‘మూడు’... ముచ్చటే!

ABN , First Publish Date - 2020-08-08T08:55:45+05:30 IST

‘‘అమరావతిని రాజధానిగా తీసేయడంలేదు. మరో రెండు కొత్త రాజధానులు పెడుతున్నాం! అంతే!’’ అని ప్రభుత్వంలోని పలువురు

‘మూడు’... ముచ్చటే!

  • అసలు రాజధాని ఒక్కటే.. అది విశాఖ!
  • సీఎం, రాజ్‌భవన్‌, సెక్రటేరియట్‌, హెచ్‌వోడీలు ఎక్కడ ఉంటే అదే రాష్ట్ర రాజధాని
  • న్యాయ, శాసన ‘రాజధానులు’ నామ్‌కే వాస్తే
  • వైసీపీ నాయకుల మధ్య అంతర్గత చర్చ

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘‘అమరావతిని రాజధానిగా తీసేయడంలేదు. మరో రెండు కొత్త రాజధానులు పెడుతున్నాం! అంతే!’’ అని ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ముఖ్య నేతలు చెబుతున్నారు. కానీ... ‘మూడు రాజధానులు’ అనే మాటే పెద్ద మాయ అని... అంతిమంగా విశాఖే రాజధానిగా ఉంటుందని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. హైకోర్టులో కేసులు, రైతుల ఆందోళనలు, టీడీపీ రాజీనామాల డిమాండ్‌ నేపథ్యంలో... ఈ అంశంపై వైసీపీలో జోరుగా జరుగుతోంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. అసలు చర్చంతా దీనిచుట్టూనే తిరుగుతోంది. 


‘శాసన రాజధాని’ అని గొప్పగా చెబుతున్నప్పటికీ... అమరావతిలో అసెంబ్లీ, శాసన మండలి మాత్రమే  మిగులుతాయి. శాసనసభ ఏటా గరిష్ఠంగా 60 రోజులు మాత్రమే జరుగుతుంది. ఇటీవల కాలంలో అది కూడా జరగడంలేదు. ఆ 60 రోజుల హడావుడి తప్ప అమరావతిలో ఉండేదేమీ లేదు. ‘శాసన రాజధాని’ అనే పేరు తప్ప ఒరిగేదేమీ ఉండదు. ఇక... కర్నూలులో హైకోర్టుతోపాటు ‘న్యాయ’ కమిషన్లను ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ విషయంలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశముందని వైసీపీ నేత ఒకరు చెప్పారు. హైకోర్టు తరలింపు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేకపోవడమే దీనికి కారణం. ‘‘హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు ఆమోదం లభించకపోవచ్చు. అదే జరిగితే .. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ మాత్రమే ఏర్పాటు చేసే అవకాశముంది. అప్పుడు ప్రధాన న్యాయస్థానం అమరావతిలోనే కొనసాగుతుంది’’ అని ఆ నాయకుడు తెలిపారు. ఇక... విశాఖలోనూ హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయడం ద్వారా కేసుల విచారణ కోసం అమరావతి వరకూ రావాల్సిన అవసరం లేకుండా చూసే అవకాశమూ ఉం దన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఒక్కటే... విశాఖ!

న్యాయ రాజధాని, శాసన రాజధాని అని వేర్వేరుగా చూపించినా... ‘పరిపాలన రాజధానే’ అసలు రాజధాని అని వైసీపీ నేతలే చెబుతున్నారు. ‘‘ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్‌భవన్‌, సచివాలయం, మంత్రులు, శాఖల ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉంటే... అదే రాజధాని. ఇందులో సందేహమేమీ లేదు’’ అని వైసీపీ నేతలు స్పష్టంగా చెబుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట పేరుకు మూడు రాజధానులు అని చెబుతున్నప్పటికీ, విశాఖ కేంద్రంగానే రాజధాని ఉంటుందని పేర్కొంటున్నారు. కొన్నేళ్లకు... కేవలం ఏడాదిలో 50-60 రోజులు అసెంబ్లీ జరపడం కోసం అమరావతికి యం త్రాంగం మొత్తం వెళ్లడం కష్టమంటూ.. ‘సౌల భ్యం’ పేరిట చట్టసభలనూ విశాఖకే తరలించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.


కేంద్రం ఓకే...

రాజధాని తరలింపుపై కేంద్రం నుంచి అవరోధాలు ఎదురుకాబోవని హైకోర్టులో కేంద్ర హోం శాఖ వేసిన అఫిడవిట్‌తోనే స్పష్టమైందని అధికారపక్షానికి చెందిన కీలక నేత ఒకరు వెల్లడించారు. ఈ అంశంలో బీజేపీ జోక్యం చేసుకోదని కూడా స్పష్టమైందని వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తున్న జనసేన కూడా క్రమంగా వెనక్కి తగ్గుతుందని..దీంతో తరలింపును టీడీపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు మాత్రమే వ్యతిరేకిస్తాయన్నారు.

Updated Date - 2020-08-08T08:55:45+05:30 IST