Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ప్రాణాలతో చెలగాటం

twitter-iconwatsapp-iconfb-icon

భారతదేశానికి ఊపిరి ఆడటం లేదు. ప్రాణవాయువు ఆక్సిజన్‌ అందక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గతేడాది కరోనా వైరస్‌ దేశంపై దాడి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ వంటి కఠినచర్యలు తీసుకుని పరిస్థితి అదుపు తప్పిపోకుండా అడ్డుకుంది. కానీ రెండవ దశలో కేంద్రం కూడా చేష్టలుడిగి చూస్తుండి పోతున్నది. పాలకులకు ప్రజల ప్రాణాల కంటే ఎన్నికలే ముఖ్యమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మట్టి కరిపించడం ద్వారా దేశ రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం సాధించాలన్న లక్ష్యంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 8 దశల్లో అక్కడ ఎన్నికలు జరిపిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నందున చివరి మూడు దశలకు ఒకేసారి పోలింగ్‌ నిర్వహించి ఎన్నికల ప్రక్రియ ముగించాలని వివిధ రాజకీయ పక్షాలు వేడుకున్నప్పటికీ స్వతంత్రంగా వ్యవహరించవలసిన ఎన్నికల కమిషన్‌ ససేమిరా అంటోంది. దేశ రాజకీయాల్లో తమకు కంట్లో నలుసుగా మారిన మమతా బెనర్జీని బెంగాల్‌లో మట్టి కరిపించాలన్న పట్టుదలతో ఉన్న కేంద్రప్రభుత్వ పెద్దలు ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గత ఏడాది ఇదే సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో కరోనా వైరస్‌ అదుపులోకి వచ్చింది. దీంతో అదంతా తమ ఘనతేనని పాలకులు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కరోనా దేశమంతటా విజృంభించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నప్పటికీ వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలు రాష్ర్టాల బాధ్యతే అన్నట్టుగా కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తోంది. రోజూ మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. రెండువేల మందికి పైగా నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారని అధికారికంగానే ప్రకటిస్తున్నారు. వాస్తవానికి ఈ లెక్కలు రెట్టింపు ఉంటాయి. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో ప్రతి రోజూ ఐదారు లక్షల మంది కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదు. వివిధ రాష్ర్టాల్లో ఆసుపత్రులలో బెడ్లు దొరకడం లేదు. బెడ్లు ఉంటే ఆక్సిజన్‌ సరఫరా ఉండటం లేదు. ఆక్సిజన్‌ ఉంటే మందుల కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే కనీసం వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించాల్సిన అవసరముంది. దీనివల్ల కరోనా వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చు. ఆక్సిజన్‌, మందుల కొరతను అధిగమించవచ్చు. అయితే లాక్‌డౌన్‌ విధించడమా? లేదా? అన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులు దులుపుకొన్నారు. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కుబడిగా రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ విధిస్తున్నట్టుగా ప్రకటించాయి. రాత్రి ౯ నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించడం వల్ల ప్రయోజనం ఏమిటో పాలకులకే తెలియాలి. తెలంగాణ హైకోర్టు కూడా ఇదే ప్రశ్న వేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబంలో పలువురికి కరోనా సోకిందంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ విధిస్తే ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పాలకులు ఆందోళన చెందుతున్నారు తప్పితే.. కరోనా సోకిన వారికి బెడ్లు, ఆక్సిజన్‌, మందులు సరఫరా చేయగలుగుతున్నామా? లేదా? అని ఆలోచించడం లేదు. ఢిల్లీ లోని పేరొందిన గంగారాం ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 25 మంది కరోనా రోగుల ప్రాణాలు ఒక్కరోజులోనే గాలిలో కలిసిపోయాయంటేనే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. కరోనా మరణాలు వేల నుంచి లక్షలకు పెరిగితే తప్ప పాలకులకు చురుకు పుట్టదేమో తెలియదు! పాకిస్థాన్‌ వంటి దేశాలు కూడా మనదేశం నుంచి రాకపోకలను నిషేధించాయి అంటే.. అది మనకు తలవొంపులు కాదా? కరోనా వల్ల అభివృద్ధి చెందిన దేశాలు కూడా సతమతం అవుతుంటే.. మన దేశంలో మాత్రం వైరస్‌ను సమగ్రంగా కట్టడి చేశామని నిన్నటివరకు గొప్పలు చెప్పుకొన్నవారు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదు? వ్యాక్సిన్‌ అందుబాటులో లేని దేశాల కంటే, వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన మన దేశంలో ఈ దుర్భర పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే.. అందుకు పాలకులు ఎంత కారణమో, ప్రజలు కూడా అంతే కారణం. ఉచితంగా టీకాలు వేస్తాం రండి బాబూ అంటే.. ప్రజలు ముందుకు రాలేదు. వైద్యరంగంలో పనిచేస్తున్న వారు కూడా టీకా వేయించుకోవడానికి జంకారు. దీంతో ప్రజల్లో అపోహలు తలెత్తాయి. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడానికి ప్రభుత్వాలు కూడా గట్టి ప్రయత్నం చేయలేదు. ఫలితంగా అతి కొద్దిమంది మాత్రమే వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. దీనికి తోడు వ్యాక్సిన్‌ వేయించుకోండి.. కరోనాను పారదోలండి అని ప్రభుత్వాలు చేసిన ప్రచారం కూడా వికటించింది. టీకా వేయించుకుంటే కరోనా సోకదన్న అభిప్రాయంతో టీకా వేయించుకున్నవాళ్లు విచ్చలవిడిగా తిరిగి వైరస్‌ వ్యాప్తికి కారకులయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న ఏ వ్యాక్సిన్‌ కూడా కరోనా వైరస్‌ సోకకుండా అడ్డుకోలేదు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వాళ్లకు కరోనా సోకినా దాని తీవ్రతను తగ్గించి ప్రాణాపాయం లేకుండా మాత్రమే చేస్తుంది. ఈ కారణంగా వ్యాక్సిన్‌ వేయించుకున్న పలువురు వైరస్‌ సోకినా ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రజలకు ముందుగానే స్పష్టత ఇచ్చిఉంటే ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉండేది. ఇప్పుడు వ్యాక్సిన్‌ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్న ప్రజలు నిన్నటి దాకా వ్యాక్సిన్‌ వేయించుకోండ్రా బాబూ అంటే.. తప్పించుకు తిరగడం బాధ్యతారాహిత్యం కాదా? సూది ద్వారా ఇచ్చే ఏ వ్యాక్సిన్‌కు అయినా వందలో పది మందికి జ్వరం రావడం వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అంతెందుకు, పిల్లలకు మనం ఎన్నో టీకాలు వేయిస్తున్నాం కదా? వారిలో కొంతమందికి జ్వరం రావడం మనకు తెలిసిందే కదా! అయినా దిక్కుమాలిన సందేహాలతో చదువుకున్నవాళ్లు కూడా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరోవైపు రాజకీయ సభలు, ఉత్సవాలు, గుళ్లు, గోపురాల్లో ప్రజలు మాస్కులు కూడా లేకుండా కిక్కిరిసి ఉండటాన్ని మనం చూశాం. కుంభమేళా వంటి జాతరలు ఉండనే ఉన్నాయి. దేవుడు ఎక్కడికి వెళతాడు? మనతోనే ఉంటాడు కదా. గుళ్లల్లో ఒకరినొకరు తోసుకుంటూ దర్శనం చేసుకుంటేనే భక్తి ఉన్నట్టా? అయినా దేవుడు సర్వాంతర్యామి కదా! దేవాలయాలకు వెళ్లినంత మాత్రాన చేసిన పాపాలు పోవు. ఇక తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే.. ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్మోహన్‌రెడ్డి ఇరువురూ మొదటి నుంచీ కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని ప్రజలకు నూరిపోయడంతో ఇప్పుడు పుట్టి మునుగుతోంది. ‘‘కరోనాది ఏముంది... వస్తుంది, పోతుంది.. ప్యారసిటమాల్‌ వేసుకుంటే చాలు..’’ అని ఏపీ సీఎం జగన్‌రెడ్డి ప్రచారం చేయగా, తెలంగాణలోకి కరోనా ఎలా ప్రవేశిస్తుందో తాను చూస్తానని, అవసరమైతే వెయ్యి కోట్లు అయినా ఖర్చు చేసి కరోనా అంతు చూస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అంతటితో ఆగకుండా కరోనాను అరికట్టడానికి అవసరమైతే తనతో పాటు ఎమ్మెల్యేలందరూ మాస్కులు కూడా లేకుండా రంగంలోకి దూకుతారని ఆయన ప్రకటించారు. ఇరువురు ముఖ్యమంత్రులూ చేసిన ఇటువంటి ప్రకటనలతో ప్రజల్లో కూడా కరోనా పట్ల సీరియస్‌నెస్‌ లేకుండా పోయింది. కరోనాతో సహజీవనం చేయాలి కాబోలు అనుకున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే కరోనా సోకింది. అవసరమైతే వెయ్యి కోట్లు అయినా విసిరేస్తానని ప్రకటించిన ఆయన, ఇప్పుడు ప్రజలు అల్లాడిపోతున్నప్పటికీ చేష్టలుడిగి చూస్తున్నారు. ఇక ఆంధ్రాలో పరిస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్కీంల పేరిట ప్రజలకు పంచిపెట్టడానికి అలవాటు పడిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, ఇప్పుడు అందరికీ ఉచితంగా టీకా వేయిస్తానని ప్రకటించి తన బాధ్యత తీరినట్టుగా భావిస్తున్నారు. రోగులు ఫోన్‌ చేసిన మూడు గంటల్లోపు బెడ్‌ సిద్ధం చేయాలని ప్రకటించిన జగన్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసో లేదో తెలియదు. రాష్ట్రంలో కొవిడ్‌ రోగులతో ఆసుపత్రులన్నీ ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. దీంతో పలువురు రోగులు ముఖ్యంగా పలుకుబడి, డబ్బు ఉన్నవాళ్లు హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో బెడ్‌ కోసం పరుగులు తీస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రులలో బెడ్స్‌ కోసం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కార్యాలయం ఫోన్లు చేయని రోజు ఉందా? అయినా బెడ్ల కొరత లేదని ప్రకటించడం ఎందుకు? ఇక రోగుల సంఖ్య, మరణాల విషయంలో కూడా రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు సరైన సమాచారం ఇవ్వడం లేదు. వాస్తవాలు చెబితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతారనుకుంటే పొరపాటే! మనిషిని అదుపు చేసేది భయం మాత్రమే. వాస్తవాలను మరుగుపరిస్తే అసలుకే మోసం వస్తుంది. పరిస్థితి అదుపులోకి రాని పక్షంలో వైద్యరంగంలో అత్యవసర పరిస్థితి విధించాల్సి రావొచ్చు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యతతో మెలిగి కరోనా మహమ్మారిని కట్టడి చేయని పక్షంలో మనలో ఎంతమంది ఈ గండం గట్టెక్కి బయటపడతారో తెలియదు. వచ్చే నెలలో వైరస్‌ మరింతగా విరుచుకుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే మరణాలు భారీగా ఉంటాయి. ఈ పరిస్థితిని నిలువరించాలంటే వెంటనే కనీసం వారం రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించాల్సిన అవసరముంది. తద్వారా కలిగే వెసులుబాటును ఉపయోగించుకుని మౌలిక వసతులను మెరుగుపరచుకోవచ్చు.


ఇంకెందుకు ఈసీ?

ఈ విషయం అలా ఉంచితే, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాల గురించి చర్చించుకుందాం. ఎన్నికల్లో బ్యాలెట్‌పత్రాలు వినియోగించిన రోజులలో కొంతమంది రాజకీయ నాయకులు తమకు పూర్తి ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో రిగ్గింగ్‌కు పాల్పడేవారు. ఈవీఎంలు రావడంతో పాటు ఫ్యాక్షన్‌ రాజకీయాలు తగ్గుముఖం పట్టడంతో రిగ్గింగ్‌ గురించి మనం మర్చిపోయాం. ఇంతకాలానికి ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం సహకారంతో అధికారికంగా రిగ్గింగ్‌ జరిగింది. పొరుగు నియోజకవర్గాల నుంచి వేలాది మందిని బస్సులు, ఇతర వాహనాలలో తరలించి మరీ రిగ్గింగ్‌ చేసిన ఘనత అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుంది. ఎన్నికల్లో పదో పరకో దొంగ ఓట్లు వేయించడం కొత్త కాదు. కానీ ఇలా వేలాది మందికి ఓటరు ఐడీ కార్డులు రూపొందించి రిగ్గింగ్‌ జరిపించడం అసాధారణం. తిరుపతి పట్టణాన్ని దొంగఓటర్లు ముంచెత్తారు. ప్రశ్నించిన మీడియాకు కొంతమంది ముఖం చాటేయగా, మరికొందరు పారిపోయారు. ఈ తతంగమంతా న్యూస్‌చానెళ్లలో ప్రసారమైనా అధికార యంత్రాంగం నుంచి కనీస స్పందన కనిపించలేదు. విచిత్రంగా మొత్తం పోలీస్‌వ్యవస్థ చేతులు కట్టుకుని కళ్లు మూసుకుని ఉండిపోయింది. పైగా దొంగఓటర్లకు తిరిగి వెళ్లే సమయంలో రక్షణ కల్పించారు. ఎన్నికల కమిషన్‌ నియమించిన పరిశీలకులు కూడా పత్తా లేకుండా పోయారు. అంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అండ్‌ కో ఎంత పకడ్బందీగా ముందుచూపుతో ప్రణాళిక రూపొందించారో అర్థం చేసుకోవచ్చు. అన్ని వ్యవస్థలను నోట్ల కట్టలతో కొనిపారేశారని చెప్పవచ్చు. లేని పక్షంలో ఎన్నికల పరిశీలకులు కూడా పట్టించుకోకపోవడం ఎలా సాధ్యం? బోగస్‌ ఓటర్‌ ఐడీ కార్డులను రూపొందించడాన్ని ఇప్పుడే చూస్తున్నాం. ఇది తీవ్రమైన నేరం. అయినా ఎన్నికల కమిషన్‌ నుంచి ఉలుకు పలుకు లేదు. ఇంతోటి దానికి ఎన్నికల కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఎందుకు? నిజానికి తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధిస్తుందని అందరూ అనుకుంటున్నదే. అలాంటప్పుడు ఇంతలా బరితెగించి రిగ్గింగ్‌ చేయవలసిన అవసరమేంటి? అంటే, తిరుపతి అసెంబ్లీ స్థానంలో అధికారపార్టీ బలహీనంగా ఉండటమే. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కరుణాకరరెడ్డి కేవలం 1200 ఓట్ల మెజారిటీతో తిరుపతి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో వైసీపీకి అప్పుడు అనుకూల ప్రభంజనం ఉధృతంగా ఉన్నప్పటికీ, లోక్‌సభ విషయానికి వస్తే, తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నాలుగు వేల మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఐదులక్షల మెజారిటీతో గెలుస్తామని అధికార పార్టీ నాయకులు ముందుగానే ప్రకటించుకున్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానంలో పరిస్థితి అనుకూలంగా లేకపోతే మెజారిటీ తగ్గుతుందని భావించారేమో తెలియదు కానీ, సిగ్గూ ఎగ్గూ లేకుండా రిగ్గింగ్‌ సాగించారు. స్థానిక బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి అన్నట్టుగా ఇలా దొంగఓట్లతో విజయాలు నమోదు చేసుకునే రాజకీయ పార్టీల బతుకు ఒక బతుకా? మే 2వ తేదీన అధికార పార్టీ ఎంత మెజారిటీతో గెలుస్తుందో తెలుస్తుంది. అయితే తిరుపతి పట్టణంలో దొంగఓటర్లు స్వైర విహారం చేయడం, విశృంఖలంగా రిగ్గింగ్‌ చేయడం వల్ల అధికార పార్టీకి గెలిచిన ఆనందం కానీ, మెజారిటీపై గొప్పలు చెప్పుకొనే అవకాశం కానీ ఉండవు. ఈ ఉపఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాలు ఓటర్లకు డబ్బు పంచకపోవడం శుభపరిణామం. ఓటర్లకు డబ్బు పంచకూడదని నిర్ణయించిన ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, రిగ్గింగ్‌ను కూడా నివారించి ఉంటే ఆయన ప్రతిష్ఠ ఎంతో పెరిగి ఉండేది. రాజకీయాలకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఖ్యాతి దక్కేది. తిరుపతిలో దురాగతాల పుణ్యమా అని జగన్‌రెడ్డి నిజస్వరూపం బయటపడింది. ఈ కారణంగా స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాలు కూడా మసకబారాయి. నిజం చెప్పాలంటే తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా జగన్‌రెడ్డి ఒక ప్రయోగం చేశారు. దొంగఓటర్ల దండయాత్ర విజయవంతం అయింది కనుక మూడేళ్ల తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో విస్తృత ప్రాతిపదికన ఇదే ప్రయోగం చేయరన్న గ్యారంటీ ఏమీ లేదు. కేంద్రప్రభుత్వ పెద్దలకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై పీకల దాకా కోపం ఉన్నందున ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ తరహాలో రాష్ట్రంలో కూడా మూడు నాలుగు దశల పోలింగ్‌కు జగన్‌రెడ్డి ప్లాన్‌ చేయరన్న గ్యారంటీ లేదు. జగన్‌ను  తమ ఆప్తమిత్రుడుగా కేంద్ర పెద్దలు పరిగణిస్తున్నందున ఆయన కోరికను వారు కాదనగలరా? అదే జరిగితే ప్రజాస్వామ్యానికి పాతర వేయడమే అవుతుంది. ప్రజాభిప్రాయానికి విలువే ఉండదు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ఏదో ఒక ఉప ఎన్నికలో గెలవడమే కాకుండా మెజారిటీ విషయంలో కూడా రికార్డులు సృష్టించడం కోసం అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను ధ్వంసం చేస్తే దాని ఫలితాన్ని ప్రజలు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో  తిరుపతి పోలీసులు వ్యవహరించిన తీరు మొత్తం వ్యవస్థకే తలవొంపులు తెచ్చిపెట్టింది. పోలీసులపై ఇప్పటికే ప్రజల్లో సదభిప్రాయం లేదు. ఇప్పుడు తిరుపతిలో పోలీసులందరూ సామూహిక సెలవు పెట్టినట్టుగా పోలింగ్‌ కేంద్రాల వద్ద కనిపించకుండా పోవడాన్ని మించిన దారుణం ఏముంటుంది? జరిగిన దానికి మూడు సింహాల టోపీని నెత్తిన పెట్టుకుని ఠీవీగా తిరిగే పోలీసు అధికారులందరూ సిగ్గుతో తల దించుకోవాలి. ఇటువంటి దారుణాలను పెంచి పోషిస్తే ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఏముంటుంది? భవిష్యత్తులో హత్యలు చేసేవారికి సైతం పోలీసులు ఇదే విధంగా సహకరించరన్న గ్యారంటీ ఉంటుందా? కొన్ని సినిమాల్లో హత్య చేయాలనుకున్నప్పుడు విలన్లు తమకు నమ్మినబంటు వలె ఉండే పోలీసు అధికారులను ఒక గంటపాటు ఎటైనా వెళ్లిపోండి అని ఆదేశించడం చూశాం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఇదే పరిస్థితి దాపురించేలా ఉంది. పోలీసులు, నేరస్థులు ఏకమైతే ప్రజలకు ఆ దేవుడే దిక్కు. కొండపై వెలసిన వెంకన్న సాక్షిగా జరిగిన ఈ అరాచకానికి సామూహికంగా సిగ్గుపడదాం. గర్భగుడిలోని మూల విరాట్‌లా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి దేనికీ స్పందించరు. తిరుపతిలో జరిగిన దానిపై కూడా ఆయన నోరు మెదపడం లేదు. విచిత్రం ఏమిటంటే జగన్‌రెడ్డి అధికారానికి లొంగిపోయిన కొన్ని న్యూస్‌ చానెళ్లు కూడా పోలింగ్‌ రోజున తిరుపతిలో బాహాటంగా జరిగిన రిగ్గింగ్‌ను చూపించే సాహసం చేయలేక కళ్లు మూసుకున్నాయి. ముఖ్యమంత్రికి విశాల ప్రజాప్రయోజనాల కంటే తన రాజకీయ ప్రయోజనాలు, కక్ష సాధింపులే ముఖ్యం. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాధి సోకుతున్న వారి సంఖ్య రోజుకు 12 వేలకు పెరిగినా అదేమీ పట్టని ప్రభుత్వం తెల్లవారకముందే వందల మంది పోలీసులను పంపి తెలుగుదేశం నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేయించింది. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన కేసును ఇప్పుడు తిరగదోడి నరేంద్రను హడావిడిగా అరెస్ట్‌ చేశారంటేనే ముఖ్యమంత్రిలో కక్ష సాధింపు వైఖరి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారాన్ని ఈ స్థాయిలో దుర్వినియోగం చేయవచ్చునని గత పాలకులకు తెలియదు. నిజానికి రాజకీయాల్లో గతంలో కక్ష సాధింపు ధోరణులు ఉండేవి కావు. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదే ధోరణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాల అధికారానికి లొంగిపోతున్న ముఖ్యమంత్రులు తమ సొంత రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులందరినీ ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్‌ చేసే వరకు జగన్‌రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదు. ఆయన ప్రశాంతంగా నిద్రపోతే తప్ప రాష్ట్రంలో ప్రశాంతత ఉండదు. ఈ కారణంగా ముఖ్యమంత్రి హిట్‌లిస్టులో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్లడం మంచిది. తెలుగుదేశం నాయకులు అందరినీ ఒక మైదానంలో నిర్బంధించి దాన్నే ఓపెన్‌ ఎయిర్‌ జైలుగా మారిస్తే జగన్‌రెడ్డి శాంతించవచ్చు!

ఆర్కే

ప్రాణాలతో చెలగాటం

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.