లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో ముసలం

ABN , First Publish Date - 2020-09-28T06:20:41+05:30 IST

ప్రైవేట్‌ రంగంలోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) నిర్వహణపై వాటాదారుల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ నెల 25న జరిగిన బ్యాంక్‌ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులు బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు పెద్ద షాక్‌ ఇచ్చారు...

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌లో ముసలం

  • ఎండీ, సీఈఓల నియామకాలకు బ్రేక్‌
  • ఏజీఎంలో అడ్డుకున్న వాటాదారులు


చెన్నై : ప్రైవేట్‌ రంగంలోని లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ) నిర్వహణపై వాటాదారుల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. ఈ నెల 25న జరిగిన బ్యాంక్‌ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం)లో వాటాదారులు బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌కు పెద్ద షాక్‌ ఇచ్చారు. ప్రస్తుతం తాత్కాలిక ఎండీ, సీఈఓగా ఉన్న సుందర్‌ను తిరిగి ఆ పదవిలో తిరిగి నియమించే తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో పాటు ఎన్‌ సాయిప్రసాద్‌, గోరింక జగన్మోహన రావు, రఘురాజ్‌ గుజ్జర్‌, కేఆర్‌ ప్రదీప్‌, బీకే మంజునాథ్‌, వైఎన్‌ లక్ష్మీ నారాయణలను ఇండిపెండెంట్‌ డైరెక్టర్లుగా తిరిగి నియమించే తీర్మానాన్నీ వ్యతిరేకించారు. పీ చంద్రశేఖర్‌ ఎల్‌ఎల్‌పీని బ్యాంక్‌, బ్యాంక్‌ శాఖల ఆడిటర్‌గా తిరిగి నియమించే తీర్మానాన్నీ కూడా వాటాదారులు వ్యతికించారు. దాదాపు 60 శాతం మంది వాటాదారులు ఈ తీర్మానాలకు వ్యతిరేకంగా ఓటెయ్యడం గమనార్హం. బ్యాంకింగ్‌ నియత్రణ చట్టం కింద ఒక బ్యాంక్‌ వాటాదారులు... బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ, ఇండిపెండెంట్‌ డెరెక్టర్ల నియామక తీర్మానాల్ని ఇంత భారీ మెజారిటీతో తిరస్కరించడం భారత బ్యాంకింగ్‌ చరిత్రలో ఇదే మొదటిసారి. 


గతమెంతో ఘనం 

చెన్నై కేంద్రంగా పనిచేసే ఎల్‌వీబీ మూడేళ్ల క్రితం వరకు బాగానే పని చేసింది. మంచి నిర్వహణతో, లాభాలతో నడిచింది. పాత తరానికి చెందిన అనేక మంది చిన్న చిన్న వ్యాపారులే లక్ష్యంగా బ్యాంక్‌ లావాదేవీలు నిర్వహించేంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎల్‌వీబీకి చెప్పుకోదగ్గ స్థాయిలో శాఖలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. నాలుగైదేళ్ల క్రితం ఈ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు ప్రైవేటు రంగంలోని రెండు ప్రధాన బ్యాంకులు సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలు వచ్చాయి.


క్షీణించిన ఆర్థిక పరిస్థితి 

అయితే గత 10 త్రైమాసికాల నుంచి ఎల్‌వీబీ వరుసగా నష్టాలను ప్రకిటిస్తూ వస్తోంది. దీంతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గత ఏడాది సెప్టెంబరు 27న ఎల్‌వీబీని సత్వర దిద్దుబాటు చర్య (పీసీఏ) పరిధిలో చేర్చి కొత్త రుణాల మంజూరుపై ఆంక్షలు విధించింది. అయినా బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు. 2019-20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.836.04 కోట్ల భారీ నష్టాలు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ రూ.112.28 కోట్ల నష్టాలు మూటగట్టుకుంది. మార్చి, 2020 నాటికి మొండి బకాయిలు (ఎన్‌పీఏ) 9.64 శాతానికి చేరాయి. మూలధన నిష్పత్తి 0.17 శాతానికి, టైర్‌-1 మూలధన నిష్పత్తి -0.88 శాతానికి పడిపోయాయి. 2020 జూన్‌ నాటికి ఇది మరింత క్షీణించి -1.83 శాతానికి చేరింది. 


ఇప్పుడు దారేంటి ?

ఏజీఎంలో బోర్డు పునర్‌ నియామక  తీర్మానాల్ని 60 శాతం మంది వాటాదారులు తిరస్కరించడంతో ఇప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ రంగంలోకి దిగి డిపాజిటర్లు, వాటాదారుల ప్రయోజనాల కోసం బోర్డును పునర్‌ వ్యవస్థీకరిస్తుందా? లేక ఎల్‌వీబీని ఏదైనా బ్యాంకులో విలీనం చేసేందుకు చర్యలు తీసుకుంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పుట్టెడు ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎల్‌వీబీ నిండా మునిగే వరకు వేచి చూడకుండా, ఆర్‌బీఐ వెంటనే రంగంలోకి దిగి ఏదో ఒక చర్య తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


భయపడాల్సిందేమీ లేదు: ఎల్‌వీబీ

ఈ వార్తల నేపథ్యంలో ఎల్‌వీబీ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ శక్తి సిన్హా బ్యాంకు బోర్డు తరఫున ఒక ప్రకటన విడుదల చేశారు. బ్యాంక్‌ భవిష్యత్‌పై డిపాజిటర్లు ఉద్యోగులు, రుణదాతలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఏజీఎంలో ఎండీ, సీఈఓ, ఏడుగురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల పునర్‌ నియామకాల్ని వాటాదారులు తిరిస్కరించినా బ్యాంకు నిర్వహణకు ఎలాంటి ఢోకా లేదన్నారు. ముగ్గురు ఇండిపెండెంట్‌ డైరెక్టర్ల నిర్వహణలో బ్యాంక్‌ పని చేస్తుందని తెలిపారు. బ్యాంక్‌ లిక్విడిటీ కవరేజీ నిష్పత్తికీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. పీసీఏ నిబందనల కింద ఉండాల్సిన 100 శాతం నిధుల కంటే అధికంగానే దాదాపు 262 శాతం నిధులు ఉన్నట్టు తెలిపారు. ఎన్‌పీఏలుగా వర్గీకరించిన రుణాల్లో 72.6 శాతం రుణాలకు కేటాయింపులు జరిపినట్టు పేర్కొన్నారు.


Updated Date - 2020-09-28T06:20:41+05:30 IST