ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. గతేడాది రద్దయిన పరీక్షల్ని మళ్లీ రాయాల్సిందే..!

ABN , First Publish Date - 2021-09-29T09:05:55+05:30 IST

ఇంటర్మీడియట్‌ బోర్డు అక్టోబరు 25 నుంచి నిర్వహించనున్న మొదటి ఏడాది పరీక్షలను ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది చదువుతోన్న విద్యార్థులందరూ రాయాల్సిందే.

ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. గతేడాది రద్దయిన పరీక్షల్ని మళ్లీ రాయాల్సిందే..!

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాయాల్సిందే! 

ఇప్పుడు రాయకపోతే రెండోఏడాదితో కలిపి రాయాలి

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ బోర్డు అక్టోబరు 25 నుంచి నిర్వహించనున్న మొదటి ఏడాది పరీక్షలను ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది చదువుతోన్న విద్యార్థులందరూ రాయాల్సిందే. ఈ విషయంలో విద్యార్థులకు ఆప్షన్‌ ఎంచుకునే అవకాశం లేదు. ఒకవేళ ఈ పరీక్షలు రాయకపోతే... రెండవ ఏడాది పరీక్షల సమయంలో మొదటి ఏడాది పరీక్ష లు కూడా రాయాల్సి ఉంటుంది. రాయని పక్షంలో సదరు విద్యార్థులు ఉత్తీర్ణులుకానట్లుగానే అధికారులు పరిగణించనున్నట్లు తెలిసింది. కరోనా కారణంగా గత ఏడాది ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షలను రద్దు చేసిన అధికారులు.. ఫీజులు చెల్లించిన విద్యార్థులంద రినీ ప్రమోట్‌ చేసిన విషయం తెలిసిందే. సదరు విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్‌ రెండవ ఏడాది చదువుతున్నారు. అయితే, గత ఏడాది రద్దయిన మొదటి ఏడాది పరీక్షలను అక్టోబరు 25 నుంచి నిర్వహించాలని ప్రకటించిన బోర్డు అధికారులు.. ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అధికారుల సమాచారం ప్రకారం.. ఈ పరీక్షల కోసం విద్యార్థులు మళ్లీ ఎలాంటి ఫీజులూ చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో చెల్లించిన ఫీజులనే పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాగే, గత ఏడాది బోధించిన 70 శాతం సిలబ్‌సకే మొదటి ఏడాది పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీటిని గతంలోనే ముద్రించారు. గతంలో పరీక్షలు రద్దు కావడంతో వాటిని అలాగే భద్రపరచి ఉంచారు. ఇప్పుడు ఆ ప్రశ్నపత్రాలనే ఉపయోగించనున్నారు. ఈ సారి చాయిస్‌ ప్రశ్నలను రెట్టింపు చేశారు. ఈ ప్రశ్నపత్రాలకు సంబంధించి మోడల్‌ పరీక్ష పేపర్లను ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచారు.  


త్వరలో జిల్లా విద్యాధికారులతో బోర్డు భేటీ

ఇంటర్‌ మొదటి ఏడాది పరీక్షల నిర్వహణపై జిల్లా విద్యాధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. ఒకట్రెండు రోజుల్లో ఈ సమావేశం నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్ష కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, సెంటర్లలో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై చర్చిస్తారు. 

Updated Date - 2021-09-29T09:05:55+05:30 IST