సర్వం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

సర్వం సిద్ధం

  • రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు
  • గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
  • ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
  • పరీక్షా సమయం : ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
  • జిల్లా వ్యాప్తంగా 156 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
  • పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మొదటి సంవత్సరంలో 59,694 మంది, రెండో సంవత్సరంలో 55,672 మంది
  • పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 144 సెక్షన్‌ అమలు 
  • సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులకు నో ఎంట్రీ

రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులుకల్పించారు.


రంగారెడ్డి అర్బన్‌, మే 4 : జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 156 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరంలో 59,694 విద్యార్థులు, రెండో సంవత్సరంలో 55,672 విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు నలుగురు చొప్పున ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, డిప్యూటీ తహసీల్దార్లు, మరో నలుగురు చొప్పున పోలీసులు, సిట్టింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. మానిటర్‌ చేసేందుకు హైపవర్‌ కమిటీ, డీసీలను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించే పరీక్షలకు గంట ముందుగానే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. సెల్‌ఫోన్లు, ఎలక్ర్టానిక్‌ వస్తువులు నిషేధించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జీరాక్స్‌ కేంద్రాలను మూసి వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షా కేంద్రాల లోపలికి విద్యార్థులు వచ్చే సమయంలో చెకింగ్‌ నిమిత్తం సిబ్బందిని ఏర్పాటు చేశారు. కేంద్రానికి నిర్ణీత సమయానికి చేరుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు సకాలంలో బస్సులను ఏర్పాటు చేస్తోంది. 29 పోలీ్‌సస్టేషన్లలో భద్రపర్చిన ప్రశ్నపత్రాలను పోలీసు బందోబస్తుతో పరీక్షా కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండేలా, మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా చూస్తున్నారు. ప్రతి కేంద్రం వద్ద ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.


ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

ఒక్కనిమిషయం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోని అనుమంతిచేందు  లేదు. ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చేసుకోవాలి. విద్యార్థులు ఉదయం 8 గంటల వరకు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. గంట ముందు పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు  ఒత్తిడికి గురి కావద్దు. ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఇంటర్మిడియట్‌ విద్యార్థులు పరీక్షలు రాసే ముందు ఎవరైనా ఆందోళనకు గురైతే అలాంటి విద్యార్థులకు మానసిక దైర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.  

- వెంక్యానాయక్‌, డీఐఈవో

Read more