Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 05 Apr 2022 20:28:43 IST

జయసుధ విషయంలో జోస్యం అలా నిజమైంది

twitter-iconwatsapp-iconfb-icon
జయసుధ విషయంలో జోస్యం అలా నిజమైంది

నటి జయసుధ తల్లితండ్రులు జోగాబాయి, రమేశ్‌. ఆమె తాత (జోగాబాయి తండ్రి) నిడదవోలు వెంకట్రావు గొప్ప పండితులు. సినిమాలు అంటే ఆసక్తి ఉండడంతో జోగాబాయి బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించారు. కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న ‘పెద్దమనుషులు’ సినిమాలో ఓ నృత్య సన్నివేశంలో కూడా పాల్గొన్నారు. రమేశ్‌ ఆ రోజుల్లో మద్రాసు కార్పొరేషన్‌లో పనిచేస్తూ, గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో క్యాంటీన్స్‌ నిర్వహించేవారు. జోగాబాయి ఇంటికి సమీపంలోనే ఉంటూ ఆంధ్రా విజ్ఞాన సభ పేరుతో నాటక సమాజాన్ని నడిపేవారు రమేశ్‌. అక్కడే జోగాబాయితో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి, పెళ్లికి దారి తీసింది. 1956 ఫిబ్రవరి రెండున వీరి పెళ్లి జరిగింది. రమేశ్‌ను పెళ్లి చేసుకున్న అనంతరం జోగాబాయి సినిమాలకు దూరమయ్యారు. పెళ్లయిన ఏడాదికే ఈ దంపతులకు ఓ కొడుకు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత 1958 డిసెంబర్‌ 12న సుజాత జన్మించారు. ఆమె తర్వాత సుభాషిణి, మనోహర్‌, వెంకటేశ్‌... వరుసగా పుట్టారు. కొడుకు హఠాత్తుగా చనిపోవడంతో సుజాతను చాలా జాగ్రత్తగా పెంచేవారు. జోగాబాయికి సినిమాలంటే చాలా ఇష్టం. సుజాతకు మాత్రం అవి అంటే ఆసక్తి ఉండేది కాదు. మూడు గంటల సేపు తలుపులు బిగించే ఆ థియేటర్‌లో ఎవరు కూర్చుంటారు.. అని తల్లితో వాదించేది సుజాత. 

జయసుధ విషయంలో జోస్యం అలా నిజమైంది

1968లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రమేశ్‌ తన ఫ్రెండ్స్‌తో ఒకసారి బెంగళూరు వెళ్లారు. అక్కడి జయా నగర్‌లో రిటైర్డ్‌ పోస్ట్‌ మాస్టర్‌ ఒకాయన ఉండేవారు. ఆయన చేయి చూసి జాతకం చెబితే కచ్చితంగా జరిగి తీరుతుందనే పేరు ఉండేది. జాతకాల మీద, అవి చెప్పే జ్యోతిషుల మీద రమేశ్‌కు నమ్మకం లేకపోయినా స్నేహితుల బలవంతం మీద ఆయన దగ్గరకు వెళ్లారు. మిత్రులు వత్తిడి చేయడంతో తన పిల్లల భవిష్యత్ గురించి అడిగారు రమేశ్‌. ఆయన వివరాలు అడిగి తెలుసుకుని ఏవో లెక్కలు వేసి ‘మీ పెద్దమ్మాయి సినిమా నటిగా ఎవరూ ఊహించని స్థాయికి ఎదుగుతుంది. గొప్ప పేరు, బోలెడు డబ్బు సంపాదిస్తుంది..’ అని చెప్పారు. సినిమాల పేరు ఎత్తితేనే మండి పడే సుజాత హీరోయిన్‌ కావడం ఏమిటని మనసులోనే నవ్వుకుని ఆ జోస్యాన్ని లైట్‌గా తీసుకొన్నారు రమేశ్‌. 


నాలుగు రోజుల తర్వాత ఆయన మద్రాసు తిరిగి వచ్చారు. ఇంట్లో సుజాత కనబడకపోవడంతో ఎక్కడికి వెళ్లిందని భార్యను అడిగారు. ‘పండంటి కాపురం’ సినిమాలో ఏదో చిన్న వేషం ఉందని మీ చెల్లెలు నిర్మల (విజయనిర్మల)తీసుకెళ్లింది’ అని జోగాబాయి చెప్పారు. రమేశ్‌కు విజయనిర్మల స్వయాన పినతండ్రి కూతురు. సుజాత ఇంటికి తిరిగి రాగానే ‘మనకు సినిమాలు ఎందుకు? ఇంకోసారి వెళ్లకు’ అని మందలించి చెప్పారు రమేశ్‌. అయితే ‘పండంటి కాపురం’ చిత్రంలో కమిట్‌ కావడంతో అది పూర్తి చేయక తప్పలేదు. సుజాతకు కూడా షూటింగ్‌ వాతావరణం నచ్చడంతో ఆసక్తి చూపించింది. ‘పండంటి కాపురం’ విడుదల కాగానే సుజాతకు మరో రెండు తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆమె తండ్రి రమేశ్‌కు ఏం చెప్పాలో అర్థం కాలేదు. భార్య జోగాబాయిని వెంటబెట్టుకుని మళ్లీ బెంగళూరు వెళ్లి ఆ జ్యోతిషుడిని కలిశారు. 

జయసుధ విషయంలో జోస్యం అలా నిజమైంది

‘మీరెవ్వరూ ఆ అమ్మాయిని ఆపలేరు. రాసి పెట్టి ఉందంతే. ఎవరెన్ని అవరోధాలు కలిగించినా ఆమె నటిగా పేరు తెచ్చుకోవడం ఖాయం’ అని చెప్పారాయన. ఆయన చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుండడంతో ఇక రమేశ్‌ కాదనలేకపోయారు. నటిగా సుజాత కొనసాగడానికి సమ్మతించారు. పరిశ్రమలో అప్పటికే సుజాత పేరుతో మరో నటి ఉండడంతో నటుడు ప్రభాకరరెడ్డితో చర్చించి, సుజాత పేరును జయసుధగా మార్చారు. ఇక అక్కడి నుంచి జయసుధ టాప్‌ హీరోయిన్‌గా ఎలా ఎదిగారన్న విషయం అందరికీ తెలిసిందే.

-వినాయకరావు

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement