ఐసీసీతో బంధానికి తెర

ABN , First Publish Date - 2020-07-02T09:18:55+05:30 IST

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో శశాంక్‌ మనోహర్‌ బంధానికి తెరపడింది. ఐసీసీకి తొలి స్వతంత్ర చైర్మన్‌గా వ్యవహరించిన...

ఐసీసీతో బంధానికి తెర

ముగిసిన మనోహర్‌ పదవీకాలం

తాత్కాలిక చైర్మన్‌గా ఖవాజ


దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)తో శశాంక్‌ మనోహర్‌ బంధానికి తెరపడింది. ఐసీసీకి తొలి స్వతంత్ర చైర్మన్‌గా వ్యవహరించిన 62 ఏళ్ల మనోహర్‌ పదవీకాలం ముగిసింది. ఆయన పదవి నుంచి బుధవారం తప్పుకొన్నాడు. నాగపూర్‌కు చెందిన న్యాయవాది మనోహర్‌ 2015 నవంబరులో ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అంతకుముందు..ఆయన రెండుసార్లు భారత క్రికెట్‌ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షునిగా పని చేశాడు. మొదటిసారిగా 2008 నుంచి 2011 వరకు.. ఆ తర్వాత 2015 అక్టోబరు నుంచి 2016 మే దాకా రెండోసారి బీసీసీఐ పదవిలో కొనసాగాడు. శశాంక్‌ వైదొలగడంతో ఐసీసీ డిప్యూటీ చైర్మన్‌, హాంకాంగ్‌కు చెందిన ఇమ్రాన్‌ ఖవాజ తాత్కాలిక చైర్మన్‌గా నియమితుడయ్యాడు. ‘ఐసీసీ చైర్మన్‌గా శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం ముగిసింది. ఈరోజు బోర్డు సభ్యులంతా భేటీ అయ్యారు. డిప్యూటీ చైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్త చైర్మన్‌ ఎన్నిక విధానం కోసం వచ్చేవారం ఐసీసీ సమావేశం కానుంది.  


కొత్త చైర్మన్‌ రేసులో గ్రేవ్స్‌, దాదా!

ఐసీసీ నూతన చైర్మన్‌గా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ చైర్మన్‌ కొలిన్‌ గ్రేవ్స్‌, బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. కాగా.. వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్‌ కామెరూన్‌, న్యూజిలాండ్‌ నుంచి గ్రెగర్‌ బార్‌క్లే, దక్షిణాఫ్రికా తరఫున క్రిస్‌ నెన్‌జాని కూడా చైర్మన్‌ పదవిపై ఆసక్తిగా ఉన్నారు. ఇక.. ఐసీసీ నిబంధనల ప్రకారం గరిష్ఠంగా మూడోసారి ఓ వ్యక్తి చైర్మన్‌ పదవి చేపట్టవచ్చు. దీంతో ఇప్పటికే రెండు పర్యాయాలు పూర్తి చేసుకోవడంతో మరోసారి ఆ పదవికి పోటీపడేందుకు శశాంక్‌ మనోహర్‌కు కూడా అవకాశముంది. కానీ.. మరోసారి పదవి స్వీకరించేందుకు అతను ఆసక్తి చూపుతాడా లేదా అన్నది చూడాలి. 


బీసీసీఐ పరిస్థితేంటి..?

మనోహర్‌తో కొన్ని విభేదాలున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అతని నిష్క్రమణ బీసీసీఐకి ఓ రకంగా ప్రతికూల పరిణామమే. ఎందుకంటే.. ఐసీసీ ఆదాయంలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న బీసీసీఐ ప్రాతినిథ్యం ఇకనుంచి అక్కడ ఉండ దు. షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌ జరగకపోతే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.  పైగా.. ఐసీసీతో బీసీసీఐకి రెండు మేజర్‌ టోర్నీల (భారత్‌ ఆతిథ్యమిచ్చే 2021 టీ20 వరల్డ్‌ కప్‌, 2023 వన్డే వరల్డ్‌ కప్‌)కు సంబంధించి పన్ను మినహాయింపు వివాదం నడుస్తోంది. ఈ సమస్యలన్నీ తొలగి ఐసీసీలో మళ్లీ బీసీసీఐ చక్రం తిప్పాలంటే గంగూలీలాంటి వ్యక్తి ఆ పెద్ద పోస్టులోకి రావాలని భారత క్రికెట్‌ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2020-07-02T09:18:55+05:30 IST