అందరికీ వైద్యం

ABN , First Publish Date - 2021-04-21T05:59:45+05:30 IST

అందరికీ వైద్యం

అందరికీ వైద్యం

ఎలిజిబులిటీ ఉన్న వారికే బెడ్‌

చివరి దశలో వస్తున్న కేసులతోనే మరణాల పెరుగుదల 

సీరియస్‌నెస్‌ తక్కువ ఉన్నవారికి హోం ఐసోలేషన్‌ సిఫారసు

ఆంధ్రజ్యోతితో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివశంకరరావు 

‘కరోనా బారినపడి చికిత్స కోసం వస్తున్న వారికి సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం బాధితుల తాకిడి ఎక్కువగా ఉన్నందున ఎలిజిబులిటీ ఉన్నవారికే బెడ్‌ కేటాయిస్తున్నాం.’ అని కొత్త ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.శివశంకరరావు తెలిపారు. ఆసుపత్రిలో బెడ్స్‌ కొరత, టెస్టుల నిర్వహణలో జాప్యం, సరిపడా సిబ్బంది లేక ఇబ్బందులు.. తదితర అంశాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. - విజయవాడ, ఆంధ్రజ్యోతి 


బెడ్స్‌ కొరత లేదు 

ప్రభుత్వాసుపత్రిలో బెడ్స్‌ లేవనే ప్రచారం సరికాదు. కొవిడ్‌ బాధితులు ఒక్కసారిగా పెరిగారు. నాన్‌ కొవిడ్‌ పేషెంట్లను డిశ్చార్జి చేస్తూ.. కొవిడ్‌ బాధితులకు బెడ్స్‌ పెంచుతున్నాం. సోమవారం నాటికి 457 మందికి వైద్యసేవలందిస్తున్నాం. అంటే నెల రోజుల్లో కొవిడ్‌ బాధితులకు కేటాయించిన మంచాలను 150 నుంచి 500కు పెంచామన్నమాట. మరో 50 నుంచి 60 బెడ్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. 

ఆ రెండు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే..

గతంలో మాదిరిగా గన్నవరంలోని పిన్నమనేని సిద్ధార్థ, ఇబ్రహీంపట్నంలోని నిమ్రా హాస్పిటల్‌లో కూడా సేవలు ప్రారంభించే అవకాశం ఉంది. ఆ రెండు ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే ప్రభుత్వాసుపత్రిపై కొంతవరకు ఒత్తిడి తగ్గుతుంది. అయినా ప్రస్తుతం అందుబాటులో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌, నాల్గో తరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందితోనే మెరుగైన వైద్యసేవలందించేందుకు కృషి చేస్తున్నాం. కరోనా రోగులకు వైద్యసేవలందించే డాక్టర్లు, నర్సులు, హెల్త్‌కేర్‌ వర్కర్లు కూడా కొవిడ్‌ బారినపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నాం. కానీ, ఆశించినంతగా స్పెషలిస్టు డాక్టర్లు ముందుకు రావట్లేదు.

వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కొరత లేదు 

ఆసుపత్రిలో వెంటిలేటర్‌ బెడ్స్‌ 200కు పైగా ఉన్నాయి. వీటిలో దాదాపు 80 బెడ్స్‌ ఇప్పటికే కేటాయించాం. ఆక్సిజన్‌ పెట్టడానికి వీలుగా మరో 100 బెడ్స్‌ రెడీగా ఉన్నాయి. ఆక్సిజన్‌ లేని బెడ్స్‌ ఇంకా చాలా ఉన్నాయి. వాటికి కూడా ఆక్సిజన్‌ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఆసుపత్రిలోని మూడు బ్లాకుల్లోనూ కొవిడ్‌ బాధితులే చికిత్స పొందుతున్నారు. కొత్తగా వస్తున్నవారికి సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో బెడ్స్‌ ఏర్పాటుచేసి చికిత్స అందిస్తున్నాం. సూపర్‌ స్పెషాలిటీ బ్లాకులో కూడా ఇప్పటికే ఒక ఫ్లోర్‌ కొవిడ్‌ పేషెంట్లతో నిండిపోగా, రెండో ఫ్లోర్‌లో కొన్ని బెడ్స్‌ ఖాళీలున్నాయి. అడ్మిషన్‌కు ఎలిజిబులిటీ ఉన్న వారందరినీ ఆసుపత్రిలో చేర్చుకుంటున్నాం. మిగతావారికి మందులు ఇచ్చి పంపిస్తున్నాం. హోం ఐసోలేషన్‌లో ఉండమని చెబుతున్నాం. పక్కనే ఉన్న ప్రభుత్వ డెంటల్‌ ఆసుపత్రిలో ట్రై ఏజ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడికి వెళ్లిన వారిని వైద్యులు పరీక్షించి సీరియస్‌ కేసులను ఆసుపత్రికి, మోడరేట్‌ కేసులను హోం ఐసోలేషన్‌కు సిఫార్సు చేస్తారు. 

మరణాల పెరుగుదలకు కారణం

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లను చివరి దశకు చేరుకోగానే, ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నారు. అలా.. చివరి దశలో వచ్చిన బాధితుల్లో ఎక్కువ మంది ఇక్కడే చనిపోతున్నారు. 

Updated Date - 2021-04-21T05:59:45+05:30 IST