అంతరిక్ష విహారి.. 30 సెకన్లలోనే ప్రేమలో పడ్డాడు

ABN , First Publish Date - 2021-07-26T00:25:38+05:30 IST

ఆరేళ్ల వయసులో అంతరిక్షాన్ని చుట్టి రావాలని కలలు కన్నాడు వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌. దాన్ని 71 ఏళ్ల వయసులో నిజం చేసుకున్నాడు. అంతరిక్షాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయ

అంతరిక్ష విహారి.. 30 సెకన్లలోనే ప్రేమలో పడ్డాడు

ఆరేళ్ల వయసులో అంతరిక్షాన్ని చుట్టి రావాలని కలలు కన్నాడు వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ అధినేత రిచర్డ్‌ బ్రాన్సన్‌. దాన్ని 71 ఏళ్ల వయసులో నిజం చేసుకున్నాడు. అంతరిక్షాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రయత్నంలో తొలి విజయం నమోదు చేశాడు. 


తన విజయం వెనుక గొప్పతనమంతా తల్లి ఈవ్‌ బ్రాన్సన్‌దే అంటాడు రిచర్డ్‌. ఓసారి తన తల్లికి రోడ్డుపై ఒక విలువైన నెక్లెస్‌ దొరికిందని, దాన్ని పోలీసులకు అప్పగించిందని చెప్పాడు. అయితే ఆ నెక్లెస్‌ కోసం ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో దాన్ని తిరిగి తన తల్లికే పోలీసులు ఇచ్చేశారని తెలిపాడు. ఆ నెక్లె్‌సను అమ్మి తన బిజినెస్‌ కోసం తల్లి డబ్బులు ఇచ్చిందని, ఆ రోజు ఆ డబ్బు ఇవ్వకపోతే ‘వర్జిన్‌ గ్రూప్‌’ మొదలయ్యేది కాదని చెప్పాడు. 


రిచర్డ్‌ ‘డిస్‌లెక్సియా’ అనే వ్యాధితో బాధపడేవాడు. ఇదొక ‘రీడింగ్‌ డిజార్డర్‌’. రాయడం, చదవడం సరిగా వచ్చేది కాదు. మధ్యలోనే స్కూలు వదిలేసి వెళుతున్నప్పుడు రిచర్డ్‌ను పిలిచి అతని స్కూలు ప్రిన్సిపల్‌ ‘నువ్వు జైలుకైనా వెళతావు లేదా పెద్ద మిలియనీర్‌వి అవుతావు’ అని జోస్యం చెప్పి పంపించాడు. 


విశాలమైన విశ్వంలో అత్యంత ఆసక్తికరమైనది అంతరిక్షమే. అందుకే చిన్నప్పుడే అంతరిక్షంలో ప్రయాణించాలన్న కోరిక పుట్టింది రిచర్డ్‌లో. విజయవంతమైన వ్యాపారవేత్తగా మారాక 2004లో స్పేస్‌ ప్లేన్‌ చేయాలనుకుంటున్నట్టు ప్రపంచానికి వెల్లడించాడు. 


కొన్ని వేల కోట్ల రూపాయల వర్జిన్‌ సంస్థకు కొడుకుని కాకుండా కూతురిని వారసురాలిని చేస్తున్నాడు రిచర్డ్‌. తన తదనంతరం తన కూతురు హోలీ సంస్థ బాధ్యతలు స్వీకరిస్తుందని చెప్పాడు. 



రిచర్డ్‌ తన వర్జిన్‌ గ్రూప్‌ కింద దాదాపు వంద సంస్థలను స్థాపించాడు. వాటిలో 60,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయన ఆస్తి అయిదు వందల కోట్ల డాలర్లు. ఇంత సంపాదించిన రిచర్డ్‌ స్కూలు చదువును మధ్యలోనే ఆపేశాడు. 


బ్రాన్సన్‌ కు సొంత ద్వీపం ఉంది. వర్జిన్‌ ఐలాండ్స్‌లోని నెకెర్‌ ద్వీపాన్ని ఆయన భారీ మొత్తాన్ని చెల్లించి కొన్నాడు. అక్కడే నివాసం ఉంటాడు. చాలా మంది సెలెబ్రిటీలు అక్కడకు విహారం కోసం వెళ్లి వస్తుంటారు. 


చదువురాక స్కూలు చదువును మధ్యలోనే వదిలేసిన బ్రాన్సన్‌ తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది మాత్రం ఒక పత్రికతోనే. ‘స్టూడెంట్‌’ అనే మ్యాగజైన్‌ను 1968లో ప్రారంభించాడు. అప్పుడతని వయసు కేవలం పదహారేళ్లు. 


రిచర్డ్‌ కొన్ని రోజులు జైల్లో కూడా గడిపాడు. 1971లో పన్ను ఎగ్గొట్టడానికి కొన్ని తప్పుడు పత్రాలు సమర్పించారు. ఆ కేసులో స్వల్పకాలం జైల్లో ఉన్నాడు. కోర్టులో కచ్చితంగా పన్నులు కడతానన్న హామీ ఇచ్చి బయటికి వచ్చాడు. 


చావుకి తాను భయపడనని అంటాడు రిచర్డ్‌. ఇప్పటివరకు తాను 76 సార్లు మరణాన్ని మోసం చేసి బతికానని అంటాడు. తనకు ఛాలెంజ్‌లు స్వీకరించడం ఇష్టమని, మరణభయంతో భద్రంగా ఒక మూల కూర్చోనని చెబుతున్నాడు. 


రిచర్డ్‌ది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌సైట్‌’ ప్రేమ. జోన్‌ టెంపుల్‌టన్‌ అనే అమ్మాయి ఓ షాపులో పనిచేసేది. ఆమెను చూసిన 30 సెకన్లలోనే ప్రేమలో పడ్డానని చెబుతాడు రిచర్డ్‌. ఆమెను చూడడం కోసమే ఆ షాపులో అవసరం లేకపోయినా అనేక వస్తువులు కొనేవాడు. తన చిన్న ఇంట్లో ఆ సామానులు పెట్టుకోవడానికి చోటు కూడా ఉండేది కాదు. చివరికి ఆమె ప్రేమను గెలుచుకున్నాడు. వారిద్దరికీ ఒక బాబు, పాప. మధ్యలో ఓ పాప పుట్టి కేవలం నాలుగురోజులకే మరణించింది. 


Updated Date - 2021-07-26T00:25:38+05:30 IST