Abn logo
Sep 19 2021 @ 00:50AM

మా ప్రాణాలతో చెలగాటమా?

శనివారం రాత్రి 9గంటలకే శ్రీనివాసం కాంప్లెక్సు ముందు రోడ్డుపై బారులు తీరిన భక్తులు

శ్రీవారి భక్తుల ఆగ్రహం

శ్రీనివాసం కాంప్లెక్సు ఎదుట సర్వదర్శన టోకెన్ల కోసం తోపులాటే ఇందుకు కారణం


తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 18: తమ ప్రాణాలతో చెలగాటం ఆడతారా అంటూ శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లావాసులకు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్సులో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ టోకెన్ల కోసం కాంప్లెక్సు ఎదుట రోడ్డుపై భక్తులు కిక్కిరిసి ఉంటున్నారు. శనివారం రాత్రి కూడా భక్తులు ఇలాగే బారులు తీరారు. తొమ్మిది గంటలు దాటాక క్యూలో తోపులాట మొదలైంది. మహిళలు, చిన్న పిల్లలు కేకలు వేయడం మొదలుపెట్టారు. దీన్ని గమనించి పోలీసులు క్యూలైనును క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటి పోతుండటంతో అర్ధరాత్రి సమీపించేసరికి భక్తులను కాంప్లెక్సులోకి అనుమతించారు. ఇకనైనా టీటీడీ తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. ఇలాగే తోపులాటలు జరుగుతుంటే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదమూ లేకపోలేదు. 


కాంప్లెక్సు లోపలకు అనుమతిస్తే సరి


భక్తులను రోడ్డుపై క్యూలో ఉంచకుండా శ్రీనివాసం కాంప్లెక్సు లోపలకు అనుమతించవచ్చు.ఎందుకంటే కాంప్లెక్సులోని మొదటి అంతస్తులోని ఉన్న హాల్లో దాదాపు రెండువేలమందికి పైగా భక్తులకు విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. ఇకనైనా ఆ దిశగా ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.  


టీటీడీ సిబ్బందితో తమిళ భక్తుల గొడవ


పెరటాసి మాసం మొదలవడంతో తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి వస్తున్నారు. వీరిలో చాలామంది సర్వదర్శన క్యూల్లోకి చేరిపోతున్నారు.శనివారం కూడా ఇలాగే చాలామంది ఉండటంతో వారి ఆధార్‌ కార్డులను పరిశీలించి, కాంప్లెక్సు లోపలకు అనుమతించలేదు.దాంతో తమిళనాడు భక్తులంతా సిబ్బం దితో గొడవకు దిగారు.చివరకు సిబ్బంది వారికి విషయం అర్థమయ్యేలా తెలియజేసి పంపాల్సి వచ్చింది.