అంతర్జాతీయ విమాన ప్రయాణాలు డిసెంబరు చివరికి సాధారణ స్థాయికి

ABN , First Publish Date - 2021-11-25T08:31:04+05:30 IST

అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాలు డిసెంబరు ఆఖరు నాటికి సాధారణ స్థితికి వస్తాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ విమాన ప్రయాణాలు డిసెంబరు చివరికి సాధారణ స్థాయికి

  • వచ్చే నెలలో ఏఐలో పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి
  • పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ వెల్లడి


న్యూఢిల్లీ, నవంబరు 24: అంతర్జాతీయ విమానయాన కార్యకలాపాలు డిసెంబరు ఆఖరు నాటికి సాధారణ స్థితికి వస్తాయని పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిరిండియాలో ప్రభుత్వ పెట్టుబడుల ఉప సంహరణ ప్రక్రియ కూడా వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యేలా కేంద్రం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో విమానాశ్రయ రంగంలో రూ.90 వేల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించనున్నట్లు వివరించారు. ఇందులో రూ.68 వేల కోట్లు ప్రైవేటు వ్యక్తులు/ సంస్థల నుంచి వస్తాయన్నారు. మరో రూ.20 వేల కోట్లు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పెట్టుబడి పెడుతుందని చెప్పుకొచ్చారు. గత నెల 25న ఎయిరిండియాను టాటా గ్రూప్‌ రూ.18 వేల కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.


దేశీయ విమానయాన సర్వీసులు కొవిడ్‌కు మునుపటి స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో నిర్వహణపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అదనపు స్ర్కీనింగ్‌ యంత్రాలను సమకూర్చుకోవాలని విమానాశ్రయ సంస్థలకు కేంద్రం సూచించింది. అదనంగా 3 వేల మంది సిబ్బందిని నియమించాలని కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాల (సీఐఎ్‌సఎఫ్‌) సంస్థను కోరింది.

 

కొవిడ్‌ టెస్టులు పెంచండి: కేంద్రం

పలు దేశాల్లో కొవిడ్‌ ఉధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ టెస్టులు తక్కువగా జరుగుతున్న, కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కొవిడ్‌-19 పరీక్షల్ని వెంటనే పెంచాలని సూచిస్తూ కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ బుధవారం వాటికి లేఖ రాశారు. ఇదిలా ఉండగా.. కొవిడ్‌ మరణాలపై కేంద్ర ప్రభుత్వం విశ్వసనీయమైన సమాచారం అందించాలని, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల పరిహారం అందించాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు.  ఇక.. కొవిడ్‌ లక్షణాలు కలిగిన వారిపై కొవాక్సిన్‌ 50 శాతం ప్రభావశీలతను మాత్రమే చూపుతోందంటూ ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో ఓ అధ్యయన నివేదిక ప్రచురితమైంది. గత వారం రోజుల వ్యవధిలో ఐరోపా దేశాల్లో కరోనా కేసులు 11 శాతం మేర పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. స్పుత్నిక్‌- లైట్‌ సింగిల్‌ డోసు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వచ్చే నెలలో భారత్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ వెల్లడించింది.

Updated Date - 2021-11-25T08:31:04+05:30 IST