ్డగోలు వాదన, కొంత స్పెక్ట్రమ్ అమ్ముడుపోనప్పుడు ముందు అనుకున్నంత భారీ మొత్తం ఎలా వస్తుందని టెలికాం మంత్రి వైష్ణవ్ అంటున్నారు. డెబ్బైశాతం స్పెక్ట్రమ్ అమ్మగలిగినప్పుడు నిర్దేశించుకున్న మొత్తంలో ముప్పైశాతమే రావడమేమిటని మరికొందరు అడుగుతున్నారు. 


ఈ వాదనలూ, విమర్శలను అటుంచితే, వేలం జోరుగా సాగడానికీ, స్పెక్ట్రమ్ మిగిలిపోకుండా ఉండటానికి ఈమారు, స్పెక్ట్రమ్ సేకరణ, వినియోగ చార్జీలను ఎత్తివేయడం, బ్యాంకు గ్యారంటీ అక్కరలేదనడం, ఇరవైవాయిదాల్లో సొమ్ముచెల్లించే వీలు కల్పించడం వంటి నిర్ణయాలు ఉపకరించాయని ప్రభుత్వం అంటోంది. పన్నెండేళ్ళనాటి 3జీ వేలంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చింది మూడురెట్లు. ఏడేళ్ళక్రితం దక్కిన 1.10 లక్షల కోట్లే ఇప్పటివరకూ అత్యధికం కనుక ఇప్పుడు దానిని బాగా దాటినట్టే. 5జీ సాంకేతికతతో దేశం దానిని ఇప్పటికే అనుభవిస్తున్న అతికొద్ది దేశాల సరసన చేరింది. ఆగస్టు పదిహేనుతో ఆరంభించి హైదరాబాద్ సహా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో 5జీ సేవలు అందించనున్నట్టు జియో ప్రకటించింది. ఏడాది చివరికల్లా ఇప్పటి 4జీతో పోల్చితే పదిరెట్ల వేగంతో మొబైల్ ఇంటర్నెట్ మరిన్ని నగరాల్లోకి విస్తరించవచ్చు. 5జీ అనుకూల హ్యాండ్ సెంట్లను వినియోగించేవారి సంఖ్య ప్రస్తుతానికి తక్కువే కావచ్చును కానీ, వాటి వినియోగం కూడా ఇకపై వేగంగా పెరుగుతుందనడంలో సందేహం అక్కరలేదు. వేగవంతమైన, నాణ్యమైన 5జీ ప్రవేశంతో స్వర్ణోత్సవ భారతం అన్ని రంగాల్లోనూ మేలైన సేవలు అందించగలిగే ఉన్నత కక్ష్యలోకి ప్రవేశించినందుకు సంతోషించాలి.

Updated Date - 2022-08-05T10:18:18+05:30 IST