ఇంటర్‌ పరీక్షల్లో సంస్కరణలు!

ABN , First Publish Date - 2020-02-22T09:36:38+05:30 IST

ఇంటర్‌ పరీక్షల్లో సంస్కరణలు!

ఇంటర్‌ పరీక్షల్లో సంస్కరణలు!

అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మార్చి 4నుంచి జరిగే ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌(థియరీ) పరీక్షల నిర్వహణలో భారీ సంస్కరణలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం పరీక్షల జరుగుతున్న తీరుపై పెద్దఎత్తున ఫిర్యాదులు నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు సమూల మార్పులకు శ్రీకారం చుడుతోంది. విద్యార్థులను జంబ్లింగ్‌ చేస్తున్నప్పటికీ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా తయారైందన్న అభిప్రాయాలపై పరిశీలన చేసిన తర్వాత ఇకపై పూర్తి స్థాయిలో జంబ్లింగ్‌ అమలు చేయాలని నిర్ణయించింది. చీఫ్‌ సూపరింటెండెంట్‌లతో సహా అంతా బయటి వాళ్లతోనే పరీక్షలను నిర్వహించాలని సంకల్పించింది. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ (డీవో), ఇన్విజిలేటర్లందరినీ జంబ్లింగ్‌ చేస్తారన్న మాట. అంటే ఏ పరీక్షా కేంద్రంలో అయినా.. సొంత కాలేజీ  విద్యార్థులు గానీ, లెక్చరర్లు గానీ ప్రభుత్వ కాలేజీల/ప్రైవేట్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు గానీ ఉండటానికి వీల్లేదు. తాజాగా పూర్తయిన ప్రాక్టికల్‌ పరీక్షల్లోనూ కొత్త విధానాన్ని అమలు చేశారు. పరీక్ష జరిగే సమయంలో కేంద్రాల్లోకి అటెండర్‌, వాటర్‌ బాయ్‌ తదితర సహాయ సిబ్బంది ఎవరినీ అనుమతించేంది లేదని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలన్నింటిలో.. అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఇక, విద్యార్థులు పొందిన మార్కులను పాఠ్యాంశాల వారీగాను, ఓవరాల్‌గానూ మార్కుల మెమోలలో ఇవ్వాలని ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. సబ్జెక్టుల వారీగా గ్రేడులను మాత్రం ఇవ్వరు. అయితే మార్కులతో పాటు ఓవరాల్‌ గ్రేడింగ్‌ ఇవ్వడమా లేక పాత పద్ధతి మేరకు ప్రథమ, ద్వితీయ, తృతీయ.. ఇలా క్లాస్‌లు ఇవ్వడమా అనే విషయమై ఈ నెల 26న విద్యాశాఖా మంత్రి నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఇంటర్‌ పబ్లిక్‌ (థియరీ)పరీక్షలు మార్చి 4నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,64,442 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు రిజిస్టర్‌ అయ్యారు. ఇది గత ఏడాది కంటే 46,842 మంది అధికం. ఈ సారి 5,46,162 మంది ఫస్టియర్‌, 5,18,280 మంది సెకండియర్‌  విద్యార్థులున్నారు.

Updated Date - 2020-02-22T09:36:38+05:30 IST