‘‘ఎప్పటికీ మార్క్సిజం సర్వరోగనివారిణే’’

ABN , First Publish Date - 2020-06-15T05:41:41+05:30 IST

కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడం వల్లే, దళితవాదం, స్త్రీవాదం వంటివి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి.

‘‘ఎప్పటికీ మార్క్సిజం సర్వరోగనివారిణే’’

రంగనాయకమ్మ ఇంటర్వ్యూ

కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడం వల్లే, దళితవాదం, స్త్రీవాదం వంటివి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అప్పటిదాకా కమ్యూనిస్టులుగా, విప్లవకారులుగా తమని చెప్పుకున్న కొందరు, దళిత ఉద్యమకారులుగా, స్త్రీ వాదులుగా మారారు. ఆ వాదాలతో చెయ్యగలిగిందేమీ లేదు. కమ్యూనిజాన్ని ‘ఫ్యాషన్‌’గా భావించినవాళ్ళకి, ఆ ఫ్యాషన్‌ పాతపడినట్టే కనపడి, కొత్త ఫ్యాషన్లను వెతుక్కున్నారు. దళితవాదుల దృష్టి ఎంతసేపూ రాజ్యాంగయంత్రంలో (ప్రభుత్వంలో) చోటు సంపాదించడంమీదా, రిజర్వేషన్ల కొనసాగింపుమీదా, వుంటుంది. అంతేగానీ, ‘దోపిడీ వ్యతిరేక దృష్టి’ వుండదు. స్త్రీ వాదులు, బూర్జువా ఆస్తి సంబంధాలను గానీ; స్త్రీ-పురుషుల మధ్య వున్న అసమాన శ్రమ విభజనను గానీ పట్టించుకోరు. పురుషాధిక్యత (పేట్రియార్కీ) అని పదేపదే వల్లించినా, దానికి వున్న ‘మూలాల’ మీద, దృష్టిపెట్టరు.


ఏయే ప్రభావాలు, అనుభవాలతో ఈ రంగనాయకమ్మ తయారయ్యారు? 

ఏ రచయిత అయినా, తన చిన్నతనపు ప్రభావాల తోటే, అనుభవాల తోటే, ప్రారంభమవుతారని నా అభిప్రాయం. నా విషయంలో కూడా అలాగే జరిగినట్టు వుంది. కానీ, ఆనాటి భావాలూ, కొన్ని రాతల తర్వాత కలిగిన భావాలూ, పూర్తిగా ఒకటే కాదు. 20ఏళ్ళ జీవిత కాలం వరకూ, ‘నాస్తికత్వం’ అనే మాట నాకు తెలీదు. ఆ తర్వాతే, కందుకూరి వీరేశలింగంగారి ఆత్మకధలో తర్కాలు చూసినప్పటినించే ఆ ప్రశ్నలు ప్రారంభం అయ్యాయి- అనుకుంటాను. ఆ రచయిత భక్తుడే. నాలో, తర్కమేగానీ, భక్తి నిలబడలేదు. ఆ తర్వాత, ‘మార్క్సిజం’, నాస్తిక భావాల దగ్గిరే ఆగిపోని వ్వకుండా, వాటితో పాటు, సమాజంలో వున్న ‘శత్రువర్గభావాల్ని’ తెలుసుకునే దృష్టినిచ్చింది. ఈ ప్రభావాలే చెప్పగలను.


స్వేచ్ఛాజీవులైన మీరు మార్క్సిజం అనే  ఒక ‘గుంజకు కట్టేసుకోవడం’ వల్ల మీ స్వేచ్ఛా ఆలోచనా ప్రవాహానికి అవరోధం కావడం లేదా? 

మీరు, ఇలా అన్నారు: ‘మార్క్సిజం’ అనే ఒక గుంజకు కట్టుకోవడం వల్ల మీ స్వేచ్ఛా ఆలోచనా ప్రవాహానికి అవరోధం కావడం లేదా?- అని. ‘మార్క్సిజం’ అనే ఆ గుంజే ‘సత్యం’ అనుకోండీ! ‘సత్యం’ చుట్టూ తిరగడంవల్ల, తప్పు ఆలోచనలు పోయి, మంచి ఆలోచనలు ఏర్పడతాయి కదా? మీ దృష్టిలో, ‘మార్క్సిజం’ ‘సత్యం’ కాదనుకుందాం. మీరు ‘సత్యం’ అనుకున్న దాన్ని దేన్ని అయినా చెప్పండి! అప్పుడు, ఆ సత్యం చుట్టూ తిరగవలిసిందే కదా? ఒకవేళ మీరు, ‘ఏదో ఒకే సత్యం వ ుంటుందని నేననుకోను. వేరువేరు సత్యాలు వుంటాయి’ అంటారా? - అవి అన్నీ సత్యాలే అయితే, అటు వంటివి అన్నీ ఒకే సత్యంలో భాగాలే అవుతాయి కదా? లేకపోతే, అవి వేరు వేరు సత్యాలైతే, వాటి మధ్య ఒకదాన్ని ఒకటి తిరస్కరించే వైరుధ్యాలు వుంటాయి కదా? ఏదైనా నాలుగైదు సత్యాల్ని, చూపించండి. 2, 3 సత్యాల్ని అయినా నిర్ణయించుకుని మీరే ఆలోచించండి! ‘సత్యం’ అనేది, ఒకటే వుంటుందా; ఎన్ని రకాలుగా అయినా వుంటుందా? - ఇదీ అసలు చర్చించ వలిసిన విషయం. 


మీ విశ్వాసాలతో, నమ్మకాలతో మీరు వ్యక్తిగతంగా కోల్పోయిందేమిటి? బాధపడిందేమిటి? సమాజానికి జరిగిందేమిటి? 

నా విశ్వాసాల్లో, నమ్మకాల్లో, ప్రధానమైన విషయాలు: ‘ప్రకృతి’ విషయాల్లోగానీ, ‘సమాజపు’ విషయాల్లోగానీ, హేతుబద్ధ దృష్టే. ఒకరు, ‘నేను అలా వున్నా’నని చెప్పు కోవడం కాదు; ఇతరులు తెలుసుకోవాలి. నా విశ్వాసాలు, హేతుబద్ధ తర్కం వేపు మారితే, వ్యక్తిగతంగా పోయిందేం వుంటుంది? తల్లిదండ్రులనించీ, బంధువులనించీ, దేనినించీ పోయిందేమీ లేదు. తెలుసుకున్న మంచి గ్న్యానంవల్ల, బాధ ఎందుకు వుంటుంది; సంతోషమే వుంటుంది గానీ? సమాజానికి జరిగిందేమిటి అంటారా? నా భావాల మార్పు వల్ల, సమాజానికి ఏదో జరిగిపోయింది - అంటానా? ‘శత్రువర్గాల సమాజం’ మారిపోయే తర్కాన్ని చెప్పింది మార్క్సు, ఎంగెల్సులు. అయినా, దాని వల్ల ‘సమాజంలో మార్పు జరిగిపోయింది’ అంటానా? ‘జరుగుతుంది’ అనాలి. నా భావా లన్నీ ఆ మార్పు కోసమే. 


చాలామంది రచయితలు మధ్యలోనే అస్త్ర సన్యాసం చేశారు. మీరు మాత్రం ఇన్ని దశాబ్దాలుగా నిర్విరామంగా రాస్తూనే ఉన్నారు. కారణాలు?

కొందరు రచయితలు, మధ్యలో రాయడం మానేస్తే, దాన్ని ‘అస్త్ర సన్యాసం’గా భావించ కూడదు. ఎవరి సమస్యలు ఎలా వున్నాయో, తెలియని విషయం అది. నేను రాస్తూనే వుండడానికి కారణం, మొదట్లో అయితే, అది కొంత ఆసక్తే. నేను బైటి వుద్యోగంలో లేను. ఇంటి పనులు కూడా నా ఒక్కదాని మీదే ఆధారంగా వుండవు. ముఖ్యంగా, ‘మార్క్సిజం’ తెలిసిన తర్వాత, దాన్ని గురించి చెప్పకుండా, ముగించడం ఇప్పట్లో వుండదు. పాఠకులెందరో వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటారు నాకు. అవన్నీ సమాజంలో చర్చించ వలిసిన విషయాలే. వాళ్ళు చెప్పిందే చెప్పినట్టు, రచనగా ఏర్ప డదు. కానీ, వాళ్ళ సమస్య తెలిస్తే, అది ఒక రచనకి ఆధారం అవుతుంది. ఏ రచయిత అయినా, ఎంత కాలం అయినా, రాయగలరు. రాయడానికి, అన్ని విషయాలు వున్నాయి. ప్రచురించే పత్రికలు ముఖ్యం. లేదా, పుస్తకాల్ని ప్రింటు చేయడం ముఖ్యం. ఈ అవకాశాలు నాకు మొదటి నించీ వున్నాయి. కారణాలు నాకు తెలీదు. నా రాతలు ఆగిపోవసిలిన ఇబ్బంది ఇప్పటికీ రాలేదు. కాబట్టే రాస్తున్నాను. 


చలం చివరి రోజుల్లో రమణాశ్రమంలో చేరారు. కొ.కు. కమ్యూనిజం నుంచి కాషాయం వైపు మళ్ళారంటారు. వయసుతోపాటు రంగనాయకమ్మలో కూడా ఇలాంటి మార్పులేమైనా మొదలయ్యాయా? 

రంగనాయకమ్మ రాసిన పుస్తకాలు చదివినవాళ్ళూ, చదివి అర్థంచేసుకున్న వాళ్ళూ, అడిగే ప్రశ్న కాదు ఇది. నా రాతల్ని అర్థం చేసుకునివుంటే, ఈ సందేహం రాదు. అసలు ఒక వ్యక్తి, తనకు సరైన భావాలుగా అనిపించిన వాటినే భావిస్తే, అవి నిజంగా సరైనవే అయితే, ఆ వ్యక్తి, ఎప్పటికీ వెనక్కి తిరగడు. చలం అయితే, మొదటినించీ నాస్తికుడు కాడు. కొన్ని తర్కాలు చేసిన రచయిత, అంతే. కాబట్టి తర్వాత కూడా ఆయన తన నమ్మకాలనే స్తిరం చేసుకున్నారు. రమణ భక్తుడయ్యాక కూడా స్త్రీ-పురుషుల సమానత్వం గురించి ఆయన భావాలు మారలేదు. మీరు చెప్పిన రెండో రచయిత, ‘దెయ్యాలూ - దేవతలూ కూడా భౌతికవాదమే. అలా అర్థం చేసుకోవాలి’ అంటూనే, రెండో వేపు ‘కమ్యూనిజం’ అంటూ వుంటే, అతన్ని చలంతో సమానం చేసి పోల్చడం తప్పు! చలంలో, వైరుధ్యంలేదు. కానీ, ఆ రెండో రచయితలో వున్నదంతా వైరుధ్యమే. నా సంగతి అంటారా? మీరే నిర్ణయించుకోండి! నన్నడక్కూడదు. 


మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు, రచయితలు? 

కందుకూరీ, గురజాడా, శ్రీపాదా, చలమూ, - వీరే నాకు ప్రధానం. మూర్ఖత్వపు విషయాల మీద తర్కాలు వుండా లనేది, వారినించీ నేర్చినది. ‘సమా నత్వం’ విషయాలు కూడా కొన్ని. అది ఎలా సాధ్యమో వారు స్పష్టంగా చెప్పిన విషయాలు లేవనుకోండీ. 


భావి తరాలకు మీరు ఎలా గుర్తుండాలనుకుంటున్నారు? 

‘నన్ను గుర్తు పెట్టుకోవాలని’ అనుకుంటే, గుర్తుపెట్టుకుంటారా? వాళ్ళకి నచ్చితే గుర్తు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అయినా, ఒక మనిషిని స్నేహితులు గుర్తు పెట్టుకున్నా, ఎన్నాళ్ళు పెట్టుకుంటారు? వాళ్ళు బ్రతికి వున్నన్నాళ్ళే కదా? వాళ్ళేపోతే, ఇంకెలా గుర్తు పెట్టుకుంటారు? అయినా, గుర్తుపెట్టుకోవలిసింది, ‘భావాల్ని!’ ఆ భావాల్ని ఇచ్చిన మనిషి లేకపోయినా, ఆ భావాల్ని గుర్తుపెట్టుకుంటే, ఆ మనిషిని గుర్తుపెట్టుకున్నట్టే. ‘శత్రు వర్గసమాజం’లో, మంచి భావాలు ఇచ్చినవాళ్ళని, కొందరు, ఆ భావాల మీద ప్రేమతో గుర్తు పెట్టుకుంటే, కొందరు, ఆ భావాల మీద  ద్వేషంతో గుర్తు పెట్టుకోవచ్చు. 


ఇప్పటికీ మీరు మార్క్సిజమే ‘సర్వరోగనివారిణి’గా భావిస్తున్నట్లున్నారు? 

‘సర్వరోగనివారిణి’ అంటే, ప్రకృతిలో, అన్ని రోగాలనూ నివారించే ఒకే ‘మందు’ వుండదు. కానీ, ‘సమాజం’లో వున్న సమస్యలకైతే ‘సర్వరోగనివారిణి’ అయిన సిద్ధాంతం వుంది. అదే మరి, మార్క్సిజం! ఇది ఏమిటో తెలిస్తేనే, దాన్ని ‘సర్వరోగ నివారిణి’ అనగలం. ఇప్పటికే కాదు, ఎప్పటికీ మార్క్సిజం సర్వరోగనివారిణే. ఎందు కంటే, సామాజిక రోగాలు తిరగబెట్టకుండా నివారించే సిద్ధాంతం అది! 


నాటి భావ కవిత్వం, అరసం - విరసం ఉద్యమాలూ, దళితవాదం, స్త్రీ వాదం, వగైరాలన్నీ, ఆయా కాలాల ప్రజల ఆకాంక్షల, సామాజిక పరిస్తితుల ప్రతిరూపాలనుకోవచ్చా? ఈ బ్రాండెడ్‌ సాహిత్యంతో కలిగిన ప్రయోజనాలు? 

ఏ నాటి ఉద్యమాల్ని అయినా, ఆనాటి సమాజంలో జరగవలిసిన మార్పులు జరగాలనే లక్ష్యంకోసం సాగేవిగానే భావించవచ్చు. అయితే, ఆ ఉద్యమ కారులకు, ఆ మార్పుల కోసం హేతుబద్ధమైన అవగాహన వుందో లేదో, అది ముఖ్యం. మీ ప్రశ్నకు కొంత పొడుగు జవాబు అవసరం కావచ్చు. 


‘భావకవిత్వం’ అనేది, పాత సాంప్రదాయ కవిత్వంనించీ భిన్నంగా, కొత్త కాలానికి తగ్గట్టు, రూపంలోనూ, విషయంలోనూ, మార్పు ఏదో వచ్చినట్టుగా నాకు కనిపిస్తుంది. దేవుళ్ళనీ, మహిమల్నీ వదిలి, ప్రేమా, విరహం, శృంగారం, దేశభక్తీ, సంఘ సంస్క రణా, ప్రకృతివర్ణనా, మొదలైనవాటిని కవి, తన భావాలతో వ్యక్తం చేసినట్టు. బ్రిటీషు పెట్టుబడిదారీ పాలన ప్రభావంతో వచ్చింది కావచ్చు, భావకవిత్వం. భావకవులు ఎక్కువగా తమ సొంత గొడవలే రాసుకున్నారన్నట్టు, ఆ కవిత్వాన్ని ‘ఆత్మాశ్రయ కవిత్వం’ అని కొందరు అంటారు. కొన్నిసార్లు, ఆ కవిత్వాల్ని అర్థమయ్యేవి కావంటారు. అందుకే ‘పెళ్ళిచేసిచూడు’ సినిమాలో, ఒకపాటలో, ‘‘భావకవులవలె, ఎవరికి తెలియని ఏవో పాటలుపాడాలోయ్‌’’ అని చక్కని పాట వుంటుంది.  


‘అరసం’ అంటారా? రష్యాకి, సోషలిస్టు దేశంగా పేరున్న కాలంలో, సోషలిజం, కార్మికులూ, కర్షకులూ, కష్టజీవులూ- అంటూ అప్పటికిలేని కొన్ని అభ్యుదయభావాల్ని ప్రచారంచెయ్యడానికి ఏర్పడ్డ సంఘం, అభ్యుదయ రచయితల సంఘం. ఇది, అప్పు డున్న కమ్యూనిస్టు పార్టీ మార్గదర్శకత్వంలో నడిచిన సంస్త. ఆ రోజుల్లో చాలా మంచి భావాల పుస్తకాలు వచ్చాయి. సోషలిజం, కమ్యూనిజం అనే కొత్త ఆలోచనలు జనాలకు ఎంతో కొంత పరిచయం అయ్యాయి, అవి తగినంతగా కాకపోయినా. రష్యా బలహీన పడి, ఇక్కడి ఉద్యమాలూ బలహీనపడ్డాయి. చైనా సాంస్కృతిక విప్లవం ప్రభావంతో, ‘నూతన ప్రజాతంత్ర విప్లవం’ అనీ; ‘దీర్ఘ కాలిక సాయుధ పోరాటం’ అనీ - కొత్త నినాదాలు ప్రచారంలోకి వచ్చాక, ‘విరసం’ ఏర్పడిందనుకోవచ్చు. దోపిడీ, అసమా నత్వం లాంటి సమస్యలు, ఎప్పటికంటే తీవ్రంగావున్న దశలో, నక్సల్బరీ ఉద్యమం వల్ల, ఒక రకమైన ‘‘విప్లవ’’ భావాలు బాగా ప్రచారం అయ్యాయి.


వాటిని ‘విరసం’, ఎటు వంటి విమర్శా లేకుండానే; మార్క్స్‌ - ఎంగెల్సుల రచనలతో సంబంధం లేకుండానే; యాంత్రికంగా అనుకరించినట్టే అనిపిస్తుంది. చెరబండరాజు రాసిన ‘పోలీసుపాటా’, వంగపండుప్రసాదరావు రాసిన ‘ఎర్రజండా’ పాటేగాక అనేక పాటలూ, గద్దర్‌ రాసిన కొన్ని పాటలూ, మరికొందరు రాసిన కొన్ని పాటలూ- చాలా శక్తివంతంగా వుంటాయి. 


కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడడం వల్లే, దళితవాదం, స్త్రీవాదం వంటివి తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అప్పటిదాకా కమ్యూనిస్టులుగా, విప్లవకారులుగా తమని చెప్పుకున్న కొందరు, దళిత ఉద్యమకారులుగా, స్త్రీ వాదులుగా మారారు. ఆ వాదాలతో చెయ్యగలిగిందేమీ లేదు. కమ్యూనిజాన్ని ‘ఫ్యాషన్‌’గా భావించినవాళ్ళకి, ఆ ఫ్యాషన్‌ పాతపడినట్టే కనపడి, కొత్త ఫ్యాషన్లను వెతుక్కున్నారు. దళితవాదుల దృష్టి ఎంత సేపూ రాజ్యాంగయంత్రంలో (ప్రభుత్వంలో) చోటు సంపాదించడంమీదా, రిజర్వేషన్ల కొనసాగింపుమీదా, వుంటుంది. అంతేగానీ, ‘దోపిడీ వ్యతిరేక దృష్టి’ వుండదు. స్త్రీ వాదులు, బూర్జువా ఆస్తి సంబంధాలనుగానీ; స్త్రీ-పురుషుల మధ్యవున్న అసమాన శ్రమ విభజననుగానీ పట్టించుకోరు. పురుషాధిక్యత (పేట్రియార్కీ) అని పదేపదే వల్లించినా, దానికివున్న ‘మూలాల’ మీద, దృష్టిపెట్టరు. లైంగికత, బహిష్టు, గర్భధారణా, లైంగిక స్వేచ్ఛా వంటి వాటి గురించి కవిత్వాలు రాసి, అన్నిటినీ ధిక్కరించినట్టూ, ఎటువంటి దాపరికమూ, సంకోచమూ లేనట్టూ, ప్రకటించడం చేశారు, చేస్తారు. కానీ, ఇంటాబైటా వున్న అసమాన శ్రమవిభజన మాటే ఎత్తరు. అమలులో వున్న రాజ్యాంగాన్ని ‘దోపిడీ రాజ్యాంగం’గా గుర్తించరు.


అందుకే దళితవాదానికీ, స్త్రీ వాదానికీ, యూనివర్శిటీలలో ‘గౌరవనీయ’ స్తానాలు దొరుకుతాయి. ‘దళిత్‌ స్టడీస్‌’ అనీ, ‘విమెన్‌ స్టడీస్‌’ అనీ, అలా కొన్ని అధ్యయన కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి. - మీప్రశ్నలో అంశాల కోసం, ఈ విషయాలు కొన్ని అయినా ప్రస్తావించక తప్పదు కదా? 

ఇంటర్వ్యూ: గోవిందరాజు చక్రధర్‌



Updated Date - 2020-06-15T05:41:41+05:30 IST