అంతర్‌ఘోష!

ABN , First Publish Date - 2020-08-31T06:35:40+05:30 IST

ఆకాశంలో పొంగిపొర్లే సముద్రం నీటిగుంటలో రాలే చినుకుల గిలిగింతలు భూమి పొరల్లో పొంగి అవని నిండా రోదసిలోకి...

అంతర్‌ఘోష!

ఆకాశంలో పొంగిపొర్లే సముద్రం

నీటిగుంటలో రాలే చినుకుల గిలిగింతలు

భూమి పొరల్లో పొంగి

అవని నిండా రోదసిలోకి

అందుకోలేని దిగంతాల-

అంచులదాకా పయనించి

సాగరంలో మునకేసేదాకా

గాలివానలో పరవశించి

జలదరించే చెట్ల నడుమ

ప్రాణుల ఆదిమవాంఛ!

వేల తరాల నుంచి

మొగ్గ తొడిగి పుష్పించి

వాడిపోయి రాలి,

నేలలోంచి మళ్ళీ

అంకురించే జీవమే - 

ధరిత్రి నిండా!

మన తాతల ముత్తాతల

అనేక తరాల శ్రమ సాఫల్యం- 

ఈ దుక్కి దున్నిన నేలలోనే

అరమోడ్పు కనులతో

విశ్వాంతరాల భాషలో

ప్రతిధ్వనించే

కొత్త తరాల అంతర్‌ ఘోష! 

నిఖిలేశ్వర్‌


Updated Date - 2020-08-31T06:35:40+05:30 IST