రావికమతం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు

ABN , First Publish Date - 2021-10-20T05:29:01+05:30 IST

మండలంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాసరావు.... గొంప ఎంపీటీసీ స్థానంలో వైసీపీకి కాకుండా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారంటూ అతనిని సస్పెండ్‌ చేశారు.

రావికమతం వైసీపీలో భగ్గుమన్న విభేదాలు
సస్పెండైన మానేపల్లి శ్రీనివాస్‌

‘యూత్‌’ మండల అధ్యక్షుడు సస్పెన్షన్‌

గొంప ఎంటీపీసీ స్థానంలో ప్రతిపక్ష అభ్యర్థికి మద్దతు తెలిపారని అభియోగం

ఆదేశాలు జారీ చేసిన పార్టీ మండల అధ్యక్షుడు ‘కంచిపాటి’

ముమ్మాటికీ కక్షసాధింపు చర్యఅని ‘మానేపల్లి’ ఆరోపణ


రావికమతం, అక్టోబరు 19: మండలంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో వర్గపోరు భగ్గుమంది. వైసీపీ మండల యువజన విభాగం అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాసరావు.... గొంప ఎంపీటీసీ స్థానంలో వైసీపీకి కాకుండా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపారంటూ అతనిని సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు కంచిపాటి జగన్నాథరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గొంప ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఓటమికి శ్రీనివాసరావే కారణమని, ఈ విషయం త్రిసభ్య కమిటీ విచారణలో రుజువు కావడంతో అతనిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశామని జగన్నాథరావు పేర్కొన్నారు. 


కక్షపూరిత చర్య: మానేపల్లి

మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న తనపై కక్షగట్టి సస్పెండ్‌ చేశారని వైసీసీ యువజన విభాగం మండల అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ,  గొంప ఎంపీటీసీగా పోటీ చేసిన కంచిపాటి జగన్నాథరావు (వైసీపీ మండల అధ్యక్షుడు) ఓడిపోవడానికి వైసీపీకి చెందిన గొంప సర్పంచ్‌ కారణమని, అతను టీడీపీ అభ్యర్థికి లోపాయకారిగా మద్దతు ఇచ్చారని, ఈ విషయాన్ని త్రిసభ్య కమిటీ ముందు గొంప గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చెప్పారని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ తనపై కక్షగట్టి  పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల్లో మరుపాక, రావికమతం, తట్టబంద, పి.పొన్నవోలు, గంపవానిపాలెంలో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారని, ఆయా సెగ్మెంట్లలో ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని అన్నారు.  జగన్నాథరావు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలను ఎమ్మెల్యే ధర్మశ్రీ దృష్టికి తీసుకువెళ్తానని ఆయన తెలిపారు.


Updated Date - 2021-10-20T05:29:01+05:30 IST