Abn logo
Jun 18 2021 @ 03:57AM

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

సాధారణంగా ‘యోగం’ అంటే ప్రాణాయామం లాంటి శారీరక వ్యాయామం అని చాలా మంది భావిస్తారు. అవన్నీ మన శరీరానికి శక్తిని ఇస్తాయి. కానీ ఆత్మిక బలాన్నీ, మనో బలాన్నీ ఇవ్వలేవు. మరి సూక్ష్మమైన ఆత్మకు శక్తి ఎవరి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి లభిస్తుంది? ‘వియోగం’ అంటే విడిపోవడం, ‘యోగం’ అంటే కలయిక. మరి ఎవరితో కలిస్తే మన ఆంతరిక శక్తులు సంపూర్ణం అవుతాయి? 


సర్వ ఆత్మలకూ తండ్రి... నిరాకార బిందు స్వరూపుడైన పరమపిత పరమాత్మ. అందరికీ శక్తిని ప్రసాదించేది ఆయనే! ఆయన అందించే యోగమే అత్యున్నతమైన రాజయోగం. ఈ రోజుల్లో ఎన్నో రకాల యోగాభ్యాసాలు, ధ్యానాభ్యాసాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రాణాయామం, ఏకాగ్రతను నిలపడం, హఠయోగం లాంటివి వివిధ పద్ధతులను అనుసరించేవారు ఎందరో ఉన్నారు. అయితే యదార్థమైన యోగం ఏదనేది తెలుసుకొనే ప్రయత్నం చేసేవారు ఎంతో తక్కువమంది. 


‘‘‘యోగం’ అంటే మనసును, బుద్ధిని ఏకాగ్రం చేసి, ఒకే మధురమైన పరమాత్మ స్మృతిలో ఉండటమే. దీనిద్వారా మనశ్శాంతి, శుద్ధమైన బుద్ధి ప్రాప్తిస్తుంది. ఆ హృదయాభిరాముడే స్వయంగా మన హృదయాలలో తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రపంచం అంతటా దుఖం అశాంతి అలముకున్న ఈ సమయంలో యోగాభ్యాసంతో సత్యమైన మనశ్శాంతిని మనం పొందగలగడం చాలా అద్భుతమైన విషయం. మనమందరం ఒకే సంఘటనలో... పరమాత్ముని స్మృతిలో ఉన్నట్టయితే, ప్రపంచంలోని దుఖం, అశాంతి మటుమాయమవుతాయి. ‘యోగం’ అనే శబ్దాన్ని పలుకుతున్నప్పుడే అందరి ముఖాలలో సుఖ, శాంతి, ప్రేమ, శక్తి, సంతోషాల వెల్లువ స్పష్టంగా కనిపిస్తుంది. నేటి తమో ప్రధానమైన వాతావరణంలో- అనంతుడైన తండ్రితో... ఆ పరమాత్మునితో మనసు అనుసంధానమై నిశ్చింతను పొందడమే ‘యోగం’ ప్రధానోద్దేశ్యం. ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్న ఈ కాలంలో యోగం ప్రాముఖ్యతను ప్రపంచం గుర్తించడం చాలా శుభ పరిణామం’’ అంటారు బ్రహ్మకుమారీస్‌ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ముఖ్య సంచాలిక దాదీ రతన్‌ మోహిని. 


స్వయంగా పరమపిత పరమాత్మ సర్వ మానవ కోటికి అందించినదే రాజయోగం. ఈ యోగంతో దివ్య గుణాలు, శక్తులతో ఆత్మ సంపన్నవంతమవుతుంది. రాజయోగం సర్వ శ్రేష్ఠమైన ధ్యానాభ్యాసం. ఈ అభ్యాసానికి ఏ విధమైన శారీరక ముద్రలతో పని లేదు. ఆత్మను, పరమాత్మను కలిపే అత్యంత శ్రేష్టమైన విధి... రాజయోగం. ఈ అభ్యాసం ద్వారా మనసులో సకారాత్మకమైన పరివర్తన కలుగుతుంది. దివ్యగుణాలు, దివ్యమైన కళలు, విశేషాలతో ఆత్మ వికసిస్తుంది. అంతరాత్మలో నిద్రించి ఉన్న శక్తులు జాగృతం అవుతాయి. చేసే కర్మలలో కుశలత, వ్యవహారంలో సౌమ్యత, విశ్వ బంధుత్వ భావన పెరుగుతాయి. 


‘యోగః కర్మసు కౌశలం’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంటే యోగం ద్వారా మనం చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యం పెరుగుతుంది. భారతదేశం అనాది నుంచీ ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. సర్వ ప్రపంచానవకీ ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తోంది. మన దేశం నేర్పే ప్రాచీన రాజ యోగం విశ్వవ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తోంది. మానవులు శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండాలి... అదే సంపూర్ణ ఆరోగ్యం. దీనికి యోగా దోహదం చేస్తుంది. జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించడం ద్వారా... యోగ వైశిష్ట్యం ప్రపంచానికి మరింతగా వెల్లడవుతోంది.

బ్రహ్మ కుమారీస్‌

9391304556