Abn logo
Sep 21 2021 @ 01:13AM

క్యూ కట్టిన నిరుద్యోగ యువత

మోడల్‌ స్కూల్‌ పోస్టులకు తొలిరోజే  215 దరఖాస్తులు

అనంతపురం విద్య, సెప్టెంబరు 20: నిరుద్యోగ యువతీయువకులు క్యూ కట్టారు. మోడల్‌ సూళ్లు, వాటికి అనుబంధంగా నడిచే హాస్టళ్లు, మోడల్‌ స్కూల్స్‌ విభాగంలో 56 పోస్టుల భర్తీకి ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. సోమవారం దరఖాస్తుల స్వీకరణ తొలిరోజు జిల్లా నలుమూలల నుంచి భారీగా యువతీయువకులు తరలివచ్చారు. మొత్తంగా 215 మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత డీఈఓ కార్యాలయంలోని మోడల్‌ స్కూల్స్‌ విభాగంలోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆఫీ్‌సలో ఇరుకైన గదులు ఉండటంతో క్యూలో గంటల తరబడి యువతీయువకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్త డీఈఓ కార్యాలయంలో విశాలమైన ప్రాంగణం ఉంది. అక్కడ దరఖాస్తుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తే... వందలాది మంది ఒకేసారి వచ్చినా ఇబ్బంది ఉండదు. గడువు దగ్గర పడేకొద్దీ... దరఖాస్తు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. దరఖాస్తులను ఆ విభాగ సూపరింటెండెంట్‌ పద్మావతి, చంద్రకాంత్‌ తీసుకుంటున్నారు. ఇద్దరే ఉండటంతో అభ్యర్థులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరింత మంది సిబ్బందిని నియమించడంతోపాటు దరఖాస్తు సమర్పించేందుకు వచ్చే వారికి తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.