కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు

ABN , First Publish Date - 2021-10-21T06:20:34+05:30 IST

కాఫీ రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు లభించేలా ‘ది విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(మ్యాక్స్‌)’ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ చెప్పారు.

కాఫీ గింజలకు అంతర్జాతీయ ధరలు
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీ పీవో గోపాలక్రిష్ణ

పాడేరులో కాఫీ గ్రేడింగ్‌ సెంటర్‌

పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రోణంకి గోపాలకృష్ణ


చింతపల్లి,అక్టోబరు 20: కాఫీ రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ ధరలు లభించేలా ‘ది విశాఖ ఏజెన్సీ గిరిజన కాఫీ రైతుల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం(మ్యాక్స్‌)’ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ చెప్పారు. బుధవారం ఇక్కడ జరిగిన సంఘం తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో గత ఏడాది సేకరించిన కాఫీ పండ్లకు కిలోకు రూ.4 చొప్పున బోనస్‌ అందజేస్తామన్నారు. ఈ ఏడాది కాఫీ పండ్లను కిలో రూ.32లకు కొనుగోలు చేస్తారని, సొమ్ము మొత్తం ఒకేసారి చెల్లిస్తారని ఆయన చెప్పారు. కాఫీ పండ్ల సేకరణకు ఉద్యాన, వ్యవసాయ శాఖల ఉద్యోగులు, గ్రామ వలంటీర్ల సహకారం అందిస్తారన్నారు. ఏజెన్సీలో పండించే కాఫీ గింజలను అంతర్జాతీయ వర్తకులు కొనుగోలుచేసేందుకు అనువుగా పాడేరులో గ్రేడింగ్‌ సెంటర్‌ని ఏర్పాటు చేస్తామని పీవో చెప్పారు. చింతపల్లిలో గోదాము నిర్మాణానికి రూ.కోటి, ఇక్కడ పల్పింగ్‌ కేంద్రం ఆధునికీకరణకు రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. కార్యక్రమంలో మ్యాక్స్‌ అధ్యక్షుడు సెగ్గె కొండలరావు, ఉపాధ్యక్షుడు గాం సింహాచలం, కాఫీ సహాయ సంచాలకులు బి.భాస్కరరావు పాల్గొన్నారు. 


మేలిరకం చోడి విత్తనాలను పంపిణీ చేయాలి

గిరిజన ప్రాంతానికి అనువైన మేలిరకం చోడి విత్తనాలను పంపిణీ చేయాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. బుధవారం ఆర్‌ఏఆర్‌ఎస్‌ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంత నేలలు, వాతావరణానికి అనువైన పంటలు, నూతన వంగడాల వివరాలతో ఒక ప్రణాళికను  తయారు చేసి ఐటీడీఏకు అందజేయాలన్నారు. సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న పూలమొక్కలు, వరి, చోడి పంటలను ఆయన పరిశీలించారు.  కార్యక్రమంలో ఏడీఆర్‌ డాక్టర్‌ గుత్తా రామారావు, సీనియర్‌ శాస్త్రవేత్తలు దేశగిరి శేఖర్‌, మోహన్‌రావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-21T06:20:34+05:30 IST