పనులను అడ్డుకుంటున్న రైతులు

ABN , First Publish Date - 2022-06-30T05:00:00+05:30 IST

అధికారుల అనాలోచిత నిర్ణయం, అవగాహన కల్పించకపోవడం వెరసి..రెండు మండలాల మధ్య జల వివాదం చోటుచేసుకుంది. ఆండ్ర జలాశయం కుడి కాలువకు గండి కొట్టి గజపతినగరం, బొండపల్లి మండలాలకు సాగునీరందించాలన్న ప్రయత్నాన్ని బుధవారం మెం

పనులను అడ్డుకుంటున్న రైతులు

అధికారులతో రైతుల వాగ్వాదం

మెంటాడ, జూన్‌ 29: అధికారుల అనాలోచిత నిర్ణయం, అవగాహన కల్పించకపోవడం వెరసి..రెండు మండలాల మధ్య జల వివాదం చోటుచేసుకుంది. ఆండ్ర జలాశయం కుడి కాలువకు గండి కొట్టి గజపతినగరం, బొండపల్లి మండలాలకు సాగునీరందించాలన్న ప్రయత్నాన్ని బుధవారం మెంటాడ మండల రైతులు అడ్డుకున్నారు. దీంతో ఉది్త్రక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. మెంటాడ మండలం పిట్టాడ పంచాయతీ పరిధిలో కిర్లవాని చెరువు ఉంది. దానికి కింద భాగాన కొత్త చెరువు ఉంది. ఈ రెండు చెరువుల కిందట దాదాపు 3,500 ఎకరాల ఆయకట్టు భూములున్నాయి. రిజర్వాయర్‌ కుడి కాలువ నీరు ముందుగా కిర్లవాని చెరువులోకి చేరుతుంది. అక్కడ నుంచి కొత్తచెరువు చేరుతుంది. అక్కడ నుంచి ఎంఎన్‌ చానల్‌ ద్వారా గజపతినగరం,బొండపల్లి మండలాల ఆయకట్టుకు నీరందుతుంది. దశాబ్దాలుగా ఇదే విధానం అమలవుతోంది. అయితే శివారు ఆయకట్టుగా ఉన్న గజపతినగరం, బొండపల్లి మండలాల ఆయకట్టుకు సాగునీరందడంలో ఆలస్యమవుతోంది. దీంతో సమస్యను అక్కడి రైతులు ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, ఎస్‌ఈ బొత్స శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు రిజర్వాయర్‌ ప్రధాన కుడి కాలువకు గండికొట్టి ఎంఎన్‌ చానల్‌కు నేరుగా నీరు వేళ్లే విధంగా కాలువ నిర్మాణం చేపడుతున్నారు. దీనిపై మెంటాడ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగునీరు అందక భూములు బీడుగా మారుతున్నాయని.. నేరుగా నీటిని తీసుకొని పోతే మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  మక్కువ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, రాజప్పలనాయుడు, సర్పంచ్‌ పైడిపినాయుడు అనుచరులు, రైతులు బుధవారం పనులను అడ్డుకున్నారు. డీఈ పాండుతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు చేయవద్దని తేల్చిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో అధికారులు పనులు నిలిపివేశారు. రూ.20 వేల వ్యయంతో రెండు చెరువుల మధ్య మదుము వెడల్పు చేస్తే సరిపోతుందని మెంటాడ మండల రైతులు చెబుతున్నారు. దీనికి రూ.4 లక్షలు ఖర్చు చేస్తుండడాన్ని ఆక్షేపిస్తున్నారు. దీనిపై డీఈఈ పాండు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. శివారు ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యంతోనే పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతిపాదనలు గురించి అడుగగా ఆయన తనకు తెలియదంటూ బదులిచ్చారు. 



Updated Date - 2022-06-30T05:00:00+05:30 IST