వదలని చీ‘కట్‌’లు

ABN , First Publish Date - 2021-10-19T05:06:43+05:30 IST

అప్రకటిత విద్యుత్‌ కోతలతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలు లేవంటూనే ప్రభుత్వ పెద్దలు వాతలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ కొనుగోలుకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో విద్యుత్‌ కొరత నెలకొందని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు కొందరు పేర్కొంటున్నారు. కానీ పాలకులు మాత్రం తప్పును కప్పి పుచ్చుకునేందుకు విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేవని చెబుతున్నారు.

వదలని చీ‘కట్‌’లు
శ్రీకాకుళంలోని ఏపీఈపీడీసీఎల్‌ కార్యాలయం

- జిల్లాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

- అకాల వర్షాలే కారణమంటూ సాకులు

- ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

అప్రకటిత విద్యుత్‌ కోతలతో జిల్లావాసులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ కోతలు లేవంటూనే ప్రభుత్వ పెద్దలు వాతలు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌ కొనుగోలుకు నిధుల కేటాయింపులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో విద్యుత్‌ కొరత నెలకొందని ఏపీఈపీడీసీఎల్‌ అధికారులు కొందరు పేర్కొంటున్నారు. కానీ పాలకులు మాత్రం తప్పును కప్పి పుచ్చుకునేందుకు విద్యుత్‌ సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేవని చెబుతున్నారు. జిల్లాలో విద్యుత్‌ కోతలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పట్టణాల్లో శివారు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గృహావసరాలతో పాటు పరిశ్రమలకు కూడా సక్రమంగా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. లోడ్‌ రిలీఫ్‌, జంగిల్‌ క్లియరెన్స్‌, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణ, అకాల వర్షాల నెపంతో కొన్నిచోట్ల గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. దీంతో వినియోగదారులు నానా పాట్లు పడుతున్నారు.  జిల్లాలో సుమారు 7.60 లక్షల మంది గృహ వినియోగదారులు ఉన్నారు. 75వేల  వాణిజ్య కనెక్షన్లతో పాటు చిన్న, పెద్ద తరహా పరిశ్రమలకు సంబంధించి సుమారు 3వేల కనెక్షన్లు ఉన్నాయి. జిల్లాలో అధికారుల లెక్కల ప్రకారం రోజుకు సగటున 150 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం అవసరం. ఇటీవల అంచనాలకు మించి విద్యుత్‌ వినియోగిస్తుండడంతో కొరత పెరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా చాలా మంది ఉద్యోగులు దేశ విదేశాల నుంచి స్వగ్రామాలకు వచ్చేశారు. ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు ఎక్కువగా ఉండడంతో శ్రీకాకుళం, టెక్కలి, రాజాం, పలాస, ఇచ్ఛాపురం తదితర నగరాలకు చేరుకుని ఆన్‌లైన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని విద్యాసంస్థలు కూడా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. అదే సమయంలో కోతలు మొదలయ్యాయి. సాధారణంగా వేసవి కాలంలో విద్యుత్‌ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏపీఈపీడీసీఎల్‌ రోజుకు సుమారు 2 గంటల పాటు కోతలు విధించేది. కానీ,  ఇటీవల  సమయపాలన లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోందని వినియోగదారులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయాలని కోరుతున్నారు.


హామీ మరిచారు...

విద్యుత్‌ కోతలు ఉండవని, బిల్లులు పెంచేది లేదని వైసీపీ నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ  హామీ మరిచారు. అప్రకటిత విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం ముందుగా ప్రకటించి కోతలు విధించినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటాం.

- టి.కామేశ్వరరావు యాదవ్‌, కాశీబుగ్గ


 ఎప్పుడు ఉంటుందో తెలీదు...

రాత్రి, పగలు తేడా లేకుండా విద్యుత్‌ సరఫరా నిలిపేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. విద్యుత్‌ లేక రాత్రిపూట చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు.

- పి.అనురాధ, గృహిణి, టెక్కలి


 నిద్ర ఉండదు...

విద్యుత్‌ కోతల కారణంగా రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. కొండ ప్రాంత గ్రామాలకు జంతువులు వస్తాయనే భయం తప్పడంలేదు. కరెంటు ఉంటేనే ఆ రాత్రి నిద్ర పడుతుంది.

- ఎస్‌.మల్లేష్‌, సవర చీపురుపల్లి, మెళియాపుట్టి మండలం

Updated Date - 2021-10-19T05:06:43+05:30 IST